61404936706_625x300న్యూఢిల్లీ: దేశీ సర్వీసుల రంగం ప్రపంచంలోనే వేగవంత వృద్ధిని సాధిస్తున్నదని ఆర్థిక సర్వే పేర్కొంది. 2001-2012 కాలంలో వార్షికంగా 9% చొప్పున దూసుకెళుతూ వేగవంత వృద్ధిని అందుకుంటున్న రంగాలలో రెండో స్థానంలో నిలిచినట్లు తెలిపింది. ఈ కాలంలో 10.9% వృద్ధితో చైనా సర్వీసుల రంగం అగ్రస్థానంలో నిలిచినట్లు తెలిపింది. ఇక జీడీపీ విషయానికివస్తే ప్రపంచంలోని టాప్ 15 దేశాలలో ఇండియా 10వ ర్యాంక్‌లో ఉన్నట్లు వెల్లడించింది. సర్వీసుల జీడీపీ రీత్యా అయితే 12వ స్థానాన్ని పొందినట్లు పేర్కొంది. ప్రపంచ జీడీపీలో సర్వీసుల రంగం వాటా 65.9% అయినప్పటికీ, 2012లో ఉద్యోగ కల్పన విషయంలో ఈ వాటా 44% మాత్రమేనని పేర్కొంది. ఇదే కాలంలో ఇండియా జీడీపీలో సర్వీసుల రంగానికి 56.9% వాటా ఉండగా, ఉద్యోగ కల్పన రీత్యా కేవలం 28.1% వాటాను పొందినట్లు వివరించింది.

 అత్యంత ప్రాధాన్యత
 2012-13తో పోలిస్తే 2013-14లో సర్వీసుల రంగ వృద్ధి నామమాత్రంగా తగ్గి 6.8%కు పరిమితమైనట్లు వెల్లడించింది. వాణిజ్యం హోటళ్లు, రెస్టారెంట్లు, రవాణా, నిల్వలు, కమ్యూనికేషన్స్ వంటి విభాగాలు మందగించడం దీనికి కారణమైనట్లు తెలిపింది. అటు కేంద్రం, ఇటు రాష్ట్రాల ఆదాయాలతోపాటు, వాణిజ్యం, విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులు(ఎఫ్‌డీఐలు), ఉద్యోగ కల్పనకు సంబంధించి ఇండియాలో సర్వీసుల రంగం అత్యంత ప్రాధాన్యతను సంతరించుకుంటున్నదని వివరించింది.

2005-06లో 10% చొప్పున నిలకడగా దూసుకెళ్లిన ఈ రంగం గత మూడేళ్లుగా కొంతవెనకబడిందని తెలిపింది. సంస్కరణలకు తెర లేపడం, విధాన నిర్ణయాలను వేగంగా తీసుకోవడం, లక్ష్యాలు నిర్దేశించుకోవడం వంటి చర్యల ద్వారా ఈ రంగానికి జోష్ తీసుకురావలసి ఉన్నదని వివరించింది. ఇండియాకు గుర్తింపును తీసుకువచ్చిన సాఫ్ట్‌వేర్, టెలికం వంటి రంగాలపై ప్రత్యేక దృష్టిని పెట్టాల్సి ఉన్నదని సర్వే తెలిపింది.
 
 తయారీకి 16 ప్రత్యేక జోన్లు
 తయారీ రంగానికి జోష్‌నిస్తూ ప్రభుత్వం జాతీయ పెట్టుబడులు, తయారీ జోన్లు(ఎన్‌ఐఎంజెడ్‌లు) పదహారింటిని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు ఆర్థిక సర్వే తెలిపింది. జాతీయ తయారీ విధానాల్లో భాగంగా ప్రభుత్వం ఎన్‌ఐఎంజెడ్‌ల ఏర్పాటుకు ప్రతిపాదించినట్లు వెల్లడించింది. దశాబ్ద కాలంలో జీడీపీలో తయారీ రంగ వాటాను 25%కు పెంచడం పాలసీ లక్ష్యమని తెలిపింది.

 తద్వారా 10 కోట్ల ఉద్యోగాల కల్పనను సాధించాలని భావిస్తున్నట్లు తెలిపింది. 16 ఎన్‌ఐఎంజెడ్‌లలో ఎనిమిదింటిని ఢిల్లీ-ముంబై కారిడార్(డీఎంఐసీ)లో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది.  మరో 8 ఎన్‌ఐఎంజెడ్‌లకు ముందస్తు అనుమతి మంజూరు చేసినట్లు వెల్లడించింది. ఇవి నాగ్‌పూర్, చిత్తూరు, మెదక్, టుమ్‌కూర్, కోలార్, బీదర్, గుల్‌బ ర్గాలలో ఏర్పాటు చేయనున్నట్లు పేర్కొంది.  ప్రపంచస్థాయి మౌలిక సదుపాయాలను కల్పిస్తూ కనీసం 50 చదరపు కిలోమీటర్ల (5,000 హెక్టార్లు) పరిధిలో సమీకృత టౌన్‌షిప్‌ల తరహాలో వీటిని ఏర్పాటు చేసేందుకు నిర్ణయించినట్లు తెలిపింది.

