కాశ్మీర్‌లో జలప్రళయం

images (2)ఇప్పటివరకు 150 మంది మృతి; వేలాదిగా నిరాశ్రయులు

జాతీయ విపత్తుగా ప్రకటించిన ప్రధాని
{పభావిత ప్రాంతాల్లో ఏరియల్ సర్వే
వెయ్యి కోట్ల అదనపు ఆర్థిక సాయం
జల దిగ్బంధంలో శ్రీనగర్

జమ్మూ/శ్రీనగర్: జల విలయానికి జమ్మూకాశ్మీర్ విలవిల్లాడుతోంది. అకస్మాత్తుగా ముంచుకొచ్చిన వరదలు రాష్ట్రంలో ఇప్పటివరకు దాదాపు 150 మందిని పొట్టన పెట్టుకున్నాయి. వందలాదిగా ప్రవాహ ఉధృతిలో కొట్టుకుపోగా, వరదల్లో చిక్కుకుపోయిన వేలాదిమంది సాయం కోసం ఎదురుచూస్తున్నారు. నిరాశ్రయుల సంఖ్య రోజురోజుకీ పెరిగిపోతోంది. జీలం సహా ప్రధాన నదులన్నీ పోటెత్తడంతో రాష్ట్రం జల దిగ్భంధంలో చిక్కుకుంది. జనజీవనం స్తంభించిపోయింది. విద్యుత్తు, రవాణా, ఫోన్ సౌకర్యాలు నిలిచిపోయాయి. ప్రభుత్వ కార్యాలయాలు, సైనిక కేంద్రాలు, సచివాలయం సహా శ్రీనగర్‌లోని అత్యధిక ప్రాంతాలను జీలం నది వరద జలాలు ముంచెత్తాయి. రాష్ట్రాన్ని అతలాకుతలం చేసిన ఈ జల ప్రళయాన్ని జాతీయ విపత్తుగా ప్రధాని నరేంద్రమోడీ ఆదివారం ప్రకటించారు. ఈ విపత్తును ఎదుర్కొనేందుకు జాతీయ విపత్తు ఉపశమన నిధి ద్వారా రాష్ట్రానికి అందించిన రూ. 1,100 కోట్లు ఏమాత్రం సరిపోవని భావించిన ప్రధాని.. సహాయ, పునరావాస చర్యల కోసం అదనంగా రూ. 1000 కోట్ల ఆర్థిక సాయాన్ని ప్రత్యేక సాయంగా ప్రకటించారు.  వరద నష్టం వివరాలు పూర్తిగా అందిన తరువాత అవసరమైతే మరింత సాయం అందిస్తామని హామీ ఇచ్చారు. వరదల కారణంగా చనిపోయిన ఒక్కొక్కరి కుటుంబాలకు రూ. 2 లక్షలు, తీవ్రంగా గాయపడ్డవారికి రూ. 50 వేలను ప్రధానమంత్రి(పీఎంఆర్‌ఎఫ్) సహాయనిధినుంచి అందిస్తామని ప్రధాని గురువారమే ప్రకటించడం తెలిసిందే.

ఆదివారం జమ్మూలో వరద ప్రభావిత ప్రాంతంలో ఏరియల్ సర్వే చేసిన ప్రధాని .. అనంతరం వరద పరిస్థితిని, సహాయ కార్యక్రమాలను జమ్మూ, శ్రీనగర్‌లలో సమీక్షించారు. ముఖ్యమంత్రి ఒమర్ అబ్దుల్లా, సీనియర్ అధికారులు ఆయనకు వివరాలందించారు. ఈ విపత్కర స్థితిలో జమ్మూకాశ్మీర్‌కు సాయమందించేందుకు అన్ని రాష్ట్రాలు ముందుకురావాలని ప్రధాని పిలుపునిచ్చారు. నిరాశ్రయుల కోసం కేంద్రం తరఫున 5 వేల టెంట్లను రాష్ట్రానికి పంపిస్తామన్నారు. లక్ష దుప్పట్ల కొనుగోలు కోసం పీఎంఆర్‌ఎఫ్ నుంచి రూ. 5 కోట్లను, పిల్లల ఆహార అవసరాల కోసం 50 టన్నుల పాల పొడిని, విద్యుత్ అవసరాల కోసం 2 వేల సౌర విద్యుత్ దీపాలను సమకూరుస్తామన్నారు. పాక్ కోరితే.. వరదల్లో చిక్కుకుపోయిన పాక్ ఆక్రమిత కాశ్మీర్‌కు సాయమందించేందుకు సిద్ధంగా ఉన్నామన్నారు. ఈమేరకు ఆయన పాక్ ప్రధానికి లేఖ కూడా రాశారు.

