బందీలుగానే ఉన్నా..ఎటువంటి హాని జరగలేదు!

61408086224_625x300వాషింగ్టన్: ఇరాక్‌లో ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్ల చేతిలో అపహరణకు గురైన 39 మంది భారతీయులు క్షేమంగా ఉన్నారని ఇరాక్ ప్రభుత్వం వెల్లడించింది. రెండు నెలల క్రితం మోసుల్ పట్టణంలో అపహరణకు గురైన 39 మంది భారతీయులకు ఎలాంటి హాని జరగలేదని, అయితే వారిప్పటికీ బందీలుగానే ఉన్నారని విదేశాంగ శాఖ అధికార ప్రతినిధి అక్బరుద్దీన్ గురువారం తెలిపారు. ఇప్పటివరకు ఇక్కడ పనిచేస్తున్న 10,000 మంది భారతీయుల్లో 4500 మంది తిరిగి ఇరాక్ నుంచి స్వదేశానికి చేరుకున్నారన్నారు. కాగా, ఇరాక్‌లో మైనారిటీల పరిస్థితి దారుణంగా ఉందని గురువారం ఐక్యరాజ్య సమితి పేర్కొంది.
 
2011లో ఇరాక్ నుంచి అమెరికా దళాలు వెళ్లిపోయినప్పటి నుంచి మానవతకు సంబంధించి ఇదే అత్యంత దారుణమైన సంక్షోభమని వ్యాఖ్యానించింది. ఇస్లామిక్ స్టేట్ మిలిటెంట్లు, సున్నీ తిరుగుబాటుదారుల దాడుల కారణంగా మైనారిటీ క్రిస్టియన్లు, యెజిదిస్‌లు, ఇరాకీ కుర్దులు దారుణ అగచాట్లు పడుతున్నారని పేర్కొంది. లక్షలాదిగా ప్రజలు నిరాశ్రయులై సురక్షిత ప్రాంతాలకు వెళ్తున్నారని తెలిపింది.