ప్రజలూ దేవుడూ నా వైపే, స్వీప్: వైయస్ జగన్

jaganకడప: ప్రజలూ దేవుడూ తన వైపు ఉన్నారని, తనకు మెజారిటీ వచ్చి తీరుతుందని వైయస్సార్ కాంగ్రెసు పార్టీ అధ్యక్షుడు వైయస్ జగన్మోహన్ రెడ్డి ధీమా వ్యక్తం చేశారు. ప్రజలు ఒకే వైపున్నారని, తాము స్వీప్ చేస్తామని ఆయన అన్నారు. బుధవారం సాయంత్రం ఆయన మీడియా ప్రతినిధులతో మాట్లాడారు. అల్లర్లను లెక్కచేయకుండా పెద్ద ఎత్తున ప్రజలు ఓట్లు వేశారని ఆయన అన్నారు.ఢిల్లీకి సాగిలపడే ప్రభుత్వం కావాలా, ఢిల్లీ మెడలు వంచే ప్రభుత్వం కావాలా అని తాను ప్రజలను అడిగానని, మనకు సహకరించే ప్రభుత్వాన్ని కేంద్రంలో ఎన్నుకుందామని తాను చెప్పానని ఆయన అన్నారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు నారా చంద్రబాబు నాయుడి మాదిరిగా కాకుండా ఒత్తిడి తెచ్చి సీమాంధ్రకు మేలు చేసే ప్రధానిని ఎన్నుకుందామని తాను చెప్పానని ఆయన అన్నారు.
ప్రధాని ఎవరనేది ముఖ్యం కాదని, తమకు కావాల్సింది రాష్ట్ర ప్రయోజనమని, మనం అడిగినవన్నీ ఇచ్చే నేతను ప్రధానిని చేద్దామని తాను అన్నానని ఆయన వివరించారు. రాష్ట్ర విభజన విషయంలో కాంగ్రెసు అతి దారుణంగా వ్యవహరించి బిల్లు తెచ్చిందని, దానికి తెలుగుదేశం, బిజెపిలు సహకరించాయని ఆయన అన్నారు. అందరూ కలిసి రాష్ట్రంతో ఆడుకున్నారని ఆయన అన్నారు. దేవుడి దయ, ఆశీస్సులు తనకు ఉన్నాయని ఆయన చెప్పారు.ప్రధాని చదివి వినిపించిన లేఖలోని అంశాలు బిల్లులోకి రాలేదని ఆయన గుర్తు చేశారు. కొత్త రాజధానికి ఎన్ని నిధులు ఇస్తారనేది కూడా చెప్పలేదని ఆయన అన్నారు. ప్రత్యేక హోదా అన్నారు గానీ అది ఎలా ఉంటుందో చెప్పలేదని జగన్ విమర్శించారు. తెలుగుజాతి పౌరుషాన్ని కాపాడేవారినే గెలిపించాలని తాను కోరానని ఆయన చెప్పారు. తెలుగుదేశం పార్టీ అధ్యక్షుడు, ఆ పార్టీ నాయకులు సీమాంధ్రలో పోలింగ్ సందర్భంగా అల్లర్లు సృష్టించే ప్రయత్నం చేశారని ఆయన అన్నారు. ఎవరు ఎన్ని కుతంత్రాలు చేసినా తన విజయం ఖాయమని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

Leave a Comment