భారత్ పై అల్‌కాయిదా నజర్

Al Qaeda,‘ఖైదత్ అల్ జిహాద్’ పేరుతో ప్రత్యేక శాఖ ఏర్పాటు

* ముస్లిం ప్రాంతాల మధ్య సరిహద్దులను చెరిపేయడమే లక్ష్యం
* తాలిబన్ నేత ముల్లా ఒమర్ నేతృత్వం
* ఉపఖండంలో విస్తరిస్తామని అల్ కాయిదా చీఫ్ అల్ జవహరి ప్రకటన

న్యూఢిల్లీ: ఉగ్రవాదాన్ని విస్తరించడం, తీవ్రతరం చేయడమే లక్ష్యంగా నిషేధిత సంస్థ అల్‌కాయిదా భారత ఉపఖండంలో కొత్త శాఖను ప్రారంభించింది. ఇస్లామిక్ పాలన తీసుకురావడమే తమ లక్ష్యమని సంస్థ చీఫ్ అల్ జవహరి ప్రకటించాడు. భారత్, మయన్మార్, బంగ్లాదేశ్‌లలో ఇస్లామిక్ ఉగ్రవాదాన్ని విస్తరించేందుకు ‘ఖైదత్ అల్ జిహాద్’ను ఏర్పాటు చేస్తున్నట్లు వెల్లడించాడు. ఈ మేరకు 55 నిమిషాల నిడివి గల ఓ వీడియోను అమెరికా నిఘా సంస్థలు ఆన్‌లైన్‌లో గుర్తించాయి.

ఉపఖండంలో ముస్లిం జనాభాను వేరు చేస్తున్న కృత్రిమ సరిహద్దులను చెరిపేసేందుకు తమ కొత్త దళం పనిచేస్తుందని అల్‌కాయిదా చీఫ్ పేర్కొన్నాడు. ఖైదత్ అల్ జిహాద్ సంస్థ కొత్తదేమీ కాదని, అయితే భారత ఉపఖండంలోని ముజాహిదీన్లను దీని కిందకు తేవడానికి రెండేళ్లు శ్రమించాల్సి వచ్చిందని  తెలిపాడు. అల్‌కాయిదా భారత ఉపఖండంపై దృష్టిసారించడంపై సర్వత్రా ఆందోళన వ్యక్తమవుతోంది. కొత్తగా ఏర్పాటైన ఖైదత్ అల్ జిహాద్ సంస్థ కాశ్మీర్, మయన్మార్‌లో చిచ్చు పెట్టేందుకు ప్రయత్నించవచ్చన్ని అంతర్జాతీయ వర్గాలు అభిప్రాయపడుతున్నాయి.

అప్రమత్తమైన కేంద్రం
అల్‌కాయిదా తాజా వీడియో నేపథ్యంలో భారత్ అప్రమత్తమైంది. దేశవ్యాప్తంగా కేంద్ర ప్రభుత్వం అలర్ట్ ప్రకటించింది. ఈ వీడియో నిజమైనదేనని ఇంటెలిజెన్స్ బ్యూరో(ఐబీ) ధ్రువీకరించడంతో కేంద్ర హోంమంత్రి రాజ్‌నాథ్ సింగ్ హడావుడిగా భద్రతాధికారులతో సమావేశమయ్యారు. తాజా పరిస్థితిని సమీక్షించిన అనంతరం అప్రమత్తంగా ఉండాలని హోం శాఖ తరఫున అన్ని రాష్ట్రాలకు, భద్రతా సంస్థలకు హెచ్చరికలు జారీ చేశారు. దేశంలో అల్‌ఖాయిదా ఉనికిపై ఐబీ నిఘా పెట్టిందని, ఒకట్రెండు రోజుల్లోనే నివేదిక సమర్పిస్తుందని రాజ్‌నాథ్ తెలిపారు. కాగా, ఉపఖండంలో కొత్తగా ఉగ్రవాదులను చేర్చుకునేందుకు అల్‌ఖాయిదా చేస్తున్న ప్రయత్నాల్లో ఇది భాగ మేనని భద్రతాధికారులు అభిప్రాయపడుతున్నారు. మరోవైపు జమ్మూకాశ్మీర్‌లో అదనపు భద్రతా చర్యలు చేపడతామని ఆ రాష్ర్ట డీజీపీ ప్రకటించారు. ఎలాంటి సవాళ్లనైనా ఎదుర్కొంటామని డీజీపీ రాజేంద్రకుమార్ తెలిపారు.

వీడియోలో ఏముంది?
అమెరికా చేతిలో హతమైన అల్‌కాయిదా వ్యవస్థాపకుడు ఒసామా బిన్ లాడెన్ ప్రసంగంతో ఈ వీడియో మొదలైంది. తర్వాత ఆసియా, పశ్చిమాసియా, భారత ఉపఖండం, ఆఫ్రికా కొమ్ముగా పిలిచే ఇథియోపియా, సోమాలియా ప్రాంతాల శాటిలైట్ మ్యాప్‌లను ప్రదర్శించారు. ఆ తర్వాత జవహరి కనిపించాడు. ఉపఖండంలో కార్యకలాపాల విస్తరణ కోసం ‘ఖైదత్ అల్ జిహాద్’ సంస్థను ఏర్పాటు చేసినట్లు వెల్లడించాడు. అఫ్ఘాన్ తాలిబన్ నేత ముల్లా మహమ్మద్ ఒమర్ నాయకత్వంలో ఈ సంస్థ పనిచేస్తుందని పేర్కొన్నాడు.

రోజువారీ కార్యకలాపాలను పాక్‌కు చెందిన ఉగ్రవాద నాయకుడు అసిమ్ ఒమర్ పర్యవేక్షిస్తాడని జవహరి వెల్లడించాడు. తన ప్రసంగంలో అస్సాం, గుజరాత్, కాశ్మీర్ రాష్ట్రాలతో పాటు బంగ్లాదేశ్, మయన్మార్ పేర్లను ప్రత్యేకంగా ప్రస్తావించాడు. ముస్లిం జనాభా అధికంగా ఉన్న ఈ ప్రాంతాలపై కొత్త సంస్థ దృష్టి సారిస్తుందని కూడా స్పష్టం చేశాడు. ముజాహిదీన్లకు ముస్లింలంతా సహకరించాలని పిలుపునిచ్చాడు. తర్వాత ముల్లా ఒమర్‌తో పాటు కొత్త సంస్థ అధికార ప్రతినిధి ఉసామా మహమూద్ వేర్వేరుగా మాట్లాడారు. అల్‌కాయిదా మీడియా విభాగమైన అల్ సహబ్ ఈ వీడియోను ఆన్‌లైన్‌లో విడుదల చేసింది.

Leave a Comment