బాబును నిలదీయడమా..వాటే జోక్?

chandra babuరాయలసీమకు జరుగుతున్న అన్యాయం పై చంద్రబాబును నిలదీయాలని ఆ ప్రాంత నేత శైలజానాధ్ పిలుపునిచ్చారు. లేదంటే వారు చరిత్రలో ద్రోహులుగా మిగిలిపోతారన్నారు. వాస్తవం తెలిసే శైలజానాద్ ఇలా మాట్లాడుతున్నారని అనుకోవాలా?

ఇదేమన్నా కాంగ్రెస్ ప్రభుత్వమా, పార్టీనా, రాయలసీమ పులులు, టైగర్లు గొంతు సవరించుకుని ఇష్టం వచ్చినట్లు గాండ్రించడానికి. తెలుగుదేశం పార్టీ, ప్రభుత్వం. పులులైనా, టైగర్లయినా, తోకముడుచుకుని తమ తమ కోటల్లో కూర్చోవలసిందే. ఎక్కడో పొరపాటున ఎవరైనా గొంతెత్తారనే అనుకుందాం. అయినా ఏ మీడియా దాన్నిఫోకస్ చేస్తుంది చెప్పండి. ఒక్క చానెల్..ఒక్క పత్రిక తప్పించి ఇంకే చానెల్, ఇంకే పత్రిక వాటిని ఫోకస్ చేయవు.

అంతెందుకు, నిన్నటికి నిన్న రాయలసీమ సిటిజన్స్ ఫోరమ్ హైదరాబాద్ లో ప్రెస్ మీట్ పెట్టి ఇదే డిమాండ్ వినిపిస్తే, ఈనాడులో ఎక్కడ కనిపించింది. లోపలెక్కడో సింగిల్ కాలమ్ లో. అదే సిటిజన్ ఫోరమ్, రాయలసీమ వారు త్యాగం చేస్తారు. విజయవాడే బెటర్ అనమనండి..మర్నాడు ఫ్రంట్ పేజీలో తాటికాయంత అక్షరాల్లో రాకుంటే ఒట్టు. తొంభై శాతం మీడియా మొత్తం కట్టుగా దక్షిణ కోస్తా కొమ్ము కాస్తుంటే, శైలజానాధ్ ఈ తరహా పిలుపులు ఇచ్చి ఏం చేయాలని?

అంతగా కావాలంటే తెలంగాణకు వ్యతిరేకమైన చానెళ్లు మాకు వద్దు అన్న తెలంగాణ వారిలా, రాయలసీమ ను వ్యతిరేకించే మీడియా వద్దు అని చెప్పగలగాలి..ప్రజలు ఆచరించగలగాలి. అప్పుడు వినిపిస్తుంది రాయలసీమ గొంతు. లేకుంటే అంతే.