సీఎం క్యాంప్‌ ఆఫీస్‌లో రైతు ఆత్మహత్యాయత్నం.?

81411133789_625x3001411135099హైద్రాబాద్‌లోని ఆంధ్రప్రదేశ్‌ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు క్యాంప్‌ కార్యాలయం ` లేక్‌ వ్యూ అతిథిగృహంలో ఓ వ్యక్తి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటం కలకలం సృష్టిస్తోంది. ఓ వ్యక్తి పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నానికి పాల్పడటంతో అక్కడే వున్న క్యాంప్‌ కార్యాలయ సిబ్బంది అతన్ని ఆసుపత్రికి తరలించారు. ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డ వ్యక్తిని చిత్తూరు జిల్లాకు చెందిన గంగులప్పగా గుర్తించారు. అతని వయసు యాభై సంవత్సరాలు. గంగులప్ప ఓ రైతు అనీ, రుణమాఫీ అమలుకాకపోవడంతో మనస్తాపం చెంది ఆయన ఆత్మహత్యాయత్నానికి పాల్పడ్డాడనీ తెలుస్తోంది. ఇప్పటిదాకా తెలంగాణలోనే రుణమాఫీ అమలుకావడంలేదనే ఆవేదనతో పలువురు ఆత్మహత్యాయత్నానికి పాల్పడిన ఘటనలు వెలుగు చూశాయి. ఇప్పుడీ దారుణ పరిస్థితులు ఆంధ్రప్రదేశ్‌కీ పాకడం బాధాకరం. 2014 ఎన్నికలకు ముందు తెలుగుదేశం పార్టీ, తెలంగాణ రాష్ట్ర సమితి రుణమాఫీపై ప్రజలకు హామీలు ఇచ్చేశాయి. అధికారంలోకి వచ్చాక రుణమాఫీకి సంబంధించిన ఫైళ్ళపై టీడీపీ అధినేత చంద్రబాబు, టీఆర్‌ఎస్‌ అధినేత కేసీఆర్‌ సంతకాలు చేసినా, ఇప్పటిదాకా రుణమాఫీ ఆంధ్రప్రదేశ్‌లోగానీ, తెలంగాణలోగానీ అమలు కాలేదు. రిజర్వు బ్యాంకుపైనే నెపం మోపేస్తూ, తమ బాధ్యతలనుంచి ఏపీ సీఎం, టీఎస్‌ సీఎం తప్పించుకునే ప్రయత్నం చేస్తున్నారన్న విమర్శలున్నాయి. ఏదిఏమైనా.. ప్రపంచానికి తిండి పెడ్తోన్న రైతు, సవాలక్ష సమస్యలతో రోడ్డెక్కుతున్నాడు.. చివరికి బలవన్మరణానికి పాల్పడుతున్నాడు.. పాలకులు సిగ్గుపడాల్సిన విషయమిది.

Leave a Comment