ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ‘ప్రభుత్వ ఉద్యోగాలకు’ సంబంధించి కీలకమైన రెండు నిర్ణయాలు తీసుకుంది గత మూడు నెలల్లో. మొదటిది ఉద్యోగుల పదవీ విరమణ వయస్సుని పెంచడమైతే, రెండోది ఉద్యోగార్థుల కోసం వయోపరిమితిని 34 ఏళ్ళ నుంచి 40 ఏళ్ళకు పెంచడం. ఈ రెండిటిలో మొదటిది ఉద్యోగులకు ఊరటనిస్తే, రెండోది నిరుద్యోగులకు కొత్త ఉత్సాహాన్నిస్తుందన్నదాంట్లో ఎవరికీ ఎలాంటి సందేహాల్లేవు. అంతా మంచేనా.? ఇందులో ఇబ్బందేమీ లేదా.? అంటే లేకనేం.. చాలానే వుంది. ఉద్యోగుల పదవీ విరమణ వయస్సుని పెంచడమంటే, నిరుద్యోగుల నెత్తిన బాంబు పేల్చినట్టే. రెండేళ్ళు ఉద్యోగుల పదవీకాలాన్ని పెంచుతూ ఇప్పటికే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం నిర్ణయం తీసుకోగా, ఆ కారణంగా ఖాళీ అయ్యే ఉద్యోగాల సంఖ్య తగ్గిపోతుంది. తద్వారా నిరుద్యోగులకు దిమ్మతిరిగి మైండ్ బ్లాంక్ అయ్యేలా షాక్ తగులుతుంది. ఖాళీలు ఏర్పడితేనే కదా, కొత్తగా ఉద్యోగాలకు నోటిఫికేషన్ వచ్చేది. పదవీ విరమణ వయస్సు పెంచితే నిరుద్యోగులు ఆశించేలా ఖాళీలెలా వస్తాయి.? ఇక, ఉద్యోగార్థుల కోసం గరిష్ట వయస్సు పరిమితిని నలభయ్యేళ్ళకు పెంచడమంటే, నిరుద్యోగుల మధ్య పెటీని పెంచడమే. 30 ఏళ్ళు వచ్చాక, దాదాపుగా ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశలు వదిలేసుకుంటారెవరైనా. ఇంకా నాలుగేళ్ళు అవకాశం వున్నా, ఆ నాలుగేళ్ళలో ఉద్యోగాలకు నోటిఫికేషన్లు రావాలి, వచ్చిన నోటిఫికేషన్లు ఫలించి ఉద్యోగాలు రావాలి.. ఇదంతా జరగడం పెద్ద ప్రసహనం. ఆ లెక్కన ఇప్పటిదాకా 30 ఏళ్ళ వయసులోనే ప్రభుత్వ ఉద్యోగాలపై ఆశల్లేకుండా పోతున్నాయి నిరుద్యోగులకి. అలాంటిది వయసు పరిమితిని 40 ఏళ్ళకు పెంచడమంటే.. ఆశలొదిలేసుకున్నోళ్ళలో కొత్త ఉత్సాహం వస్తుంది.. అది కాస్తా పోటీకి దారితీస్తుంది.. ఒక్కో ఉద్యోగానికీ పోటీ పడేవారి సంఖ్య అనూహ్యంగా పెరిగిపోతుంది. కొత్త రాష్ట్రంలో ప్రభుత్వం కొత్త ఉద్యోగాలకి తెరలేపి, తద్వారా ఆర్థిక భారం పెంచుకోవాలని అనుకుంటుందా.? అన్నదీ ఇక్కడ కీలకమైన విషయం. మామూలుగా అయితే ఇదేమీ అంత తేలికైన వ్యవహారం కానే కాదు. కానీ, నిరుద్యోగుల్ని తమవైపుకు తిప్పుకునే దిశగా చంద్రబాబు సర్కార్, నిరుద్యోగులకు ఎడాపెడా బంపర్ ఆఫర్స్ ప్రకటించేస్తోంది. నిరుద్యోగులకు ఉద్యోగాలు వస్తే దాన్ని ఎవరు మాత్రం కాదనగలరు.? అయితే రాష్ట్ర పరిస్థితుల నేపథ్యంలో ఎవరికీ ఎక్కువ ఆశలు పెట్టకుండా వాస్తవ పరిస్థితిని అందరికీ అర్థమయ్యేలా చెప్పాల్సిన బాధ్యత ప్రభుత్వంపై వుంది. మొత్తంగా చూస్తే చంద్రబాబు సర్కార్ నిర్ణయాలు కొంతవరకు ఆహ్వానించదగ్గవే అయినా, చాలా అనుమానాలకు తావిస్తున్నాయి. ఆ అనుమానాలకు నివృత్తి కలిగించగలిగితే నిరుద్యోగుల పాలిట చంద్రబాబు సర్కార్ వరాల జల్లు కురిపించినట్లే. లేదంటే మాత్రం, నిరుద్యోగుల నెత్తిన బండ మోపినట్లే అవుతుంది.
Recent Comments