ఆంధ్రప్రదేశ్‌కి లక్ష కోట్లు.. ఎవరిస్తారు.?

 AP Capital,లక్ష కాదు, కోటి కాదు.. పది కోట్లు వంద కోట్లు కూడా కాదు.. వెయ్యి కోట్లు పది వేల కోట్లన్నా ఆలోచించొచ్చు.. లక్ష కోట్లు కావాంటే ఎలా.? ఎక్కడినుంచి వస్తాయి.? ఎవరిస్తారు.? లోటు బడ్జెట్‌తో ఏర్పడ్డ 13 జిల్లాల ఆంధ్రప్రదేశ్‌లో పెట్టుబడులు పెట్టడానికి పారిశ్రామికవేత్తలే వెనకడుగు వేస్తోంటే, లక్ష కోట్లు ఆంధ్రప్రదేశ్‌ రాజధాని కోసం అవసరం.. అన్న మాట అత్యంత కష్టతరమైనదే. కేంద్రం వెయ్యి కోట్లు విదిలిస్తే అది చాలా గొప్ప విషయం. అలాంటిది, కేంద్రం సహాయం అందించకుండా కొత్త రాష్ట్ర రాజధాని నిర్మాణం అసాధ్యమని తేలితే.. ఆంధ్రప్రదేశ్‌ పరిస్థితేంటి.! రాజధాని విషయమై కేంద్రం గతంలో నియమించిన శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికను కేంద్ర హోంశాఖకు అందించింది. ఆ నివేదికలో రాజధానికి సంబంధించి ఏయే విధంగా ఖర్చులు అవుతాయో పేర్కొంది. అసెంబ్లీ, సెక్రెటేరియట్‌, రాజ్‌భవన్‌.. ఇలా రకరకాల అంశాలకు సంబంధించి కోట్లలో లెక్కల్ని తేల్చింది. ఎన్ని ఎకరాలు కావాలి.? ఎన్ని కోట్లు ఖర్చు అవుతాయి.? లాంటి అంశాలపై లెక్కల్ని స్పష్టంగా నివేదికలో పొందుపర్చింది. మొత్తం లెక్కేస్తే లక్ష కోట్లకు పైగానే లెక్క తేలుతోంది. మొత్తంగా ఆంధ్రప్రదేశ్‌ అభివృద్ధి కోసం నాలుగున్నర లక్షల కోట్లు అత్యవసరమని శివరామకృష్ణన్‌ పేర్కొనడం గమన్హాం. ‘అవసరం’ వేరు, అంది వచ్చేది వేరు గనుక.. అవసరంలో పదో వంతు అయినా కేంద్రానికి రాష్ట్రం నుంచి అందుతుందా.? అన్నదిక్కడ మిలియన్‌ డాలర్ల ప్రశ్న. విభజన చట్టంలో పేర్కొన్న అన్ని అంశాలనూ అమలు చేస్తాం.. ఆంధ్రప్రదేశ్‌కి అండగా వుంటాం.. అని ప్రధాని నరేంద్ర మోడీ సహా, కేంద్ర మంత్రులు పలువురు పదే పదే చెబుతున్నారు. ఇప్పుడిక లెక్కలు తేలాయ్‌. కేంద్రం సాయమందించడమే తరువాయి. ప్రత్యేక హోదా తప్పనిసరి. ప్రత్యేక ప్యాకేజీ అత్యవసరం. ఇవన్నీ స్పష్టంగా తేలిపోయాయి గనుక, రోజుల గడువులోనే కేంద్రం, శివరామకృష్ణన్‌ కమిటీ నివేదికపై స్పందించి, తగు చర్యలు తీసుకోవాల్సి వుంటుంది. కానీ, పొరుగు రాష్ట్రాలు ఊరుకుంటాయా.? ప్యాకేజీలు, ప్రత్యేక హోదాపై ఇప్పటికే తమిళనాడు రాష్ట్ర ప్రభుత్వం కేంద్రానికి లేఖ రాసింది. ‘వాళ్ళకి అవన్నీ చేస్తే.. మా పరిస్థితేంటి.? మాకు పెట్టుబడులెలా వస్తాయి.?’ అని తమిళనాడు ముఖ్యమంత్రి, కేంద్రాన్ని ప్రశ్నించారు. దాంతో, కేంద్రం ఆంధ్రప్రదేశ్‌ని ఆదుకోవడం అనేది ప్రశ్నార్థకమే ప్రస్తుతానికి. కమిటీలు ఇచ్చే నివేదికలు, వాటిని కేంద్రం ఏ కోణంలో చూస్తుంది.. అన్న విషయాలపై గతంలోకి వెళ్ళి చూస్తే, వాస్తవం అర్థమవుతుంది. కమిటీలు నివేదికలు ఇస్తూనే వుంటుంది.. అంతిమంగా జరగాల్సింది రాజకీయ నిర్ణయం. ఆ రాజకీయం ఎప్పుడెలా వ్యవహరిస్తుందో ఎవరూ చెప్పలేరు. కాబట్టి, ఆంధ్రప్రదేశ్‌కి లక్ష కోట్లొస్తాయి.. నాలుగు లక్షల కోట్లు వస్తాయా.? అసలు ఏమీ రావా.? విదిలింపుల క్రమంలో ఏ వెయ్యి కోట్లో ఇచ్చి, ప్రత్యేక ప్యాకేజీ.. ప్రత్యేక హోదా.. వంటివి అటకెక్కించేస్తారా.? అనే ప్రశ్నలకు సమాధానం దొరకడం చాలా కష్టం.