సేవ్‌ మీడియా: ఢిల్లీలో కేసీఆర్‌కి సెగ

‘సేవ్‌ మీడియా..’ అంటూ ఢిల్లీలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్‌రావుకి ‘సెగ’ తగిలించారు టీవీ 9, ఏబీఎన్‌ జర్నలిస్టులు. గత కొంతకాలంగా తెలంగాణలో టీవీ9, ఏబీఎన్‌ ఛానళ్ళ ప్రసారాలు నిలిచిపోయిన విషయం విదితమే. తెలంగాణ ప్రజా ప్రతినిథుల్ని కించపర్చేలా కథనాలు ప్రసారం చేశారంటూ తెలంగాణ వ్యాప్తంగా కేబుల్‌ ఆపరేటర్లు, టీవీ9, ఏబీఎన్‌ ఛానళ్ళ ప్రసారాల్ని నిలిపివేశారు. అప్పటినుంచీ ఆ రెండు ఛానళ్ళు ఆందోళనలు చేపడ్తున్నా ఇప్పటిదాకా ఆ విషయమై తెలంగాణ సర్కార్‌ దృష్టిపెట్టలేదు.

మొన్నామధ్య కేంద్రం జోక్యం చేసుకుని, తక్షణం ఆ రెండు ఛానళ్ళ ప్రసారాల్ని పునరుద్ధరించాలనీ, లేని పక్షంలో ఎంఎస్‌వోల లైసెన్సుల్ని రద్దు చేస్తామని అల్టిమేటం జారీ చేసినా, ఆ తర్వాత కేంద్రమూ మిన్నకుండిపోయింది. ఈ నేపథ్యంలో తెలంగాణ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్‌, ఢిల్లీ పర్యటనకు సెగ తగిలించారు ఆ రెండు ఛానళ్ళ ప్రతినిథులు. ఢిల్లీలోని కేసీఆర్‌ నివాసం వద్ద భారీగా జర్నలిస్టులు మోహరించి ‘సేవ్‌ మీడియా’ అంటూ నినాదాలు చేయడంతో ఈ వ్యవహారం జాతీయ మీడియాలో హాట్‌ టాపిక్‌ అయ్యింది.

ఢిల్లీ వేదికగా జర్నలిస్టులు ఆందోళనకు దిగిన దరిమిలా, ఇప్పటికైనా కేంద్ర ప్రభుత్వం జోక్యం చేసుకుంటుందని ఆ రెండు మీడియా సంస్థలూ భావిస్తున్నాయి. మరోపక్క, ఎలాంటి ఉద్రిక్త పరిస్థితులు తలెత్తకుండా చూసేందుకు కేసీఆర్‌ ఇంటిముందు భారీగా పోలీసులు మోహరించారు. జర్నలిస్టుల ఆందోళనతో కేసీఆర్‌ దిగొస్తారా.? కేంద్రమే కల్పించుకుంటుందా.? వేచి చూడాల్సిందే.

 

Leave a Comment