శభాష్… భువనేశ్వర్

61405798227_625x300లార్డ్స్‌లాంటి గొప్ప క్రికెట్ మైదానంలో ఆడిన తన తొలి టెస్టులోనే హానర్స్ బోర్డులోకి చేరడం ఏ క్రికెటర్‌కైనా గొప్ప గౌరవం. ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో ఆరు వికెట్లతో భువనేశ్వర్ కుమార్ ఈ ఘనత సాధించాడు.
 
 ఈ చారిత్రక మైదానంలో 200 ఏళ్లు పూర్తి చేసుకున్న సందర్భంగా ఈ ఘనత సాధించడం కచ్చితంగా భువీ ఆనందాన్ని రెట్టింపు చేస్తుంది. ఇంగ్లండ్‌తో రెండో టెస్టులో భారత బౌలింగ్‌కు తను వెన్నెముకలా నిలబడకపోతే ఈ పాటికి ఇంగ్లండ్ తొలి ఇన్నింగ్స్‌లో భారీ ఆధిక్యంతో ఉండేది. భువనేశ్వర్ బౌలింగ్ శైలికి ఇంగ్లండ్ వికెట్లు బాగా సరిపోతాయి. ఎందుకంటే కొత్త బంతితో తన తరహాలో మరే భారత బౌలర్ స్వింగ్ రాబట్టలేడు. అందుకే ఈ సిరీస్‌లో ధోనికి ప్రధాన అస్త్రంగా మారాడు.
వరుసగా రెండు టెస్టుల్లో మూడు ఇన్నింగ్స్‌ల్లో రెండు అర్ధసెంచరీలతో లోయర్ ఆర్డర్ బ్యాటింగ్‌లోనూ ఉపయోగకరంగా మారాడు. అలాగే బౌలింగ్‌లో మూడు ఇన్నింగ్స్‌ల్లో 11 వికెట్లు తీశాడు. భారత్‌కు ఈ సిరీస్‌లో లభించిన మొదటి సానుకూల అంశం భువనేశ్వర్ ప్రదర్శన. సిరీస్ ప్రారంభమైన రెండు వారాల్లోనే ఈ యూపీ పేసర్ శభాష్ అనిపించుకున్నాడు. ఇదే నిలకడను సిరీస్ మొత్తం కొనసాగిస్తే భారత్ కచ్చితంగా మెరుగైన స్థితిలో ఉండటం ఖాయం.
 
 అవకాశం: లార్డ్స్‌లో ఒక మ్యాచ్‌లో 10 వికెట్ల ఘనత ఏ భారత బౌలర్ ఇప్పటిదాకా సాధించలేదు. రెండో ఇన్నింగ్స్‌లో మరో నాలుగు వికెట్లు తీయగలిగితే భువనేశ్వర్ పేరు చరిత్రలో చిరస్థాయిగా నిలిచిపోతుంది.      లార్డ్స్ హానర్స్ బోర్డులో భారత బౌలర్లు :
నిస్సార్ (1932), అమర్ సింగ్ (1936), లాలా అమర్‌నాథ్ (1946), మన్కడ్ (1952), ఆర్.బి.దేశాయ్ (1957), చంద్రశేఖర్ (1967), బేడి (1974), కపిల్ దేవ్ (1982), చేతన్ శర్మ (1986), వెంకటేశ్ ప్రసాద్ (1996), ఆర్పీసింగ్ (2007), ప్రవీణ్ కుమార్ (2011), భువనేశ్వర్ (2014).

3 లార్డ్స్‌లో ఆరు వికెట్లు తీసిన మూడో భారత బౌలర్ భువనేశ్వర్. గతంలో అమర్‌సింగ్, బేడి ఈ ఘనత సాధించారు.

 

 

Leave a Comment