విభజన నిర్ణయంపై సోనియా పశ్చాత్తాపం

downloadఆంధ్రప్రదేశ్‌ రాష్ట్ర విభజన నిర్ణయం వల్లే ప్రస్తుతం కాంగ్రెస్‌ పార్టీ తీవ్ర దుస్థితిలో ఉన్నదన్న విషయాన్ని కాంగ్రెస్‌ అధ్యక్షురాలు సోనియాగాంధీ అంగీకరించారు. చివరి నిమిషంలో హడావిడిగా నిర్ణయం తీసుకోవడం తప్పేనని, దీనివల్ల కాంగ్రెస్‌కు తగిన రాజకీయ ప్రయోజనం రాలేదని ఆమె భావిస్తున్నట్లు తెలిసింది. ఇటీవల తనను కలిసిన కొందరు కాంగ్రెస్‌ ఎంపీల వద్ద ఆమె విభజన నిర్ణయం పట్ల పశ్చాత్తాపం ప్రకటించినట్లు తెలిసింది. ఆంధ్రప్రదేశ్‌లో గతంలో 33 సీట్లు కాంగ్రెస్‌ సాధించింది. ఇప్పుడు దేశ వ్యాప్తంగా కూడా కాంగ్రెస్‌కు 44 సీట్లకంటే ఎక్కువ రాలేదు. ఎన్నో ఏళ్లుగా అండగా ఉన్న ఆంధ్రప్రదేశ్‌ను పోగొట్టుకున్నాం.. ఇప్పుడు రాష్ట్రం నుంచి కేవలం రెండు సీట్లే దక్కాయి అని సోనియా వాపోయారు. విభజన నిర్ణయం వల్ల తన కుమారుడు రాహుల్‌ గాంధీ భవిష్యత్తు కూడా అగమ్యగోచర పరిస్థితిలో పడిరదని కాంగ్రెస్‌ భావిస్తోంది. ఇదంతా చేతులు కాలాక ఆకులు పట్టుకున్నట్లేనని కాంగ్రెస్‌ నేతలు అంటున్నప్పటికీ ఆంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో మళ్లీ పార్టీని పునరుద్దరించేందుకు అవకాశాల గురించి ఆ పార్టీ నేతలు తర్జన భర్జనలు పడుతున్నారు. అయితే ఆంధ్రప్రదేశ్‌ నేతలు మాత్రం సోనియా నేతృత్వంలో తిరిగి కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చే అవకాశాలు లేవని స్పష్టం చేస్తున్నారు. సోనియా పార్టీ పగ్గాలు వదిలిపెట్టాలి. రాహుల్‌ గాంధీకి కూడా నాయకత్వ లక్షణాలు లేవు. కొత్త నాయకత్వం వస్తే కాని ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌కు పునర్జన్మ రాదు.. అని పార్టీ నేతలు అంటున్నారు. నిజానికి పార్టీ వదిలిపెట్టిన పలువురు నేతలు ఉండవల్లి అరుణ్‌కుమార్‌, సబ్బం హరి, లగడపాటి రాజగోపాల్‌, కెఎస్‌ రావు తదితరులందర్నీ పార్టీలోకి ఆహ్వానించాలని కాంగ్రెస్‌ ఢల్లీి పెద్దలు భావిస్తున్నారు. ఏఐసీసీ రాష్ట్ర వ్యవహారాల ఇన్‌ఛార్జి దిగ్విజయ్‌ సింగ్‌ కూడా ఈమేరకు తన ప్రయత్నాలు ప్రారంభించారు. అయితే ప్రతి ఒక్కరూ సోనియా పట్ల వ్యతిరేకత వ్యక్తం చేయడంతో దిగ్విజయ్‌ సింగ్‌ హతాశుడైనట్లు సమాచారం. సోనియాగాంధీ కనీసం రాష్ట్ర విభజనకు బహిరంగంగా క్షమాపణ చెప్పాలి.. అప్పుడే నేను తిరిగి కాంగ్రెస్‌లోకి వచ్చే విషయం ఆలోచిస్తానని ఉండవల్లి అరుణ్‌ కుమార్‌ చెప్పారు. కాగా కాంగ్రెస్‌ నేతలు తిరిగి పార్టీలోకి వచ్చే విషయంపై దిగ్విజయ్‌ సింగ్‌ మాజీ ఎంపీ కేవీపీ రామచందర్‌ రావుతో కూడా సంప్రదింపులు జరిపినట్లు సమాచారం. ఆంధ్రప్రదేశ్‌లో కాంగ్రెస్‌ బతుకుతుందా అన్న ప్రశ్నకు నిర్దిష్టమైన