 డీఎంఐసీ ప్రాజెక్ట్‌ను జపాన్ సహకారంతో అభివృద్ధి చేయనున్నారు. ఉత్తరప్రదేశ్, హర్యానా, రాజస్తాన్, మధ్యప్రదేశ్, గుజరాత్, మహారాష్ట్రలతోపాటు పశ్చిమ రైల్వే కారిడార్‌లను కలుపుతూ ఈ ప్రాజెక్ట్‌ను అభివృద్ధి చేయనున్నట్లు వివరించింది.  ఆగ్రోప్రాసెసింగ్, జౌళి, దుస్తులు, తోలు ఉత్పత్తులు, పాదరక్షల రంగాలను పటిష్టపరచడం ద్వారా తయారీ రంగాన్ని మరింత పురోభివృద్ధిలో నిలపవచ్చునని తెలిపింది.  చెన్నై-బెంగళూరు-చిత్రదుర్గ పారిశ్రామిక కారిడార్‌వల్ల కర్ణాటక, ఆంధ్రప్రదేశ్, తమిళనాడు రాష్ట్రాలకు లబ్ది చేకూరుతుందని తెలిపింది.

 ఎగుమతుల వాటా 4 శాతానికి పెంచాలి…
 ప్రపంచ ఎగుమతుల్లో భారత్ వాటాను వచ్చే ఐదేళ్లలో కనీసం 4 శాతానికి పెంచాల్సిన అవసరం ఉందని ఆర్థిక సర్వే సూచించింది. 2013-14లో దేశ ఎగుమతుల వాటా 1.7 శాతంగా ఉంది. దీన్ని 4 శాతానికి పెంచాలంటే ఏటా ఎగుమతుల్లో 30 శాతం వృద్ధిని సాధించాలని కూడా పేర్కొంది. 2003-04 నుంచి 2007-08 మధ్య ఎగుమతుల్లో 20 శాతం వృద్ధి నమోదైందని.. దీన్ని పరిగణనలోకి తీసుకుంటే లక్ష్యం అసాధ్యమేమీ కాదని కూడా సర్వే తెలిపింది.

 ప్రపంచ ఎగుమతుల్లో మన వాటా 1990లలో 0.5 శాతం మాత్రమే ఉందని.. 2013 నాటికి ఇది 1.7 శాతానికి పెరిగిందని సర్వే పేర్కొంది. ఇదే సమయంలో చైనా ఎగుమతుల వాటా 1.8 శాతం నుంచి ఏకంగా 11.8 శాతానికి ఎగబాకడాన్ని  ప్రముఖంగా ప్రస్తావించింది. 2013-14 పూర్తి ఆర్థిక సంవత్సరంలో ప్రభుత్వం 325 బిలియన్ డాలర్ల విలువైన ఎగుమతులు సాధించాలని లక్ష్యంగా నిర్ధేశించుకోగా… 312 బిలియన్ డాలర్లు మాత్రమే జరిగాయి. అంటే లక్ష్యానికి 13 బిలియన్ డాలర్లు తగ్గాయి. ఇక ఆర్థిక సంవత్సరం మే నెలలో 12.4 శాతం వృద్ధితో 24.9 డాలర్లకు ఎగబాకాయి. గడిచిన ఏడు నెలల్లో మళ్లీ దేశీ ఎగుమతులు రెండంకెల వృద్ధిని అందుకోవడం గమనార్హం.

 కార్మిక సంస్కరణలు రావాలి
 కొత్త సంస్థలను ఏర్పాటు చేసి ఉద్యోగాలు కల్పించేందుకు రెండో తరం కార్మిక సంస్కరణలను అమలు చేయాలి… అపారంగా ఉన్న మానవ వనరులను వినియోగించుకోవాలని సర్వే సూచించింది. 2000-2005 మధ్యకాలంలో 2.8 శాతంగా ఉన్న ఉద్యోగావకాశాల వృద్ధి రేటు 2005-2012 లో 0.5 శాతానికి పడిపోయిన నేపథ్యంలో ఈ సూచనకు ప్రాధాన్యం ఏర్పడింది.

దాదాపు 125 కోట్లుగా ఉన్న భారత జనాభా సగటు వయసు 2020లో 29 ఏళ్లుగా ఉంటుందని అంచనా. చైనా, అమెరికా(సగటు వయసు 37 ఏళ్లు)లతో పోలిస్తే ఇండియాలో పిన్నవయస్కులు అధికంగా ఉంటారు. పనిచేసే వయసులో ఉండే జనాభా సంఖ్య 2001లో 58% ఉండగా 2021 నాటికి 64%కి పెరగనుంది.

