నూజివీడు.. హాట్‌ కేక్‌.!

imagesఆంధ్రప్రదేశ్‌ రాజధాని ఎక్కడో తేలిపోయింది. రాజధాని నగరంగా విజయవాడ సరికొత్త గౌరవాన్ని అందుకోనుంది. విజయవాడ పరిసరాల్లోనే రాజధాని.. అని టీడీపీ అధినేత, ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటించగానే విజయవాడలో సంబరాలు షురూ అయ్యాయి. మొత్తంగా కృష్ణా జిల్లాలో ‘రాజధాని సంబరాలు’ మిన్నంటాయి. అదే సమయంలో గుంటూరు జిల్లాలో కాస్త ఆందోళన కన్పిస్తోంది. గుంటూరు – విజయవాడ మధ్య రాజధాని అన్నారుగా.. ఇప్పుడేమయ్యింది.? అని ఆందోళన చెందుతున్నారు గుంటూరు జిల్లా ప్రజానీకం. అదలా వుంచితే, విజయవాడ – నూజివీడు మధ్యన రాజధాని వస్తుందన్న ప్రచారంతో ఒక్కసారిగా ఆ ప్రాంతం హాట్‌ కేక్‌గా మారిపోయింది. ఆ ప్రాంతంలో వున్న తమ తమ సన్నిహితులను అడిగి, అక్కడి భూముల గురించి తెలుసుకుంటున్నారు చాలామంది. నూజివీడు తెలంగాణ సరిహద్దుకి కాస్త దగ్గర్లో వుండడం, తెలంగాణ రాష్ట్రం నుంచీ నూజీవీడులో భూముల గురించి వాకబులు ఎక్కువయ్యాయి. గన్నవరం, నందిగామ ప్రాంతాల మీదా రియల్‌ వ్యాపారులు ఒక్కసారిగా దృష్టి కేంద్రీకరించారు. క్షణాల్లో భూముల వివరాల్ని సేకరించేస్తున్నారు. ఒకటికి పదింతలు.. వందింతలుగా మారిపోయిందక్కడ భూముల ధరల వ్యవహారం. నిన్నటికీ నేటికీ పరిస్థితుల్లో స్పష్టమైన తేడా కన్పిస్తోందంటే విజయవాడ పరిసర ప్రాంతాల్లో భూముల ధరల జోరు ఎలా వుందో అర్థం చేసుకోవచ్చు. ఇప్పటికిప్పుడు లెక్కల ప్రకారం కృష్ణా, గుంటూరు జిల్లాల్లో మిగతా చోట్ల భూముల ధరలకన్నా అత్యంత భారీ స్థాయికి చేరుకున్నాకి విజయవాడ – నూజివీడు మధ్య ప్రాంతంలోని భూముల ధరలు. సింపుల్‌గా చెప్పాలంటే రియల్‌ వ్యాపారులకు ఇప్పుడు నూజివీడు హాట్‌ కేక్‌.

Leave a Comment