సమాధానాలేమీ లేవని కాంగ్రెస్‌ నేతలు చెబుతున్నారు. నిజానికి కాంగ్రెస్‌ కార్యకర్తలంతా పార్టీతో ఉన్నారు. పార్టీ సమావేశాలకు పెద్ద ఎత్తున కార్యకర్తలు హాజరవుతున్నారు. పార్టీ కార్యక్రమాలు కూడా విజయవంతం అవుతున్నాయి. కాని కాంగ్రెస్‌కు ప్రజలు ఒక్క ఓటు కూడా వేసే స్థితిలో లేరు.. అని పార్టీ నేతలే అంగీకరించే పరిస్థితి ఏర్పడుతోంది. కాంగ్రెస్‌ బతికి బట్టకట్టాలంటే పార్టీ నేతల వద్ద పలు సూచనలున్నాయి. అందులో ప్రధానమైనది జాతీయ స్థాయిలో పార్టీ నాయకత్వం మారడం. అంటే సాధారణ ఎన్నికలు జరగడానికి ముందు పార్టీ జాతీయ స్థాయిలో మార్పులు జరగాలి. ఈ మార్పుల్లో భాగంగా ప్రియాంకా గాంధీని పార్టీ అధ్యక్షురాలుగా ప్రకటించాలి.. రాహుల్‌ గాంధీని ప్రధానమంత్రి అభ్యర్థిగా రంగంలోకి దించినా ఫర్వాలేదు కాని ప్రియాంక చేతుల్లో పార్టీ పగ్గాలుంటే, ఆమె దేశవ్యాప్తంగా మోడీకి వ్యతిరేకంగా రంగంలోకి దిగితే ప్రజల్లో పెద్ద ఎత్తున ప్రతిస్పందన వస్తుంది.. అని రాష్ట్ర నేతలు అంటున్నారు. ప్రియాంకాగాంధీ, రాహుల్‌ గాంధీ ఇద్దరూ కలిసి పనిచేయాలని, రాహుల్‌ ఒక్కడికే బాధ్యత అప్పజెబితే సరిపోదని వారు భావిస్తున్నారు. ఇప్పటికే పార్టీలో రాహుల్‌ వ్యతిరేకులు, అనుయాయులుల మధ్య ఘర్షణ ప్రారంభమైంది. సీనియర్ల వల్లే పార్టీ పరాజయం పాలయిందని రాహుల్‌ అనుయాయులు, పార్టీ యువనేతలు భావిస్తున్నారు. ఇటీవల బీజేపీ జాతీయ కార్యవర్గం, ఇతర పార్టీ బోర్డులు ఏర్పర్చినప్పుడు అద్వానీ వంటి సీనియర్లను సైతం ప్రక్కన పెట్టారని, కాంగ్రెస్‌లో కూడా అదే చేయాలని వారు భావిస్తున్నారు. దిగ్విజయ్‌ సింగ్‌, అంబికా సోనీ, జనార్దన్‌ ద్వివేదీ, మోతీలాల్‌ వోరా వంటి 70 దాటిన నేతలందర్నీ ఇంటికి పంపించాలని రాహుల్‌ తరం భావిస్తోంది. పార్టీ పగ్గాలు పూర్తిగా రాహుల్‌కు అప్పజెప్పాలని, రాహుల్‌ నిర్ణయించిన నేతల్ని కీలక పదవుల్లో నియమించాలని వారు చెబుతున్నారు. అయితే రాహుల్‌ గాంధీ అనుయాయులందరూ పెద్దగా ప్రజల్లో పలుకుబడి లేని వారు. ఎన్జీవోల్లాగా పనిచేసిన వారు జైరాం రమేశ్‌, కొప్పులరాజు వంటి రాజకీయ అనుభవం లేని, ప్రజల నాడి తెలియని నేతల్ని ఆంధ్రప్రదేశ్‌ వంటి కీలక రాష్ట్రాలకు పంపినందువల్లే ఫలితం అనుభవించామని జైపాల్‌ రెడ్డి వంటి సీనియర్లు సైతం అంటున్నారు. ఇపుడు సీనియర్లా, జూనియర్లా అన్నది ప్రధానం కాదని, ఏది చేస్తే పార్టీ బాగుపడుతుందో ఆలోచించాలని జైపాల్‌ వంటి సీనియర్లు భావిస్తున్నారు. రాహుల్‌తో పాటు ప్రియాంక కూడా సరైన సమయంలో ప్రత్యక్ష రాజకీయాల్లోకి వచ్చి పార్టీని పటిష్టం చేయాలని వారు భావిస్తున్నారు. అయితే ప్రియాంక రాజకీయాల్లో ప్రవేశించాలంటే నరేంద్రమోడీ పట్ల ప్రజల