చైనా పెట్టుబడులు రూ.18లక్షల కోట్లు

download (2)చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భారత పర్యటన ఉభయ దేశాల్లోనే కాకుండా అంతర్జాతీయంగానూ ఆసక్తిని రేపుతోంది. ప్రపంచంలోనే రెండో బలమైన ఆర్థికశక్తిగా అవతరించిన చైనా, ఆర్థికసంక్షోభాన్ని తట్టుకుని అభివృద్ధిలో వేగంగా దూసుకెళ్తున్న భారత్ మధ్య ఏయే రంగాల్లో, ఎంత విలువ చేసే వాణిజ్య ఒప్పందాలు కుదురాతాయన్న దానిపై సర్వత్రా ఆసక్తి నెలకొని ఉంది. రెండు దేశాలకు నాయకత్వం బలంగా ఉండడం కలిసొచ్చే అంశంగా ఉంది. భారత ప్రధాని మోడీ, చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ మధ్య కొన్ని సారూప్యతలున్నాయి. చైనా రాజకీయాల్లో నేతలు ప్రావిన్సుల నుంచే ఎదుగుతారు. ప్రావిన్సుల్లో చక్కటి అభివృద్ధిని చేసి చూపించి రుజువు చేసుకున్న వారినే జాతీయస్థాయికి అనుమతించే నిర్మాణం అక్కడి కమ్యూనిస్టు పార్టీలో ఉంది. భారత ప్రధాని మోడీ కూడా గుజరాత్ అభివృద్ధితో రుజువై జాతీయస్థాయి నాయకుడిగా ఎదిగిన సంగతి తెలిసిందే. జిన్‌పింగ్ అధ్యక్షుడు అయిన తర్వాత రాజకీయ, సైనిక, ఆర్థిక అధికారాలన్నింటినీ కేంద్రీకృతం చేశారు. గతంలో సైన్యంపై అధ్యక్షుడికి నేరుగా నియంత్రణ ఉండేది కాదు. ఆర్థిక విధానాల నిర్ణయ సంస్థ ప్రధాని కార్యాలయం కనుసన్నల్లో నడిచేది. ఇప్పుడు అధ్యక్షుడి నియంత్రణలోకి వచ్చింది. మోడీ కూడా రక్షణరంగం, ఆర్థిక విధానాల రూపకల్పన విషయంలో స్వయంగా దృష్టి కేంద్రీకరిస్తున్నారు. కమ్యూనిస్టు పార్టీలో అంతర్గతంగా ఉన్న అవినీతికి వ్యతిరేకంగా జిన్‌పింగ్ పెద్ద ఎత్తున ప్రచారం ప్రారంభించారు. ప్రజాప్రతినిధుల అవినీతి కేసుల విచారణ త్వరగా ముగించాలన్న పట్టుదలతో మోడీ ఉన్నారు.
ఇద్దరు నేతలు పాత విషయాలను పక్కనపెట్టి భిన్నమైన విప్లవాత్మక పరిష్కారాలను కనుగొనవచ్చని మోడీకి సన్నిహితుడైన భాజపా నేత ఒకరు విశ్లేషించారు. ఇటీవల మోడీ జపాన్ పర్యటనలో భారత్-జపాన్ మధ్య దాదాపు రూ.2లక్షల కోట్ల ఒప్పందం కుదిరిన నేపథ్యంలో చైనా మరింత దూకుడుగా వ్యవహరించే అవకాశాలున్నాయి. భారతీయ రైల్వేలు, భారీ మౌలిక సదుపాయాల ప్రాజెక్టులు, పారిశ్రామిక పార్కుల్లో చైనా రూ.6లక్షల కోట్ల నుంచి రూ.18లక్షల కోట్ల వరకు పెట్టుబడి పెట్టే అవకాశాలున్నాయని ఆ దేశ అధికారులు చెప్పారు.

పారిశ్రామిక పార్కులు: మహారాష్ట్రలో ఆటోమొబైల్ పారిశ్రామిక పార్కు, గుజరాత్‌లో విద్యుత్ ట్రాన్స్‌మిషన్ పార్కు ఏర్పాటు చేయడానికి చైనా ప్రతిపాదించింది. ఈ పార్కుల అభివృద్ధికి చైనా కంపెనీలు రూ.36,500 కోట్లు పెట్టుబడి పెట్టవచ్చు.