 స్పెక్ట్రం పాలసీని మెరుగుపరచాలి…
 టెలికం స్పెక్ట్రం నిర్వహణకు సంబంధించి మరింత మెరుగైన పాలసీని రూపొందించాలి. ముఖ్యంగా స్పెక్ట్రం ట్రేడింగ్, షేరింగ్‌కు కంపెనీలను అనుమతించడంద్వారా వ్యయాలు తగ్గించుకునేందుకు దోహదం చేస్తుంది. జతీయ ఆప్టికల్ ఫైబర్ నెట్‌వర్క్(ఎన్‌ఓఎఫ్‌ఎన్), దేశవ్యాప్తంగా నంబర్ పోర్టబిలిటీ(ఎంఎన్‌పీ), గ్రామీణ టెలికం వినియోగదారుల సంఖ్యను పెంచడంపై ప్రభుత్వం దృష్టిసారించాలి.

 ఎన్‌ఓఎఫ్‌ఎన్ కింద దేశవ్యాప్తంగా 2.5 లక్షల గ్రామ పంచాయతీలను హైస్పీడ్ బ్రాడ్‌బ్యాండ్ సేవల నెట్‌వర్క్‌తో అనుసంధానించాలన్న లక్ష్యాన్ని ఆర్థిక స్పష్టంగా నిర్ధేశించింది. దీనిప్రకారం… వచ్చే ఏడాది మార్చినాటికి 50 వేల పంచాయతీలను, 2016 మార్చికల్లా మరో లక్ష, 2017 మార్చినాటికి పూర్తిగా 2.5 లక్షల పంచాయతీల లక్ష్యాన్ని పూర్తి చేయాల్సి ఉంటుంది.

 భారీ వృద్ధికి మూడంచెల వ్యూహం
 దేశం 7 నుంచి 8 శాతం శ్రేణిలో భారీ వృద్ధి రేటు బాటకు మళ్లడానికి మూడంచెల వ్యూహాన్ని అవలంబించాలి. ద్రవ్యోల్బణం కట్టడి-పన్నుల వసూళ్ల పెంపు, వ్యయ సంస్కరణలు, మార్కెట్ ఎకానమీకి సంబంధించి న్యాయ-నియంత్రణ వ్యవస్థలను మరింత మెరుగుపరచడం ద్వారా మళ్లీ వృద్ధికి ఊపును అందించవచ్చు. పెట్టుబడుల పునరుద్ధరణ, ఉపాధి, ఆదాయాల్లో వృద్దికి ఈ మూడంచెల విధానం దోహదపడుతుంది. ద్రవ్యోల్బణం కట్టడికి తగిన చర్యలతో పాటు, జీఎస్‌టీ (వస్తు, సేవల పన్ను) అమలుసహా పన్నుల వ్యవస్థ సంస్కరణలపై దృష్టి సారించాలి. సబ్బిడీల వ్యవస్థ హేతుబద్దీకరణ వ్యయ నియంత్రణలో కీలకపాత్రను పోషిస్తుంది.

 కొంచెం పెరగనున్న క్యాడ్..!
 ప్రస్తుత ఆర్థిక సంవత్సరం కరెంట్ అకౌంట్ లోటు (క్యాడ్- క్యాపిటల్ ఇన్‌ఫ్లోస్ మినహా దేశంలోకి వచ్చీ-పోయే మొత్తం విదేశీ మారకద్రవ్య నిధుల మధ్య ఉన్న వ్యత్యాసం) ప్రస్తుత ఆర్థిక సంవత్సరం (2014-15) జీడీపీతో పోల్చితే 2.1 శాతంగా (45 బిలియన్ డాలర్లు) నమోదయ్యే అవకాశం ఉంది. భారత్ ఆర్థిక వ్యవస్థ తట్టుకోగలిగిన స్థాయిలో ఈ రేటు ఉంది. 2012-13లో క్యాడ్ 4.7 శాతం (88.2 బిలియన్ డాలర్లు)కాగా, 2013-14లో 1.7 శాతంగా (32.4 బిలియన్‌డాలర్లు) ఉంది. మొత్తంగా చూస్తే- క్యాడ్ పరిమాణం దిగిరావడం, తగిన స్థాయిల్లో కొనసాగడం భారత్ ఆర్థిక వ్యవస్థకు  కలిసివస్తున్న అంశం.

