ఎనిమిదేళ్లలోపు పిల్లలను ముందు సీట్లో కూర్చోపెట్టరాదు

download (2)న్యూఢిల్లీ: రోడ్డు ప్రమాదాల నియంత్రణ కోసం కేంద్ర ప్రభుత్వం రోడ్డు రవాణా, భద్రత ముసాయిదా బిల్లులో జైలు శిక్షలు, భారీ జరిమానాలతోపాటు పలు ముఖ్యమైన నిబంధనలు పొందుపరిచింది. మోటారు వాహనం ముందు సీట్లో ఎనిమిదేళ్లలోపు పిల్లలను కూర్చోబెట్టడానికి సంబంధించి ఇందులో నిబంధనలు ఉన్నాయి. నియమ నిబంధనల్లో చెప్పినట్టు సహేతుక కారణం లేకుండా ఎనిమిదేళ్లలోపు పిల్లలను తల్లిదండ్రులు లేదా సంరక్షకుడు లేదా డ్రైవర్ వాహనం ముందు సీట్లో కూర్చోబెట్టకూడదని బిల్లు చెబుతోంది. డ్రైవర్‌తోపాటు ప్రయాణికుడు సీటు బెల్టు ధరించడాన్నీ ఇది తప్పనిసరి చేస్తోంది. బస్సు ప్రయాణికులు, ఇతర వాహనాల్లో ప్రయాణించేవారూ దీనిని తప్పక ధరించాలని పేర్కొంటోంది. సీటు బెల్టుల ధారణలో నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.5 వేల జరిమానా, శిరస్త్రాణాలు ధరించడానికి సంబంధించి నిబంధనలు ఉల్లంఘిస్తే రూ.2,500 జరిమానా విధించాలని ప్రతిపాదిస్తోంది.
ఆయా వాహనాల్లో ఉండాల్సిన అధునాతన సాంకేతిక పరిజ్ఞానాలకు సంబంధించి కూడా బిల్లులో నిబంధనలు ఉన్నాయి. వీటిలో- పరిమితికి మించిన వేగంపై డ్రైవర్‌ను హెచ్చరించే ‘ఇంటెలిజెంట్ స్పీడ్ అడాప్టేషన్’, డ్రైవర్ అలసటను గుర్తించే ‘ఐ డ్రౌజినెస్ డిటెక్టర్’, ఇతర పరిజ్ఞానాలు ఉన్నాయి. ఏకగవాక్ష విధానంలో ఆటోమేటెడ్ డ్రైవింగ్ లైసెన్స్ జారీ ప్రక్రియను, ఏకీకృత వాహన నమోదు విధానాన్ని, జాతీయ సరకు రవాణా విధానాన్ని తీసుకురావాలని బిల్లు చెబుతోంది. జాతీయ రోడ్డు రవాణా, బహుళ జాతీయ సమన్వయ ప్రాధికార సంస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదిస్తోంది.

Leave a Comment