ఎదురులేని జొకోవిచ్, ముర్రే

download (3)– నాలుగో సీడ్ ఫెరర్‌కు షాక్
– క్వార్టర్స్‌లో సానియా మిక్స్‌డ్ జోడి
– యూఎస్ ఓపెన్
 న్యూయార్క్: మాజీ చాంపియన్లు నొవాక్ జొకోవిచ్, ఆండీ ముర్రే యూఎస్ ఓపెన్‌లో జోరును కొనసాగిస్తున్నారు. మరోవైపు నాలుగో సీడ్ డేవిడ్ ఫెరర్ (స్పెయిన్)కు చుక్కెదురైంది. పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో గైల్స్ సిమోన్ (ఫ్రాన్స్) 6-3, 3-6, 6-1, 6-3తో ఫెరర్‌ను ఓడించి ప్రిక్వార్టర్ ఫైనల్లోకి దూసుకెళ్లాడు. మహిళల విభాగంలో డిఫెండింగ్ చాంపియన్ సెరెనా విలియమ్స్, ఆరో సీడ్ యుగెనీ బౌచర్డ్ (కెనడా) నాలుగో రౌండ్‌లో ప్రవేశించారు.  ఆదివారం జరిగిన పురుషుల సింగిల్స్ మూడో రౌండ్‌లో టాప్ సీడ్ జొకోవిచ్ (సెర్బియా) 6-3, 6-2, 6-2 తేడాతో అమెరికాకు చెందిన సామ్ క్వెర్రీని చిత్తుగా ఓడించాడు.

2011లో యూఎస్ ఓపెన్  గెలుచుకున్న జొకోవిచ్.. క్వెర్రీపై గెలవడం ఇది ఎనిమిదోసారి. అలాగే జకోవిచ్ వరుసగా 22 సార్లు ఈ టోర్నీ నాలుగో రౌండ్‌కు చేరుకున్నాడు. 85 నిమిషాల పాటు జరిగిన ఈ మ్యాచ్‌లో శక్తివంతమైన సర్వ్‌లకు పెట్టింది పేరైన సామ్‌ను జొకోవిచ్ సులువుగానే ఎదుర్కొన్నాడు. తొలి సెట్‌లో వరుసగా పాయింట్లు సాధిస్తూ 5-0 ఆధిక్యం సాధించాడు. ప్రత్యర్థిని కుదురుగా ఉండనీయకుండా కోర్టు చుట్టూ తిరిగేలా వ్యూహం ప్రకారం ఆడి మ్యాచ్‌ను దక్కించుకున్నాడు.

ఇక 2012 చాంపియన్, బ్రిటన్ ఆశాకిరణం ఆండీ ముర్రే 6-1, 7-5, 4-6, 6-2 స్కోరుతో రష్యా ఆటగాడు ఆండ్రీ కుజ్‌నెత్సోవ్‌ను ఓడించి ఏడోసారి నాలుగో రౌండ్‌కు చేరాడు. ప్రపంచ 96వ ర్యాంకర్ కుజ్‌నెత్సోవ్ మూడో సెట్‌లో ముర్రేకు దీటుగా బదులిచ్చాడు. అయితే నాలుగో సెట్‌లో మాత్రం 27 ఏళ్ల ముర్రే త్వరగానే కోలుకుని సుదీర్ఘ ర్యాలీలతో సత్తా చూపాడు.

ఓవరాల్‌గా 47 విన్నర్ షాట్లతో ఈ ఎనిమిదో సీడ్ మ్యాచ్‌ను కైవసం చేసుకుని కీ నిషికొరి (జపాన్)తో పోరుకు సిద్ధమయ్యాడు. అలాగే ఐదో సీడ్ మిలోస్ రవోనిక్ 7-6 (7/5), 7-6 (7/5), 7-6 (7/3) తేడాతో తొలిసారిగా యూఎస్ ఓపెప్‌లో బరిలోకి దిగిన 34 ఏళ్ల విక్టర్ ఎస్ట్రేల్లా బుర్గోస్‌పై నెగ్గేందుకు చెమటోడ్చాడు. తొమ్మిదో సీడ్ జో విల్‌ఫ్రెడ్ సోంగా (ఫ్రాన్స్) 6-4, 6-4, 6-4తో కారెనో బుస్టా (స్పెయిన్)పై నెగ్గాడు.
 
సెరెనా జోరు
ఆరోసారి టైటిల్ గెలిచేందుకు ఉవ్విళ్లూరుతున్న అమెరికా సూపర్ స్టార్ సెరెనా విలియమ్స్ ఆశించినట్టుగానే దూసుకెళుతోంది. మూడో రౌండ్‌లో ఈ నంబర్‌వన్ సీడ్… 6-3, 6-3 తేడాతో వర్వారా లెప్చెంకో (అమెరికా)పై సునాయాసంగా నెగ్గింది. నాలుగో రౌండ్‌లో అన్‌సీడెడ్ కియా కనేపీ (ఎస్తోనియా)తో తలపడుతుంది. ఈ మ్యాచ్ గెలిస్తే యూఎస్ ఓపెన్‌లో సెరెనాకు 75వ మ్యాచ్ నెగ్గినట్టవుతుంది.

ఇతర మ్యాచ్‌ల్లో ఈ ఏడాది వింబుల్డన్ ఫైనలిస్ట్, ఏడో సీడ్ యుగెనీ బౌచర్డ్ (కెనడా) 6-2, 6-7 (2/7), 6-4 తేడాతో జహ్లవోవా స్ట్రికోవాను, విక్టోరియా అజరెంకా (బెలారస్) 6-1, 6-1తో వెస్నీనా (రష్యా)పై నెగ్గింది. మరోవైపు ఆదివారం జరిగిన నాలుగో రౌండ్‌లో 13వ సీడ్ సారా ఎర్రానీ 6-3, 2-6, 6-0తో లూసిక్ బరోని (క్రొయేషియా)పై గెలిచి క్వార్టర్స్‌కు చేరింది.
 
మిక్స్‌డ్ క్వార్టర్స్‌లో సానియా జోడి
భారత టెన్నిస్ స్టార్ సానియా మీర్జా బరిలోకి దిగిన రెండు విభాగాల్లో మంచి ఆటతీరును కనబరిచింది. డబుల్స్‌లో ఇప్పటికే మూడో రౌండ్‌కు చేరగా మిక్స్‌డ్ డబుల్స్‌లో క్వార్టర్ ఫైనల్‌కు అర్హత సాధించింది. రెండో రౌండ్‌లో టాప్ సీడ్ సానియా-బ్రూనో సోరెస్ (బ్రెజిల్) జంట 6-2, 7-6 (10/8)తో డెలాక్వా (అమెరికా)-జేమీ ముర్రే (గ్రేట్ బ్రిటన్)ను ఓడించింది. లియాండర్ పేస్ (భారత్)-కారా బ్లాక్ (జింబాబ్వే) జంట 6-1, 4-6, 10-4తో  ఐజమ్ అల్ ఖురేషి (పాక్)-కుద్య్రత్సేవ (రష్యా)పై నెగ్గి క్వార్టర్స్‌కు చేరింది.