అధ్యక్షుడిగా ఘనీ

downloadకాబూల్: అఫ్ఘానిస్థాన్ తదుపరి అధ్యక్షునిగా మాజీ ఆర్థిక మంత్రి అష్రాఫ్ ఘనీ విజయం సాధించారు. దీంతో కొద్ది నెలలుగా అఫ్ఘాన్‌లో నెలకొన్ని రాజకీయ ప్రతిష్టంభనకు తెరపడింది. అధ్యక్ష ఎన్నికల్లో పరస్పరం తలపడిన అష్రాఫ్ ఘనీ, అబ్దుల్లాల మధ్య అధికార పంపకానికి సంబంధించి ఆదివారం ఐక్యతా ఒప్పందం కుదిరింది. ఈ ఒప్పందం కుదిరిన కొద్దిసేపటికే అఫ్ఘాన్ అధ్యక్ష ఎన్నికల్లో ఘనీ ఘనవిజయం సాధించినట్టు ఆ దేశంలోని స్వతంత్ర ఎన్నికల సంఘం అధికారికంగా ప్రకటించింది. గణాంకాలతో సంబంధం లేకుండా ఎన్నికల కమిషన్ చీఫ్ అహ్మద్‌యూసఫ్ నురిస్థానీ ఈ ప్రకటన చేయడం గమనార్హం. జూన్‌లో జరిగిన అధ్యక్ష ఎన్నికల తుది ఫలితాలు విడుదల కావాల్సిన సమయంలో ఎన్నికల సరళిపై ఆరోపణలు వెల్లువెత్తడంతో ప్రతిష్టంభన నెలకొన్న సంగతి తెలిసిందే.

ఈ నేపథ్యంలో ఎన్నికల్లో తామే గెలుపొందామని ఘనీ, అబ్దుల్లా ప్రకటించుకున్నారు. అయితే 1990 తరహాలో అంతర్గత యుద్ధం రాకుండా ఐక్యతా ప్రభుత్వ ఏర్పాటుకు కృషి చేయాలని ఐక్యరాజ్యసమితి ఒత్తిడి తేవడంతో ఘనీ, అబ్దుల్లా అందుకు అంగీకరించారు. సుదీర్ఘ చర్చల అనంతరం ఆదివారం కాబూల్‌లోని అధ్యక్ష కార్యాలయంలో నిర్వహించిన కార్యక్రమంలో వీరిద్దరూ ఐక్యతా ఒప్పందంపై సంతకాలు చేశారు.

అధ్యక్షునిగా ఎన్నికైన అష్రాఫ్ ఘనీ.. అబ్దుల్లాను ప్రధానమంత్రితో సమానమైన చీఫ్ ఎగ్జిక్యుటివ్ ఆఫీసర్ (సీఈవో) పోస్టులో నియమించనున్నారు. అఫ్ఘాన్ రాజ్యాంగం ప్రకారం అధ్యక్షునికే పూర్తి అధికారాలు ఉంటాయి. అయితే 2001లో ఏర్పాటైన ప్రభుత్వానికి భిన్నంగా ఇప్పుడు ఐక్యతా ప్రభుత్వ పాలన కాస్త సంక్లిష్టంగా సాగనుంది. దీనికి తోడు భద్రతా పరమైన, ఆర్థికపరమైన ఇబ్బందులు కొత్త ప్రభుత్వం ఎదుర్కోనుంది. దేశ శ్రేయస్సు దృష్ట్యా ఐక్యతా ఒప్పందం చేసుకున్న ఘనీ, అబ్దుల్లాలను ప్రస్తుత అధ్యక్షుడు హమీద్ కర్జాయ్ అభినందించారు.

Leave a Comment