వ్యతిరేకత కొద్దిగానైనా ప్రారంభం కావాలని, ప్రజల్లో అసంతృప్తి లేనంత కాలం కాంగ్రెస్‌ ఎన్ని కార్యక్రమాలు చేపట్టినా ఉపయోగం ఉండదని పార్టీ నేతలంటున్నారు. మరో రెండేళ్లవరకు పార్టీని సజీవంగా ఉంచేందుకు మార్గాలు వెతకాలని, ఇందుకోసం సీనియర్లు, జూనియర్లు కలిసి పనిచేయాల్సి ఉంటుందని వారు చెబుతున్నారు. ఈ మధ్య కాలంలో జరిగే ప్రతి ఎన్నికల్లోనూ, కాంగ్రెస్‌ దాని మిత్రపక్షాలు కలిసి పోటీ చేసి బీజేపీని దెబ్బతీయాలని అప్పుడే పార్టీ నైతిక స్థైర్యం పెరుగుతుందని సీనియర్లు భావిస్తున్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో బీహార్‌, కర్ణాటక తదితర రాష్ట్రాల్లో బీజేపీయేతర పార్టీలన్నీ కలిసికట్టుగా పోటీ చేసినందువల్ల బీజేపీ విజయం సాధించలేకపోయింది. బీజేపీ గంతంలో గెలిచిన సీటులో కూడా మిత్రపక్షాలు గెలిచాయి. ఇదే వ్యూహాన్ని మహారాష్ట్ర ఎన్నికల్లో కూడా అవలంబించాలని ఎట్టి పరిస్థితుల్లోనూ మహా పీఠం బీజేపీకి రాకుండా చూడాలని కాంగ్రెస్‌ వ్యూహం పన్నుతోంది. అదే విధంగా మెదక్‌లో కూడా బీజేపీకి చెందిన జగ్గారెడ్డి విజయం సాధించకుండా చూడాలని కాంగ్రెస్‌ గట్టిగా భావిస్తోంది. మెదక్‌లో ఉన్న ప్రతి కాంగ్రెస్‌ సీనియర్‌ నేతకూ సోనియాగాంధీ స్వయంగా ఫోన్‌ చేసి మాట్లాడడం గమనార్హం. ఆంధ్రప్రదేశ్‌కు సంబంధించి పార్టీ వదిలిపెట్టిన నేతలందర్నీ తిరిగి పార్టీలోకి చేర్చుకోవడంపై పార్టీ దృష్టి కేంద్రీకరించింది. వైఎస్సార్‌ కాంగ్రెస్‌తో కలిసి వ్యూహత్మక ఒప్పందం ఏర్పర్చుకోవాలని, 2019 నాటికి జగన్‌ సారథ్యంలో ఎన్నికలకు వెళ్లాలన్న ఆలోచన కూడా కాంగ్రెస్‌ నేతల్లో ఉంది. విభజన పాపం తమది కాదని బీజేపీదేనని చెప్పడానికి కాంగ్రెస్‌ వ్యూహరచన చేస్తోంది. నిజానికి హైదరాబాద్‌ను తాము కేంద్రపాలిత ప్రాంతంగా మార్చాలనుకున్నామని, బీజేపీయే దానికి మోకాలడ్డిందని ఇటీవల జేడీ శీలం ఢల్లీిలో ప్రకటించారు. ఆంధ్రప్రదేశ్‌కు ప్రత్యేక హోదా కల్పించేందుకు మోడీ సర్కార్‌ సుముఖంగా లేదని కాంగ్రెస్‌ ప్రచారం చేస్తోంది. ఏమైనా తాము నిలదొక్కుకోవడానికి కాంగ్రెస్‌ చేయగలిగినన్ని ప్రయత్నాలు ప్రారంభించింది. తెలంగాణలో కూడా బీజేపీ బలపడుతోందని, ఆ పార్టీని దెబ్బతీయడానికి టీఆర్‌ఎస్‌ అధినేత కే.చంద్రశేఖర్‌రావు కూడా 2019లో కాంగ్రెస్‌పై ఆధారపడక తప్పదని పార్టీ నేతలు భావిస్తున్నారు. పొన్నాల లక్ష్మయ్య వంటి వారిని కొద్ది రోజులు కొనసాగించి సరైన సమయంలో బలమైన నేతలను తెలంగాణలో నియమించాలన్నదే కాంగ్రెస్‌ వ్యూహం. ఏమైనప్పటికీ చింత చచ్చినా పులుపు చావదన్నట్లు కాంగ్రెస్‌ అంధ్రప్రదేశ్‌, తెలంగాణల్లో బతికి బట్టకట్టడానికి మార్గాలు వెతుకుతోంది.

Leave a Comment