రోజుకూలీ కొడుకు.. పతకం కొట్టాడు!!

61406353810_625x300కొల్హాపూర్ : ఆయన పేరు చంద్రకాంత్ మాలి. రోజు కూలీగా పనిచేస్తుంటారు. పొద్దున్నే లేచి కూలికి వెళ్తే తప్ప పూట గడవదు. కానీ, గురువారం మాత్రం రాత్రంతా ఆయన మేలుకునే ఉన్నారు. స్కాట్లండ్‌లోని గ్లాస్గోలో జరుగుతున్న కామన్వెల్త్ క్రీడల ప్రసారాన్ని టీవీలో చూస్తూనే ఉండిపోయారు. అర్ధరాత్ర 1.30 గంటలయ్యింది. అప్పుడు ఉన్నట్టుండి ఒక్కసారిగా లేచి ఆనందంగా అరిచారు. అవును.. ఆయన కొడుకు గణేశ్ మాలి కామన్వెల్త్ క్రీడల్లో వెయిట్ లిఫ్టింగ్ కాంస్య పతకం సాధించాడు!! మహారాష్ట్రలోని కొల్హాపూర్ జిల్లా షిరోల్ తాలూకా కురుండ్వాడ్ గ్రామంలోని బసవేశ్వర్ కాలనీలో ఉన్న వాళ్ల బంధువులంతా ఆనందోత్సాహాలలో మునిగిపోయారు.

వెయిట్ లిఫ్టింగ్‌లోని 56 కిలోల విభాగంలో 21 ఏళ్ల గణేశ్ మాలి కాంస్య పతకం సాధించాడు. చంద్రకాంత్ మాలి పెయింటర్‌గా పనిచేసుకుంటుంటే, ఆయన భార్య అనిత పొలాల్లో కూలికి వెళ్తారు. వాళ్ల ఏకైక కొడుకు గణేశ్. అతడు దేశం తరఫున ఆడి పతకం సాధించాడని తెలిసి తన ఆనందానికి అంతులేదని, అతడే తమ ఆశాకిరణమని చంద్రకాంత్ చెప్పారు. గత కొన్ని రోజులుగా వర్షాలు కురుస్తుండటంతో మాలి దంపతులు పనిలోకి కూడా వెళ్లలేకపోయారు. అయినా.. ఇప్పుడు గణేశ్ పతకం సాధించడంతో వాళ్ల ఆవేదన మొత్తం ఒక్క క్షణంలో తీరిపోయింది. గణేశ్ మాలి ఇంటర్మీడియట్ వరకు చదివి, ఎయిర్‌ఫోర్స్‌లో చేరాడు. సెలవు రోజుల్లో ఇంటికి వచ్చి, తల్లిదండ్రులకు సాయం చేస్తుంటాడు.
 

Leave a Comment