జాతీయ స్థాయిలో అయితే మిత్ర పక్షాలకు అవకాశం దక్కి.. లోక్‌సభ స్పీకర్ అవకాశం ఎవరికైనా దక్కొచ్చేమోగానీ, రాష్ట్రాల స్థాయిలో అధికార పార్టీకి చెందినవారికే శాసనసభ స్పీకర్‌గా అవకాశం దక్కుతుంటుంది. అధికార పార్టీకి చెందిన మనిషి అయినా, స్పీకర్ అంటే పార్టీలకు అతీతంగా వ్యవహరించాల్సిందే.. అలానే వ్యవహరిస్తూ వచ్చారు చాలామంది. కొందరి విషయంలో మాత్రం చాలా ఆరోపణలు వచ్చాయి.. చాలా వివాదాలూ తెరపైకొచ్చాయి. ఆంధ్రప్రదేశ్ విషయానికొస్తే, మాజీ సీఎం కిరణ్‌కుమార్‌రెడ్డి ఒకప్పుడు స్పీకర్‌గా పనిచేస్తే ఆయనపై అప్పట్లో తెలుగుదేశం పార్టీ గుస్సా అయ్యింది. ఆ తర్వాత స్పీకర్ స్థానంలోకి వచ్చిన నాదెండ్ల మనోహర్ ఎక్కడా కాంగ్రెస్ ఛాయలు కన్పించకుండా వ్యవహరించారు తాను స్పీకర్‌గా పనిచేసినన్నాళ్ళూ. అసెంబ్లీలో ఎలాగూ అధికార పార్టీకే ఎక్కువ అవకాశాలు కల్పించే వెసులుబాటు వుంటుంది కాబట్టి, కొంచెం జాగ్రత్తగా వ్యవహరిస్తే స్పీకర్ ఛెయిర్‌కి ఎలాంటి మచ్చా రాదు. కానీ, ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ స్పీకర్ కోడెల శివప్రసాద్ మాత్రం వివాదాల్లో ఇరుక్కుంటున్నారు. కొత్త రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ అవతరించాక, మొదటి దఫా శాసనసభ సమావేశాలు సజావుగా నడిచినా, రెండో దఫా శాసనసభ సమావేశాలు గందరగోళంగా మారిపోయాయి. స్పీకర్, అధికార పార్టీకి వత్తాసు పలుకుతున్నారని ప్రధాన ప్రతిపక్షం వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ ఆందోళనకు దిగుతోంది. అవసరమైతే స్పీకర్‌పై అవిశ్వాసానికీ సిద్ధమవుతామనే కోణంలో ఆ పార్టీ వ్యవహారం కన్పిస్తోంది. ప్రజాస్వామిక పద్ధతుల్లో వైఎస్సార్సీపీ నిరసన వ్యక్తం చేయడం సబబే. అదే సమయంలో, అవిశ్వాస తీర్మానం పెట్టినా, అది వీగిపోతుందని తెలుసు గనుక.. తొందరపడటమూ కాస్తంత ఇబ్బందికరమైన విషయమే. ఇదే అభిప్రాయం వైఎస్సార్సీపీలో వ్యక్తమవుతోంది. అందుకనే, స్పీకర్ తీరుపై అసహనం వ్యక్తం చేస్తూనే.. తమ ఆందోళనను మరింత తీవ్రతరం చేయాలని వైఎస్సార్సీపీ భావిస్తోంది. ‘అందరికీ సమాన అవకాశాలు కల్పిస్తున్నాను.. మీకు సమయం వచ్చినప్పుడు మాట్లాడండి.. అంతే తప్ప స్పీకర్ ఛెయిర్‌పై విమర్శలు చేయొద్దు..’ అని స్పీకర్ కోడెల శివప్రసాద్ తనపై వస్తున్న ఆరోపణల్ని తిప్పికొట్టే ప్రయత్నం చేస్తున్నా, మొదటి నుంచీ ఆయన వ్యవహార శైలిపై విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఫక్తు అధికార పార్టీ నేతగా ఆయన వ్యవహరిస్తున్న తీరు ఏమంత సమంజసంగా లేదని రాజకీయ వర్గాల్లోనూ చర్చ జరుగుతోంది. ఈ నేపథ్యంలో వివాదాస్పదమవుతున్న స్పీకర్ వ్యవహారం రానున్న రోజుల్లో ఎలాంటి మలుపులు తిరుగుతుందో వేచి చూడాల్సిందే.
Recent Comments