అధ్యక్ష రేసులో మనోడు

images (2)ప్రపంచానికి పెద్ద అన్నయ్య అయిన అమెరికా దేశాధ్యక్షుడిగా భారతీయ మూలాలున్న వ్యక్తి ఎన్నికైతే ఎలా ఉంటుంది? అలాంటి అవకాశం త్వరలోనే వచ్చేలా ఉంది. తాజాగా వెలువడుతున్న వరుస కథనాలను బట్టి చూస్తే.. ఈసారి అమెరికా అధ్యక్ష ఎన్నికల్లో భారతీయ మూలాలు ఉన్న బాబీ జిందాల్ పోటీ చేయొచ్చని తెలుస్తోంది. 2016లో అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి. ఈ నేపథ్యంలో అక్కడి పార్టీలు తమ అభ్యర్థులు ఎంపిక కసరత్తును మొదలుపెట్టాయి. ఇందుకోసం చర్చల మీద చర్చలు జరుపుతూ మేథోమథనం చేస్తున్నాయి. రిపబ్లికన్ పార్టీ మాత్రం లూసియానా గవర్నర్ బాబీ జిందాల్ను నిలబెట్టేందుకు సన్నాహాలు చేస్తోందని సమాచారం. లూసియానా గవర్నర్గా బాబీ జిందాల్ రెండుసార్లు ఎన్నికయ్యారు. ఆయన పదవీ కాలం 2015తో ముగియనుంది. ఆ తర్వాత ఏడాది అమెరికా అధ్యక్ష ఎన్నికలు జరగనున్నాయి.

అమెరికాలో స్థిరపడుతున్న భారతీయుల సంఖ్య రోజురోజూకు పెరిగిపోతుంది. అధ్యక్ష ఎన్నికల్లో వాళ్ల ఓట్లు కూడా చాలా కీలకమే. అమెరికా మాజీ అధ్యక్షుడు జార్జి బుష్, ప్రస్తుత అధ్యక్షుడు ఒబామాలకు అత్యంత ప్రీతిప్రాతులైన వ్యక్తుల్లో బాబి జిందాల్ ఒకరు. వైట్ హౌస్లో కీలక పదవుల్లో పని చేసిన అనుభవం బాబి సొంతం. అటు అమెరికన్లు, ఇటు భారతీయుల మనస్సులు గెలుచుకోగల సత్తా ఒక్క బాబీకే ఉందని రిపబ్లికన్లు భావిస్తున్నారు.

ప్రపంచాన్ని మార్చే అత్యంత శక్తిమంతమైన 10 మంది వ్యక్తుల్లో బాబీ జిందాల్ ఒకరని ఇటీవల ఓ సర్వేలో తేలింది. దీంతో ఆ పార్టీలో దాదాపు 70 శాతం మంది బాబీవైపే మొగ్గు చూపుతున్నారు. అందుకే అధ్యక్ష పదవికి అభ్యర్థిగా రిపబ్లికన్ పార్టీ నాయకులు ఎంపిక చేసే అవకాశాలు మెండుగా ఉన్నాయి. భారత్లోని పంజాబ్ రాష్ట్రానికి చెందిన బాబీ జిందాల్ కుటుంబం పూర్వీకులు అమెరికాకు ఎప్పుడో వలస వెళ్లారు. ఆ కుటుంబం అక్కడ స్థిరపడింది. 1979లో బాబీ జిందాల్ జన్మించారు. అక్కడే ఆయన సైన్స్, న్యాయశాస్త్రాలలో పట్టా పొందారు. సామాన్య స్థాయి నుంచి అంచెలంచెలుగా ఎదిగిన బాబీ జిందాల్ దేశాధ్యక్ష పదవికి జరిగే ఎన్నికల బరిలో నిలవబోతున్నారు.

Leave a Comment