టీ20 ఓ లాటరీ

images (4)జట్టు అవకాశాలపై: చెన్నై సూపర్‌కింగ్స్ పటిష్టంగా ఉంది. గత ఐపీఎల్‌లో డ్వేన్ బ్రావోకు గాయం కారణంగా జట్టు కూర్పు దెబ్బతింది. బ్రావో నిష్క్రమణ ఐపీఎల్‌లో మా అవకాశాలపై ప్రభావం చూపింది. ఇప్పుడతను మళ్ళీ జట్టులోకొచ్చాడు. బ్రావో రాకతో జట్టు బలంగా తయారైంది. మా ఆటగాళ్ళలో అత్యధికులు అంతర్జాతీయ క్రికెట్ ఆడుతున్నారు. పరుగులు సాధించారు. ఛాంపియన్స్ లీగ్‌లో పరిస్థితులకు ఎంత త్వరగా అలవాటు పడతామన్నది కీలకం.
బలాలు.. బలహీనతలు: కోల్‌కత మంచి జట్టు. ప్రారంభం నుంచి ఆ జట్టుతో మ్యాచ్‌లు ఆడుతున్నాం. ఆటగాళ్ళ మార్పులు జరిగినా.. జట్టు వ్యూహబృందం మాత్రం అదే. వారికంటూ కొన్ని బలాలున్నాయి. అదే సమయంలో మాది భిన్నమైన జట్టు. మాతో పాటు ఛాంపియన్స్ లీగ్‌లోని అన్ని జట్లు పూర్తి సన్నద్ధతతో ఉన్నాయి. ప్రతి జట్టుకు బలాలు, బలహీనతలున్నాయి. వాటిపై దృష్టిసారించాలి. స్థానిక పరిస్థితులు భారత జట్లకు కొంచెం అనుకూలంగా ఉంటాయి. ఐతే టీ20 క్రికెట్ లాటరీ టికెట్ లాంటిదే. మ్యాచ్ రోజు అత్యుత్తమ ఆటతీరు కనబరచాల్సిందే. ఎవరైనా ఒక్క ఆటగాడు మ్యాచ్‌ను దూరం చేయొచ్చు, గెలిపించొచ్చు. ఈలెక్కన ప్రతి జట్టుకు సమాన అవకాశాలున్నట్లే.

ఫార్మాట్‌పై: టెస్టులు, వన్డేలు, టీ20లు దేనికదే ప్రత్యేకం. టెస్టు సిరీస్ తర్వాత వన్డేలు ఆడాం. వెస్టిండీస్‌తో సిరీస్‌లో తొలుత వన్డేలు.. ఆ తర్వాత టెస్టులు ఆడనున్నాం. ప్రతి ఫార్మాట్‌లో దానికి సంబంధించిన అవసరాలు.. సవాళ్ళు ఉంటాయి. అందకు తగ్గట్లు అలవాటు పడాలి. ఐపీఎల్ తర్వాత మళ్ళీ అందరూ కలుసుకునే వేదిక ఛాంపియన్స్ లీగ్. ఈ లీగ్‌లో ఎక్కువ సమయం లభించదు. టోర్నీకి ముందు పది రోజులు కలిసి ఉండే అవకాశం లేదు. చాలా వేగంగా సాగిపోతుంది. వన్డే సిరీస్‌లో ఆడిన ఆటగాళ్ళు ఆలస్యంగా ఇక్కడి వచ్చారు. నేను ఈరోజే (సోమవారం) వచ్చా. జట్టుతో ఎక్కువ సమయం గడిపే అవకాశం దొరకదు. రెండు నెలల పాటు సాగే ఐపీఎల్ మాకెంతో ఉపయోగపడుతుంది. వరుసగా సిరీస్‌లు జరుగుతున్నా ఎలాంటి అలసట లేదు.

లీగ్‌పై: ఛాంపియన్స్ లీగ్ ఆలోచన గొప్పదే. ఐతే ఐపీఎల్‌తో పోలిస్తే ఆదరణ కొంచెం తక్కువ. ఐపీఎల్‌లో భారత, విదేశీ అంతర్జాతీయ ఆటగాళ్ళు అన్ని జట్లలో ఉంటారు. దాంతో అన్ని జట్ల మ్యాచ్‌లపైనా ఆసక్తి ఉంటుంది. ఛాంపియన్స్ లీగ్ అలాకాదు. రెండు విదేశీ జట్లు తలపడే మ్యాచ్‌కు ప్రేక్షకుల స్పందన తక్కువగా ఉంటుంది. అదే భారత జట్లు ఆడితే ప్రేక్షకుల సంఖ్య పెరుగుతుంది. అయినా ప్రేక్షకులు స్టేడియాలకు వచ్చి మ్యాచ్‌లు వీక్షిస్తున్నారు.

Leave a Comment