91 ఏళ్ల బామ్మ.. 42 కిలోమీటర్ల పరుగు

11వాషింగ్టన్ : గట్టిగా నాలుగు అడుగులు వేయాలంటేనే మనకు మహాబద్ధకం. అందులోనూ అరగంట నడవాలంటే మరీ కష్టం. అలాంటిది, 91 ఏళ్ల వయసులో.. అందునా కేన్సర్ వచ్చి తగ్గిన తర్వాత 42 కిలోమీటర్లు పరుగు పెట్టడం అంటే మాటలా? దాన్ని సాధించి చూపించింది అమెరికాకు చెందిన ఓ బామ్మ. మొత్తం 7 గంటల 7 నిమిషాల 42 సెకండ్లలో ఈ దూరాన్ని అధిగమించి, ఇంత మారథాన్ను పూర్తి చేసిన రెండో బామ్మగా అమెరికా చరిత్రలో నిలిచింది. ఆమె పేరు హారియట్ థాంప్సన్. తన స్నేహితురాలు లుకేమియా లింఫోమియా సొసైటీ కోసం నిధుల సేకరణకు చేపట్టిన పరుగులో ఆ బామ్మ పాల్గొంది. 21 కిలోమీటర్ల వరకు బాగానే పరిగెత్తాను గానీ, తర్వాత చాలా కష్టంగా అనిపించిందని, చుట్టుపక్కల మోగిస్తున్న బ్యాండ్ల మీదనే దృష్టి పెట్టి.. మొత్తం దూరాన్ని ఎలాగోలా పూర్తి చేసేసింది. ఈ సందర్భంగా మొత్తం 90 వేల డాలర్లు సేకరించి సొసైటీకి ఇచ్చింది.

ఉదయం 6.15 గంటలకు ఆమె తన పరుగు ప్రారంభించింది. అప్పటినుంచి ఏడు గంటలకు పైగా నిర్విరామంగా పరుగు తీస్తూనే వెళ్లింది. మధ్యలో కొంతమంది ఆపేయమని చెప్పారు గానీ, ఆమె సంకల్పం మాత్రం ఆగనని చెప్పింది. ఆమె ఫినిషింగ్ లైన్ దాటగానే ముందుగా వైద్య సిబ్బంది, తర్వాత టీవీ ఛానళ్ల వాళ్లు, ఫొటోగ్రాఫర్లు గుమిగూడారు. ముందు చల్లటి నీళ్లతో స్నానం చేసి.. మంచం మీద పడుకుండిపోవాలని అనిపిస్తోంది తప్ప మరేమీ అనిపించడంలేదని హేరియట్ బామ్మ చెప్పింది. ఇంతకు ముందు 92 ఏళ్ల వయసులో గ్లేడీస్ బరిల్ అనే అమెరికన్ మహిళ 9 గంటల 53 నిమిషాల పాటు పరుగు తీసింది. ఆమె తర్వాత ఈమెదే రికార్డు.

మరో విశేషం ఏమిటంటే.. 76 ఏళ్ల వయసు వచ్చేవరకు ఆమె ఇలాంటి పరుగు మొదలేపెట్టలేదు. 1987లో ఆమెకు కేన్సర్ సోకింది. దాన్ని జయించిన తర్వాత చర్చిలో ఓ స్నేహితురాలు ఏదో ఛారిటీ సొసైటీ కోసం పరుగు తీయడం చూసి, తానెందుకు పరిగెత్తకూడదని అనుకుంది. వెంటనే లుకేమియా అండ్ లింఫోమా సొసైటీని ఎంచుకుంది. మొదటి మారథాన్లో పాల్గొనడానికి నాలుగు వారాల ముందు వరకు ఆమె 11 రోజుల పాటు రేడియేషన్ చికిత్స తీసుకుంది. దాని ఫలితంగా రెండు కాళ్ల మీద విపరీతంగా గాయాలయ్యాయి. వాటికి బ్యాండేజిలు కట్టుకుని మరీ ఆమె పరుగు తీసింది. ఈసారి పరిగెత్తినప్పుడు 55 ఏళ్ల కొడుకు బ్రెన్నెమన్ కూడా ఆమెతో పాటు పరిగెత్తి, ఆమెకు సాయం చేశాడు. వచ్చే సంవత్సరం నాటికి తాను బతికుంటే.. మరోసారి పరిగెడతానని ధీమాగా చెప్పింది.

Leave a Comment