సహాయ కార్యక్రమాల్లో సైన్యం, ఐఏఎఫ్

మరోవైపు, సహాయ కార్యక్రమాలను రాష్ట్ర ప్రభుత్వం ముమ్మరం చేసింది.  ఇతర రాష్ట్రాల నుంచి కూడా సహాయ సామగ్రిని తెప్పిస్తోంది. జాతీయ విపత్తు ప్రతిస్పందన దళం నుంచి అదనపు బలగాలు కాశ్మీర్‌కు చేరుకుంటున్నాయి. ‘ఇది ఇంతకుముందెన్నడూ చూడని విపత్తు. భయపడొద్దు. సాధ్యమైనంత త్వరలో మిమ్మల్ని రక్షిస్తాం’ అని ఒమర్ ప్రజలకు హామీ ఇచ్చారు. 29 విమానాలు, హెలికాప్టర్లతో వాయుసేన సహాయ చర్యల్లో పాలుపంచుకుంటోంది. విపత్తు పర్యవేక్షణ కేంద్రాన్ని ఏర్పాటు చేసి, తమ దళాలను సర్వసన్నద్ధంగా ఉండాలని ఆదేశించింది. ఇప్పటివరకు 12,500 మందిని సైన్యం, ఐఏఎఫ్ దళాలు రక్షించాయి. నిరాశ్రయుల సంఖ్య పెరుగుతుండటంలో వీలైన చోట్ల టెంట్లు వేసి వారికి ఆశ్రయం కల్పిస్తున్నారు. బాధితులకు ఆహార, ఔషధాలందించేందుకూ చర్యలు చేపట్టామని సైన్యాధికారులు తెలిపారు. బోటు తిరగబడటంతో వరదల్లో కొట్టుకుపోయిన ఇద్దరు సైనికుల కోసం గాలింపును కొనసాగిస్తున్నామన్నారు. పాక్ సరిహద్దుకు దగ్గర్లోని ఆర్మీ శిబిరాల్లో చిక్కుకుపోయిన 108 మంది సైనికులను వైమానిక దళ హెలికాప్టర్ల ద్వారా సైన్యం రక్షించింది.  సహాయ చర్యల కోసం అవసరమైనన్ని పడవలు అందుబాటులో లేకపోవడంతో ఢిల్లీ నుంచి 100 బోట్లను తెప్పిస్తున్నారు.

జమ్మూలో తగ్గింది.. కాశ్మీర్‌లో పెరిగింది

జమ్మూ ప్రాంతంలో వరద నీటిమట్టం క్రమంగా తగ్గుతున్నందువల్ల సహాయ కార్యక్రమాలను మరింత వేగవంతం చేస్తామని సీఎం ఒమర్ అబ్దుల్లా తెలిపారు. శనివారం రాత్రి నుంచి జీలం నది ప్రవాహం పెరగడంతో కాశ్మీర్ లోయ ప్రాంతంలో వరద తీవ్రత పెరిగింది. ముఖ్యంగా శ్రీనగర్‌లో దీని ప్రభావం తీవ్రంగా ఉంది. జీలం నది కట్టలు తెంచుకుని ప్రవహిస్తుండటంతో వాణిజ్యకేంద్రమైన లాల్ చౌక్ ప్రాంతం నీట మునిగింది. ఇళ్లు కూలిపోయిన పలు ఘటనల్లో శనివారం 22 మంది చనిపోయారు.

Leave a Comment