తక్కువ అంచనా వేయొద్దన్న బీజేపీ

download (2)ఇటీవల జరిగిన ఉప ఎన్నికల్లో భారతీయ జనతా పార్టీకి షాక్‌ తగిలింది. మోడీ పవనాలు వీయడం సంగతి అటుంచితే.. ఆ పార్టీకి గడ్డు పరిస్థితులే ఎదురయ్యాయనే అభిప్రాయాలు రాజకీయ వర్గాల్లో విన్పిస్తున్నాయి. ప్రధానంగా ఉత్తరప్రదేశ్‌లో తగిలిన షాక్‌తో బీజేపీ ఒకింత ఇబ్బంది పడ్తోందనే చెప్పాలి. తెలంగాణలోనూ బీజేపీకి షాకింగ్‌ రిజల్ట్‌ వచ్చింది. కనీసం రెండో స్థానమైనా దక్కుతుందనుకుంటే మెదక్‌లో మూడో స్థానానికి పరిమితమవ్వాల్సి వచ్చింది బీజేపీ. భారతీయ జనతా పార్టీ జాతీయ అధ్యక్షుడిగా అమిత్‌ షా ఎంపికయ్యాక ఈ ఫలితాలు రావడంతో, ప్రధాని నరేంద్ర మోడీ కూడా విస్తుపోవాల్సి వచ్చింది. తనకు అత్యంత సన్నిహితుడైన అమిత్‌ షాకి పార్టీ బాధ్యతలు అప్పగిస్తే.. ఆయన హయాంలో పార్టీ ఇబ్బందికర ఫలితాలు ఎదురుచూడాల్సి రావడం నరేంద్ర మోడీకీ మింగుడుపడ్డంలేదు. ఉత్తరప్రదేశ్‌ ఫలితాలు బీజేపీని ఓ రేంజ్‌లో ఇబ్బంది పెడ్తున్నాయి. ఇదిలా వుంటే, త్వరలో జరగనున్న నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో సత్తా చాటుకుంటామని బీజేపీ సారధి అమిత్‌ షా అంటున్నారు. ఇటీవల జరిగిన ఉప ఎన్నికల ఫలితాలు పార్టీ ఇమేజ్‌ని ఏమాత్రం తగ్గించలేవనీ, అవి ప్రత్యేక పరిస్థితుల్లో జరిగిన ఉప ఎన్నికలనీ అమిత్‌షా చెప్పుకొచ్చారు. ‘ఉప ఎన్నికల ఫలితాలతో బీజేపీని తక్కువ అంచనా వేయొద్దు.. నాలుగు రాష్ట్రాల ఎన్నికలతో మా సత్తా చాటుకుంటాం..’ అని అన్నారు అమిత్‌ షా. మరి, అమిత్‌ షా మాటల్లో నిజమెంత.? బీజేపీ అమిత్‌ షా కారణంగా వెలిగిపోతుందనుకున్న మోడీ ఆశలు నిజమవుతాయా.? నాలుగు రాష్ట్రాల ఎన్నికల్లో బీజేపీ సత్తా చాటుకుంటుందా.? వేచి చూడాల్సిందే.

Leave a Comment