పాఠ్యపుస్తకాలకు ‘పసుపు’ రంగు?

  • 41404465815_625x300పాఠ్యపుస్తకాల్లో ఎన్టీఆర్ ని జొప్పిస్తే, ప్రకాశం పంతులు, బ్రహానంద రెడ్డి, వైఎస్ ఆర్ ల మాటేమిటి?
  • ఎన్టీఆర్ కి వెన్నుపోటు పొడిచిన వైనాన్ని చెబుతారా చెప్పరా?
  • పాఠ్యాంశాల రాజకీయకరణం సమర్థనీయమేనా?
  • పాఠ్యపుస్తకాలకు పసుపు రంగు పూయడం కాషాయీకరణ లాంటిది కాదా? 
పాలకులు మారగానే పాఠాలు మారతాయా? పాఠ్యాంశాలుగా ఉన్న వ్యక్తుల జాబితా మారుతుందా? ఎవరి గురించి పాఠాలు ఉండాలి? అవి ఎంత మేరకు చెప్పాలి? చెబితే అంతా చెప్పాలా? అసౌకర్యమైన అంశాలను చెప్పకుండా అనుకూలమైన ముక్కలనే పాఠాలుగా ఉంచాలా?
తెలుగుదేశం వ్యవస్థాపకుడు ఎన్టీ రామారావు గురించి పదో తరగతి పాఠ్యపుస్తకంలో ఒక పాఠాన్ని ఉంచాలని తెలుగుదేశం చేస్తున్న ప్రయత్నాలు ఈ ప్రశ్నలన్నిటికీ దారి తీస్తున్నాయి. ఎన్టీఆర్ గురించి, తెలుగు ఆత్మగౌరవం గురించి ఆ పాఠంలో చెబుతారని తెలుస్తోంది. ఈ పాఠ్యపుస్తకం ఈ విద్యా సంవత్సరం నుంచే అమలులోకి వస్తోంది.
అయితే ఇది తెలుగుదేశం గురించి ప్రచ్ఛన్నంగా పాఠ్యపుస్తకాల్లో చెప్పి, విద్యార్థుల బుర్రల్లోకి పచ్చదనాన్ని ఎక్కించడం తప్ప మరేమీ కాదు. పదో తరగతిలోనే పచ్చరంగు పులిమేస్తే బాగుంటుందన్న దీర్ఘకాలిక లక్ష్యంతోనే ఇదంతా జరుగుతోందన్న ప్రశ్నలు వస్తున్నాయి.
ఎన్టీఆర్ గురించి రాసేటప్పుడు ఇందిరా గాంధీ, రాహుల్ గాంధీ, ఆయన రాజకీయ ప్రత్యర్థుల గురించి ఏం రాస్తారు? ఎన్టీఆర్ కథ చెప్పేటప్పుడు ఆయన్ని వెన్నుపోటు పొడిచిన వారి గురించి, ఆయనను వ్యతిరేకించిన కుటుంబ సభ్యుల గురించి కూడా చెబుతారా? ఎన్టీఆర్ ను గద్దె దించే కుట్రలో పాలుపంచుకున్న వారి గురించి కూడా చెబుతారా? రాజ్య సభ సభ్యుడు, కాంగ్రెస్ నేత వి హనుమంతరావు ఇదే ప్రశ్నను లేవనెత్తారు.
సమకాలీన రాజకీయ నేతల చరిత్రను పాఠ్యాంశంగా చేర్చడంతో చాలా సమస్యలున్నాయి. ప్రభుత్వం మారగానే పాఠం ఎగిరిపోతుంది. పైగా కొత్తగా వచ్చిన ప్రభుత్వం తమ నాయకుడి గురించి పాఠాలను జొప్పించడానికి సాకుగా మారుతుంది. ఈ ఉద్దేశ్యంతోనే నరేంద్ర మోడీ తన జీవితాన్ని పాఠ్యాంశంగా చేయాలన్నరాజస్థాన్, మధ్యప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ప్రయత్నాలను తిరస్కరించారు.
నరేంద్ర మోడీతో ఎన్నికల పొత్తు, ఎన్డీయే కూటమిలో భాగస్వామ్యం ఉన్న చంద్రబాబు ఇలాంటి ప్రయత్నం చేయకపోవడమే మంచిది. నరేంద్ర మోడీ బాటలోనే పయనించడం చాలా మంచిది.
పాఠ్యాంశాలకు పసుపు రంగు పులమడం, కాషాయీకరణ లాంటిదే. కాషాయీకరణను వ్యతిరేకించిన చంద్రబాబు, ఈ ‘పసుపీకరణ’ ను ప్రోత్సహించడం విడ్డూరమే కాదు, విషాదం కూడా!

Leave a Comment