ఢిల్లీ వెళ్ళొచ్చారు.. ఆంధ్రప్రదేశ్‌కి ఆర్థిక సహాయంపై విజ్ఞప్తి చేసొచ్చారు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు. ఇదిప్పటి మాట కాదు. చాన్నాళ్ళ క్రితం వ్యవహారం. ప్రధానితో భేటీ అయినా, కేంద్రంలోని పలువురు మంత్రులతో చంద్రబాబు మంతనాలు జరిపినా.. ఆ చర్చలు మాత్రం సత్ఫలితాలు ఇస్తున్న దాఖలాల్లేవు. విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్ కొత్త రాజధాని నిర్మాణం కోసం కేంద్రం సహకరిస్తామని గతంలో చెప్పింది. ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ రాజధాని ఎక్కడో తేలిందిగానీ, కేంద్రం ఇవ్వబోయే నిధుల వ్యవహారంపై స్పష్టత రాకపోవడం పలు అనుమానాలకు తావిస్తోంది. ఆంధ్రప్రదేశ్‌కి ప్రత్యేక హోదా, ఉత్తరాంధ్ర ` రాయలసీమ ప్రాంతాలకు ప్రత్యేక ప్యాకేజీ.. వీటిల్లో ఏ ఒక్కదానిపైనా కేంద్రం లైట్ తీసుకుంటోంది. విభజన చట్టం ప్రకారం ఆంధ్రప్రదేశ్‌కి తగిన సహాయం అందిస్తాం.. అని కేంద్రం చెబుతున్నప్పటికీ, విభజన చట్టంలో ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ వ్యవహారాలపై అప్పటి మన్మోహన్ సర్కార్ స్పష్టత ఇవ్వలేదు. రాజ్యసభలో మాత్రం ప్రధాని మన్మోహన్ ప్రత్యేక హోదా, ప్రత్యేక ప్యాకేజీ గురించి ప్రస్తావించారంతే. చట్ట సభల్లో మాట్లాడినదానికీ, చట్ట సభలు ఆమోదించిన బిల్లుకీ తేడాలుంటాయి కదా.! అదే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్‌కి శాపంలా మారేలా కన్పిస్తోంది. తాజాగా 14వ ఆర్థిక సంఘం ప్రతినిథులతో ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు భేటీ అయ్యారు. ఆంధ్రప్రదేశ్‌కి దక్కాల్సిన ఆర్థిక సహాయంపై ప్రతినిథులకు విజ్ఞప్తి చేశారు. స్వయంగా ప్రధానిని కలిసి విజ్ఞప్తి చేస్తేనే కేంద్రం నుంచి చిల్లిగవ్వ ఆంధ్రప్రదేశ్‌కి రానప్పుడు, ఆర్థిక సంఘం ప్రతినిథులు మాత్రం ఏం చేయగలరు.? ఆంధ్రప్రదేశ్ నుంచి కేంద్ర క్యాబినెట్‌లో ఇద్దరు వ్యక్తులు కీలక బాధ్యతలు నిర్వహిస్తున్నారు. ఒకరేమో బీజేపీ సీనియర్ నేత వెంకయ్యనాయుడు కాగా, మరొకరు టీడీపీ సీనియర్ నేత అశోక్ గజపతిరాజు. కేంద్ర మంత్రులుగా ఈ ఇద్దరూ తమ రాష్ట్రం బాగు కోసం ప్రయత్నించడంలేదన్న విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ఆ విమర్శలకు తగ్గట్టుగానే.. ఇదిగో చేస్తాం.. అదిగో చేస్తాం.. అనే కాలయాపనతోనే సరిపెడ్తున్నారు కేంద్ర మంత్రులిరువురూ.! ఇక, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు గురించి ఎంత చెప్పుకున్నా తక్కువే. స్మార్ట్ సిటీలు, మెగా సిటీలు.. ఇలా ఏవేవో పేర్లు చెబుతున్నారుగానీ, కేంద్రం నుంచి ఇవి రాబట్టాం.. అని వంద రోజుల పాలన గురించి గట్టిగా చెప్పుకోలేని దుస్థితి ఆయనగారిది. వాస్తవానికి దుస్థితి కేంద్ర మంత్రులదీ కాదు, ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రిదీ, ఆయన మంత్రివర్గానిదీ కాదు.. ఆంధ్రప్రదేశ్ ప్రజలది.!
Recent Comments