కొనుగోలు ఒప్పందాలు: దాదాపు 24 కంపెనీలు భారత కంపెనీలతో ఉత్పత్తుల కొనుగోలుకు ఒప్పందాలు కుదుర్చుకోవచ్చు. కాపర్ క్యాథోడ్, మత్స్యసంపద, పత్తి నూలు (కాటన్ యార్న్), పారిశ్రామిక ఉప్పు, పాలిప్రొపిలీన్ వంటి ఉత్పత్తుల కొనుగోలు ఒప్పందాలు కుదురుతాయని భావిస్తున్నారు. ఈ కొనుగోలు ఒప్పందాలతో చైనాతో ప్రస్తుతం ఉన్న వాణిజ్యలోటును కొంత పూడ్చుకోవచ్చు. ఈ లోటు 2013-14లో దాదాపు రూ.2లక్షల కోట్లు ఉంది.

రైల్వే రంగం: భారత్‌లో హైస్పీడ్ రైళ్లకు మార్గాలను అభివృద్ధి చేసే విషయంలో ఉభయ దేశాల మధ్య ఒప్పందం కుదరవచ్చు. కర్ణాటకలో హైస్పీడ్ రైలు కోసం 650 కి.మీ. ట్రాక్ అభివృద్ధికి చైనా కంపెనీలు ఒప్పందం కుదుర్చుకోవచ్చు. ఆటోమేటెడ్ సిగ్నలింగ్ వ్యవస్థకు సంబంధించి కూడా ఒప్పందాలు కుదరవచ్చు. రైల్వే రంగం అభివృద్ధిలో చైనాకు విశేష అనుభవం ఉంది. స్వాతంత్య్రం వచ్చినప్పటి నుంచి ఇప్పటి వరకు భారత్ 11వేల కి.మీ.మేర మాత్రమే కొత్త మార్గాన్ని అభివృద్ధి చేయగా 2011 నాటికి ఐదేళ్లలో చైనా 14వేల కి.మీ. కొత్తగా మార్గాన్ని అభివృద్ధి చేసింది. భారతీయ రైల్వేల ఆధునికీకరణలో చైనా పెట్టుబడులు రూ.3లక్షల కోట్లకు చేరవచ్చని ముంబయిలోని చైనా కాన్సుల్ జనరల్ లీ యూఫా చెప్పారు. పుణే, అహ్మదాబాద్‌లో ట్రాక్ వెంబడి రెండు లాజిస్టిక్ పార్కులను ఏర్పాటు చేసే అవకాశాలున్నాయి. రైల్వేలో పరస్పర సహకారానికి ఇప్పటికే రెండు దేశాల మధ్య అవగాహన ఒప్పందం కుదిరింది.

ఓడరేవులు: ఓడరేవులు, రహదారుల అభివృద్ధి, నదులను అనుసంధానం చేసే ప్రాజెక్టులో మరో రూ.3లక్షల కోట్ల వరకు పెట్టుబడులు పెట్టడానికి చైనా సిద్ధంగా ఉన్నట్లు అధికారులు చెబుతున్నారు.

గుజరాత్‌లో: ప్రధాని మోడీ స్వరాష్ట్రమైన గుజరాత్‌లో పారిశ్రామిక పార్కుతో పాటు చైనా మరో రెండు ఒప్పందాలు చేసుకునే అవకాశాలున్నాయి. అహ్మదాబాద్, చైనాలోని గాంగ్‌షౌ నగరాల మధ్య సోదరనగర ఒప్పందం, గుజరాత్ ప్రభుత్వం, చైనాలోని గాంగ్‌డాంగ్ ప్రావిన్సు మధ్య ఒప్పందాలు చేసుకోనున్నట్లు గుజరాత్ ఆర్థికమంత్రి సౌరభ్ పటేల్ చెప్పారు. భారత్‌లో ప్రస్తుతం చైనా పెట్టుబడులు దాదాపు రూ.2,40,000 కోట్లు కాగా అందులో ఎక్కువ భాగం గుజరాత్‌లోనే ఉన్నాయి.

మరికొన్ని రంగాలపైనా చైనా ఆసక్తి: వాణిజ్య, ఆర్థికఅభివృద్ధి, ఔషధ రంగం తదితర రంగాల్లో 16 ఒప్పందాలు కుదరవచ్చు. వాతావరణ మార్పులు, ఇంధన ఉత్పత్తి, ఆహారభద్రత, ఉగ్రవాద వ్యతిరేకపోరు, సాంస్కృతిక-పర్యాటక రంగాలు, చలనచిత్రరంగం వగైరా రంగాల్లోనూ సహకార ఒప్పందాలకు సిద్ధంగా ఉన్నట్లు చైనా ఇప్పటికే ప్రకటించింది. షి జిన్‌పింగ్ పర్యటనలో అణురంగంలో సహకారంపైనాచర్చ జరగవచ్చు.

Leave a Comment