సాహసం చేశాడు… డింభకుడు..!

51407696581_625x300ఏదో ఘనకార్యం చేసినట్లు.. ఆస్పత్రి మంచంపై పడుకుని ఫొటోలకు పోజిస్తున్న ఈ తొమ్మిదేళ్ల బుడ్డోడు జేమ్స్ బార్నీ. ఫ్లోరిడాలోని ఓసియోలా కౌంటీలో ఉంటున్నాడు. వీడు నిజంగానే ఓ పెద్ద సాహసం చేశాడు. చావుతప్పి కాలిపై స్వల్పగాయాలతో ఇలా బతికి బట్టకట్టాడు. ఇంతకూ ఏం జరిగిందంటే.. వీడి ఇంటికి సమీపంలో ఓ సరస్సు ఉంది. అందులో ఈతకొట్టడం నిషేధం. అందుకేనేమో అదే సరస్సులో ఈతకొట్టాలని మనోడికి సరదా పుట్టింది. ఇంకేం.. ఎవరికీ చెప్పకుండా వెళ్లి దబుక్కున దూకేశాడు. లోపల కాచుక్కూర్చున్న ఓ మొసలికి తెగ ఆనందమేసింది. అమాంతం వచ్చి కాలును పట్టేసుకుంది. అయితే వెంటనే తేరుకున్న వీడు దానిని ఇంకోకాలితో తంతూ విడిపించుకోవడానికి శాయశక్తులా ప్రయత్నించాడు.

పాపం బుడ్డోడు అనుకుందో ఏమో అది విడిచిపెట్టేసింది. వెంటనే అరుస్తూ ఒడ్డుకు వచ్చాడు. ఇరుగుపొరుగువారు వచ్చి బయటికి లాగారు. 911కి ఫోన్ చేయగానే.. పోలీసులు హెలీకాప్టర్‌తో వచ్చి వెంటనే ఆస్పత్రికి తరలించారు. అన్నట్టూ… మొసలి కొరికినప్పుడు వీడి తొడలపై దాని దంతాలు బాగా లోతుగా దిగాయట. ఓ దంతం విరిగిపోయి వీడి తొడలో చిక్కుకుపోయిందట కూడా. ఆ ముక్కను తీసుకుని మెళ్లో దండలా వేసుకుని.. అందరికీ ఈ మొసలితో పోరాటం గురించి చెబుదామని మనోడు సరదాపడ్డాడు కూడా. కానీ.. తొమ్మిది అడుగుల పొడవు, 180 కిలోల బరువూ ఉంటుందని భావిస్తున్న ఆ మొసలి చిక్కినప్పుడు దానిని గుర్తించేందుకు ఈ విరిగిన దంతం పనికొస్తుందని అధికారులు పట్టుకుపోయారు. సరేలే.. దంతం పోయినా.. తొడపై గాయాలున్నాయిగా? అంటూ వీడు చిరునవ్వులు రువ్వుతున్నాడు.