చంద్రబాబును చెడుగుడు ఆడుకున్న జగన్

ప్రతిపక్షనేత వైఎస్ జగన్.. ముఖ్యమంత్రి చంద్రబాబుపై మరోసారి ఓ రేంజ్ లో ఫైర్ అయ్యారు. ఈమధ్య కాలంలో కాస్త సైలంట్ గా ఉన్న జగన్.. ఒంగోలు పార్టీ మీటింగ్ లో రెచ్చిపోయారు. చంద్రబాబు రోజుకో అబద్ధం చెబుతూ అధికారాన్ని నెట్టుకొస్తున్నారని మండిపడ్డారు. చంద్రబాబు నిజం చెప్పిన రోజు.. జనం ఆయన్ను రాళ్లతో కొడతారని తీవ్రవ్యాఖ్యలు చేశారు. ఎన్నికల్లో అబద్దపు హామీలు కురిపించి.. మోసంతో అధికారంలోకి వచ్చిన చంద్రబాబు ఇప్పుడు వాటిని నెరవేర్చలేక అబద్దాలతో పొద్దుపుచ్చుతున్నారని జగన్ విమర్శించారు.

చంద్రబాబు ఇచ్చిన ఒక్కో హామీని ప్రత్యేకంగా ప్రస్తావించిన జగన్.. ఏ ఒక్క హామీని కూడా చంద్రబాబు నెరవేరే పరిస్థితి లేదని విమర్శించారు. ఎన్నికలకు ముందు చెప్పినట్టు రైతు రుణమాఫీ, డ్వాక్రా రుణమాఫీ సక్రమంగా అమలు చేయాలంటే.. లక్ష కోట్లుకు పైగా సొమ్ము కావాలని.. చంద్రబాబు మాత్రం బడ్జెట్లో కేవలం 5వేల కోట్ల రూపాయలు కేటాయించి చేతులు దులుపుకున్నారని విమర్శించారు. ఇప్పటివరకూ రుణమాఫీ సొమ్ముపై వడ్డీ మాత్రమే 14వేల కోట్ల రూపాయలు దాటిందని.. బాబు కేటాయించిన 5 వేలకోట్లు ఏమూలకు సరిపోతాయని లెక్కలు చెప్పారు. రైతు రుణమాఫీకే ఆపసోపాలు పడుతున్న చంద్రబాబు మహిళల డ్వాక్రా రుణాలపై నోరు మెదపడం లేదని గుర్తుచేశారు.

ఎన్నికలకు ముందు ఇంటికో ఉద్యోగం అన్న చంద్రబాబు.. ఎన్నికల తర్వాత తాను ప్రభుత్వ ఉద్యోగాలు ఇస్తాననలేదని మాట మార్చారని చెప్పారు. నిరుద్యోగులకు 2వేల రూపాయలు ఇస్తానన్న హామీ ఏమైందని నిలదీశారు. చంద్రబాబులా అబద్దాలు చెప్పి ఉంటే.. వైఎస్సార్ పార్టీ అధికారంలోకి వచ్చి ఉండేదని.. కానీ.. దీర్ఘకాలిక లక్ష్యంతోనే తాను బాబులా అబద్దాలు చెప్పలేదన్నారు. పనిలో పనిగా జగన్ మరోసారి ఎల్లో మీడియా అంటూ ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9లపై విమర్శలు కురిపించారు. చంద్రబాబు అబద్దాలకు ఈ మూడు మీడియా హౌజులు వంతపాడాని ప్రజలను మోసం చేశాయన్నారు. రేపు బాబు హామీలు నెరవేర్చలేకపోయినా.. అందుకు కారణం కేంద్రం అలసత్వం, ఆర్బీఐ దుర్మార్గమని రేపు ఈనాడు, ఆంధ్రజ్యోతి, టీవీ9 ప్రచారం చేస్తాయని ప్రజలు జాగ్రత్తగా గమనించాలని జగన్ కోరారు.

Leave a Comment