రాజధాని విషయమై రాయలసీమ భగ్గుమంటోంది. రాజధాని తమకే దక్కాలంటూ రాయలసీమ జిల్లాల్లోని విద్యార్థులు రోడ్డెక్కుతున్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధానిపై కాస్సేపట్లో ముఖ్యమంత్రి చంద్రబాబు అసెంబ్లీలో ప్రకటన చేయనుండగా, ఇప్పటికే విజయవాడ ` గుంటూరు మధ్య రాజధాని.. అంటూ మీడియాలో వస్తున్న వార్తలతో రాయలసీమలో కలకలం రేగుతోంది. నిన్న కర్నూలులో ప్రజలు స్వచ్ఛందంగా బంద్‌లో పాల్గొన్న విషయం విదితమే. ఒకప్పటి ఆంధ్ర రాష్ట్రానికి కర్నూలు రాజధానిగా వుండేదనీ, తెలంగాణతో కలిశాక రాయలసీమ రాజధానిని కోల్పోయిందనీ, మళ్ళీ ఇప్పుడు తెలంగాణ వేరుపడి, 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్ ఏర్పడినందున రాజధాని తమకే దక్కాలన్నది రాయలసీమ ప్రాంత వాసుల ఆందోళన. రాజధాని విషయమై కేంద్రం నియమించిన శివరామకృష్ణన్ కమిటీ, విజయవాడ ` గుంటూరు రాజధానికి అనుకూలం కాదని తేల్చినా చంద్రబాబు, కుట్రపూరితంగా రాజధానిని తమకు కాకుండా చేస్తున్నారని ఆరోపిస్తున్నారు రాయలసీమ వాసులు. ఈ నేపథ్యంలోనే కడప, కర్నూలులో రాజధాని కోసం ఉద్యమం తీవ్రరూపం దాల్చుతోంది. అయితే, రాజధాని ఎక్కడ పెట్టినా, 13 జిల్లాలూ అభివృద్ధి చెందేలా కార్యాచరణను చంద్రబాబు రాజధానితోపాటే ప్రకటిస్తారని అధికార పార్టీ నేతలు చెబుతున్నారు. మొత్తమ్మీద, కాస్సేపట్లో చంద్రబాబు చేయనున్న రాజధాని ప్రకటన, దాని పర్యవసానాలెలా వుంటాయోగానీ, అంతకన్నా ముందే రాయలసీమ భగ్గుమంటోంది. ఉద్యమాలు తమకేం కొత్త కాదంటోన్న రాయలసీమ వాసుల్ని చంద్రబాబు, తన ప్రకటనతో ఎలా శాంతింపజేస్తారో కాస్సేపట్లో తేలనుంది.
Recent Comments