ఏపీ సర్కార్‌కి సలహాలిచ్చిన టాలీవుడ్‌

downloadఆంధ్రప్రదేశ్‌లో తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి కోసం ఏమేం చర్యలు తీసుకుంటే బావుంటుంది.? అన్న ఎజెండాతో మంత్రి గంటా శ్రీనివాసరావు, తెలుగు సినీ పరిశ్రమకు చెందిన పలువురు ప్రముఖులతో సమావేశమయ్యారు. ఉమ్మడి తెలుగు రాష్ట్రం విభజన తర్వాత ఆంధ్రప్రదేశ్‌లోనూ తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి చెందాలన్న అభిప్రాయం సర్వత్రా వ్యక్తమవుతున్నా, తెలుగు సినీ పరిశ్రమ హైద్రాబాద్‌ నుంచి తరలి వెళ్ళడమో, సమాంతరంగా హైద్రాబాద్‌తోపాటు ఆంధ్రప్రదేశ్‌లో ఇంకెక్కడైనా అభివృద్ధి చెందడమో అంత సులభం కాదన్న వాదనా విన్పిస్తోంది. ఈ నేపథ్యంలో మంత్రి గంటా శ్రీనివాసరావు, తెలుగు సినీ ప్రముఖులతో జరిపిన సమావేశంపై సర్వత్రా ఆసక్తి నెలకొంది. కానీ, ‘చర్చలు ప్రాథమికంగానే జరిగాయి..’ అంటూ పరుచూరి సోదరులు, ‘షూటింగ్‌కి అనుమతుల్ని సులభతరం చేయడం, సెక్యూరిటీ వంటివి కల్పించడం..’ ఇలాంటి అంశాలపైనే చర్చలు జరిగాయని సురేష్‌బాబు చెప్పడంతో, ఆంధ్రప్రదేశ్‌లో తెలుగు సినీ పరిశ్రమ అభివృద్ధి చెందడం అనేది అంత తేలిక కాదన్న విషయం స్పష్టమైపోయింది. ఒకప్పుడు తమిళనాడులోని చెన్నయ్‌ కేంద్రంగా తెలుగు సినీ పరిశ్రమ పనిచేసింది. అక్కడినుంచి హైద్రాబాద్‌కి టాలీవుడ్‌ తరలి వచ్చేందుకే చాలా సమయం పట్టింది. అలాంటిది, హైద్రాబాద్‌ నుంచి విశాఖకో ఇంకో చోటికో సినీ పరిశ్రమ తరలి వెళ్ళడం చాలా కష్టమైన వ్యవహారం. పైగా, ఆంధ్రప్రదేశ్‌ ఆర్థిక స్థితి ఏమిటో ఎవరికీ అర్థం కాని పరిస్థితి. ఈ పరిస్థితుల్లో ఆంధ్రప్రదేశ్‌కి వెళ్ళినా, తమకు ప్రభుత్వం ఎలాంటి సౌకర్యాలు కల్పిస్తుందో అర్థం కాని అయోమయంలో టాలీవుడ్‌ పెద్దలు నిర్మొహమాటంగానే ఏపీ సర్కార్‌కి తమ అభిప్రాయాల్ని తేల్చి చెప్పేశారు. ఇదిలా వుంటే, మంత్రి స్థాయిలో జరిగిన చర్చల ఫలితాలు నిరాశపర్చడంతో, ముఖ్యమంత్రి చంద్రబాబు రంగంలోకి దిగుతారా.? అన్న దిశగా సినీ, రాజకీయ వర్గాల్లో ఆసక్తికరమైన చర్చ జరుగుతోంది.