ఆ నష్టం నా వల్ల కాదు

81405792122_625x300అతిథి చిత్ర నిర్మాణంలో జాప్యానికి, అధిక నిర్మాణ వ్యయానికి తానేమి కాణం కాదని నటి అనన్య స్పష్టం చేసింది. ఎంగేయుం ఎప్పోదుం, నాడోడిగళ్ చిత్రాలతో తమిళంలో ప్రాచుర్యం పొందిన మలయాళ భామ అనన్య. ఈమె నటించిన తాజా చిత్రం అతిథి ఇటీవల తెరపైకి వచ్చింది. అయితే ఈ చిత్ర నిర్మాత, ప్రతినాయకుడు నిఖేష్‌రామ్ నటి అనన్య చాలా ఇబ్బందులకు గురి చేసిందని, ఆమె వల్ల 50 లక్షల వరకు నష్టం కలిగిందని తీవ్ర ఆరోపణలు చేశారు.

అనన్య సరైన సమయానికి షూటింగ్‌కు వచ్చేది కాదని నక్షత్ర హోటల్లో తన భర్తతో కలిసి బస చేసి ఇష్టానికి ఖర్చు చేసిందని పలు ఆరోపణలు గుప్పించారు. అయితే నటి అనన్య అవన్నీ అవాస్తవ ఆరోపణలని కొట్టిపారేసింది. ఆమె స్పందిస్తూ తన వల్ల అతిథి చిత్రానికి ఎలాంటి సమస్యలు కలగలేదని పేర్కొంది. చిత్ర షూటింగే ప్రణాళిక ప్రకారం జరగలేదని చెప్పింది. ఇతర కారణాల వల్లే చిత్ర షూటింగ్ చాలా సార్లు రద్దు అయ్యిందని తెలిపింది. అందువల్ల తన కాల్‌షీట్స్ చాలా వృథా అయ్యాయని అంది.

తన బసకు ఏర్పాటు చేసిన హోటల్ నచ్చక పోవడంతో వేరే హోటల్‌కు మారానని అందుకు అయిన అదనపు ఖర్చును తానే భరించానని చెప్పింది. చాలాసార్లు షూటింగ్ ప్రారంభానికి ముందే స్పాట్‌కు వచ్చేదానినని తెలిపింది. షూటింగ్ లేకుండా చాలా రోజులు ఖాళీగా గడిపానని చెప్పింది. కాబట్టి షూటింగ్ జాప్యానికి తాను కారణం కాదని స్పష్టం చేసింది. తన కెన్యా పర్యటన రద్దు అయ్యిందని అందువల్లే ఆ ఖర్చును చెల్లించమని అడిగానంది. అలాగే మలయాళ చిత్రాల షూటింగ్‌లలో బిజీగా ఉండడంతో అతిథి చిత్ర ప్రచార కార్యక్రమంలో పాల్గొనలేక పోయానని అనన్య అంది.

Leave a Comment