ఎంసెట్ కౌన్సెలింగ్‌కు స్పందన కరువు

71407609493_625x300యూనివర్సిటీ క్యాంపస్ : మూడు రోజులుగా జరుగుతున్న ఎంసెట్ ఇంజినీరింగ్ కౌన్సెలింగ్‌కు విద్యార్థుల నుంచి స్పందన కరువవుతోంది. విద్యార్థులు రాకపోవడంతో హెల్ప్‌లైన్ సెంటర్‌లు వెలవెలబోతున్నాయి. చిత్తూరులోని పీవీకేఎన్ డిగ్రీ కళాశాల, తిరుపతి ఎస్వీ ఆర్ట్స్ కళాశాల, ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలల్లో హెల్ప్‌లైన్ సెంటర్లు ఏర్పాటు చేశారు.

ఈ నెల 7 నుంచి కౌన్సెలింగ్ ప్రక్రియ మొదలైంది. తొలిరోజు 5 వేల లోపు ర్యాం కులు పొందిన వారికి కౌన్సెలింగ్ నిర్వహించారు. ఇందులో 27 మంది మాత్రమే పాల్గొన్నారు. రెండో రోజైన శుక్రవారం 84 మంది, మూడో రోజైన శనివారం వందమంది హాజరయ్యా రు. శనివారం 10 వేల నుంచి 15 వేల ర్యాంకుల వరకు కౌన్సెలింగ్ నిర్వహించగా ఎస్వీ ఆర్ట్స్ కళాశాలలో 41 మంది, ఎస్వీ పాలిటెక్నిక్ కళాశాలలో 30 మంది, చిత్తూరులోని పీవీకేఎన్‌లో 29 మంది హాజరయ్యారు.

11 గంటలకే ఖాళీ


ఎంసెట్ కౌన్సెలింగ్ ప్రక్రియ ప్రతి రోజూ ఉదయం 10 గంటలకు ప్రారంభమవుతుంది. ఎక్కువ మంది హాజ రుకాకపోవడంతో ఉదయం 11 గంటలకే హెల్ప్‌లైన్ సెంటర్లు ఖాళీ అయిపోతున్నాయి.
 
కారణాలేంటి?
 
ఎంసెట్ కౌన్సెలింగ్‌కు విద్యార్థుల నుంచి స్పందన లేకపోవడానికి కారణాలు అన్వేషిస్తే ప్రస్తుతం కళాశాలల సంఖ్య బాగా పెరిగింది. వేలాది మంది ఇంజనీరింగ్ గ్రాడ్యుయేట్లు బయటకు వస్తున్నారు. వీరికి ఉపాధి లభించడం లేదు. దీనివల్ల విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సుల వైపు వెళ్లకూడదని సంప్రదాయ డిగ్రీ, పీజీ కోర్సుల వైపు ఆకర్షితులవుతున్నారు. అందువల్ల ఇంజనీరింగ్ కోర్సులకు ఆదరణ తగ్గింది. ఈ ఏడాది కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యం కావడం, ఫీజు రీయింబర్స్‌మెంట్‌పై ప్రభుత్వాలు రోజుకో మాట చెబుతుండడంతో విద్యార్థులు ఇంజనీరింగ్ కోర్సుల్లో చేరడానికి ఆసక్తి కనబరచడం లేదు. గతంలో చిత్తూరు జిల్లాలో కేవలం ఐదు ఇంజనీరింగ్ కళాశాలలు మాత్రమే ఉండగా ప్రస్తుతం వాటి సంఖ్య 37కు చేరింది. దీనికితోడు కౌన్సెలింగ్ ప్రక్రియ ఆలస్యం కావడంతో చాలా మంది విద్యార్థులు కర్ణాటక, తమిళనాడు రాష్ట్రాలకు తరలి వెళ్లారు. మరికొంతమంది విద్యార్థులు ఐఐటీ, నిట్, విట్‌లాంటి సంస్థల్లో చేరారు.