35 కిలోల బరువున్న గౌనులో…!

81404927858_625x300సన్నగా మెరుపు తీగలా చూడచక్కగా ఉంటారు అనుష్క శర్మ. ఆమె బరువు అటూ ఇటూగా ఓ యాభై కేజీలు ఉంటుందేమో. కథానాయికలందరూ దాదాపు ఈ బరువునే మెయిన్‌టైన్ చేస్తుంటారు. అందుకే.. ‘దేవదాస్’, ‘జోధా అక్బర్’ చిత్రాల్లో ఐశ్వర్యారాయ్, ‘అరుంధతి’ సినిమాలో అనుష్క కేజీల కొద్దీ నగలు, బరువున్న దుస్తులు ధరించినప్పుడు ‘లేత భామలు ఎంతో భారం మోస్తున్నా’రని చెప్పుకున్నారు.

ఇప్పుడు అనుష్కశర్మ గురించి ఈ విధంగా చెప్పుకుంటున్నారు. ప్రస్తుతం ఆమె నటిస్తున్న చిత్రాల్లో ‘బాంబే వెల్వెట్’ ఒకటి. ఇందులో అనుష్క శర్మ జాజ్ సింగర్‌గా నటిస్తున్నారు. ఆధునిక యువతి పాత్ర కాబట్టి, చాలా స్టయిలిష్‌గా కనిపిస్తారు. ఈ సినిమాలో దాదాపు 144 రకాల దుస్తుల్లో కనిపిస్తారు ఈ బ్యూటీ.

వాటిలో ఓ పొడవాటి గౌను ఉంది. ఆ గౌను బరువు 35 కేజీలు. దీన్ని నిహారికా బాసిన్‌ఖాన్ డిజైన్ చేశారు. పొడవాటి గౌను కాబట్టి, అనుష్క నడుస్తున్నప్పుడు ఇద్దరు అసి స్టెంట్లు రెండు వైపులా ఆమెతో నడుస్తూ గౌను పట్టుకోవాల్సి వచ్చేదట. ఈ గౌనులో నడవడమే కష్టం అంటే.. ఇక డాన్స్ చేయాల్సి వస్తే అనుష్క పరిస్థితి ఎలా ఉంటుందో ఊహించుకోవచ్చు.

కానీ, అదృష్టం కొద్దీ కేవలం టాకీ సీన్స్‌కి మాత్రమే ఈ గౌను వాడుతున్నారు. ఈ గౌను డిజైన్ చేయడానికి చాన్నాళ్లు పట్టిందట. మొత్తం డిజైనింగ్ పూర్తయిన తర్వాత నిహారికా ఊపిరి పీల్చుకున్నారు. కానీ, ఈ చిత్రం షూటింగ్ శ్రీలంకలో జరిగినప్పుడు, అక్కడి వర్షాలకు గౌను పై భాగం మొత్తం తడిచిపోయింది. దాంతో డ్యామేజ్ అయినంతవరకూ కత్తిరించి మళ్లీ డిజైన్ చేశారు.

Leave a Comment