 కొత్త ఎఫ్‌ఆర్‌బీఎం చట్టం అవసరం…
 ప్రభుత్వ వ్యయాలు, అకౌంటింగ్ ప్రమాణాలు, బడ్జెటరీ నిధుల నిర్వహణ తత్సంబంధ అంశాల్లో మరింత మెరుగుదల, పటిష్టత అవసరం ఉంది. ఈ దిశలో కొత్త ద్రవ్య బాధ్యత, బడ్జెట్ నిర్వహణ(ఎఫ్‌ఆర్‌బీఎం) చట్టానికి రూపకల్పన చేయాలి. బాధ్యతాయుతమైన ద్రవ్య విధాన రూపకల్పన ప్రక్రియలో తాజా ఆలోచనా ధోరణి అవసరం.  గడచిన ఎనిమిదేళ్ల కాలంలో ద్రవ్యోల్బణం భారీగా పెరగడం ద్రవ్య బాధ్యత, బడ్జెట్ నిర్వహణ తత్సంబంధ అంశాలపై తీవ్ర ప్రతికూలత చూపుతోంది. అధిక నాణ్యతా ప్రమాణాలు కలిగిన ద్రవ్య సమతౌల్యతను సాధించడానికి అటు పన్నులు, ఇటు వ్యయ వ్యవస్థలను మెరుగుపరచాలి. పన్నుల వ్యవస్థ సరళతరంగా, అమలుకు  సాధ్యమయ్యేలా పారదర్శకత, స్థిరత్వంగా ఉండాలి.

 రైల్వేల్లో ఎఫ్‌డీఐలపై త్వరిత నిర్ణయం
 రైల్వేల ప్రైవేటీకరణ, రైల్వే రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడుల(ఎఫ్‌డీఐ)ను అనుమతించడం అతి పెద్ద సంస్కరణలు కానున్నాయని ఆర్థిక సర్వే పేర్కొంది. రైల్వే రంగంలో ఎఫ్‌డీఐలను అనుమతించాలన్న ప్రభుత్వ ప్రతిపాదనను జాగ్రత్తగా అధ్యయనం చేయాలని, ఈ విషయమై త్వరితగతిన నిర్ణయం తీసుకోవాలని ఆర్థిక సర్వే సూచించింది.

భారత రైల్వేలు ప్రపంచ స్థాయి ప్రమాణాలనందుకోవాలంటే ఎఫ్‌డీఐలు తప్పనిసరని, అందుకే రైల్వే అధికారులు ప్రస్తుతమున్న ఎఫ్‌డీఐ విధానంలో తగిన మార్పులు చేయడానికి కసరత్తు చేస్తున్నారని పేర్కొంది. నిర్వహణలో తప్ప అన్ని విభాగాల్లో ఎఫ్‌డీఐలను అనుమతించాలనే ప్రతిపాదన  ఉంది. ఎఫ్‌డీఐలను అనుమతించడంపై  అధ్యయనం చేయాలని పేర్కొంది.

 ద్రవ్యోల్బణం అదుపుతో వడ్డీరేట్లు కిందకు…
 
 ద్రవ్యోల్బణం అదుపునకు అత్యధిక ప్రాధాన్యత ఇవ్వాల్సిన అవసరం ఉంది. 2014 యేడాది చివరినాటికి ఈ సమస్య అందుపులోనికి వస్తుందన్న విశ్వాసముంది. ద్రవ్యోల్బణం తగ్గితే  ఆర్‌బీఐ  వడ్డీరేట్లను తగ్గించే అవకాశం ఉంది. అయితే ఈ ఏడాది వర్షపాతం కొరత, ఇరాక్ సంక్షోభ పరిస్థితుల నేపథ్యంలో అధిక క్రూడ్ ధరలు వంటి అంశాలు ప్రతికూలతలుగా కనబడుతున్నాయి. ద్రవ్యోల్బణం కాస్త శాంతించినప్పటికీ.. ఇంకా తగ్గాల్సి ఉంది. ప్రత్యేకించి సరఫరాల వైపు సమస్యలు ఆహార ద్రవ్యోల్బణం కట్టు తప్పడానికి కారణమవుతున్నాయి. ద్రవ్యోల్బణం కట్టడికి  రైతులకు ప్రభుత్వ మద్దతు వంటి అంశాల్లో హేతుబద్ధీకరణ వంటి చర్యలు అవసరం. వీటితోపాటు డీజిల్ ధరలపై నియంత్రణల ఎత్తివేత, ద్రవ్యలోటు కట్టడికి ప్రాధాన్యత ఇవ్వాలి.

 సెజ్‌లను పునరుద్ధరించాలి..
 
 ప్రత్యేక ఆర్థిక మండళ్లలో (సెజ్‌లు) తాజా పెట్టుబడులు ఇటీవలి కాలంలో మందగించిన నేపథ్యంలో వాటి పునరుద్ధరణపై డెవలపర్లకు, యూనిట్లకు స్పష్టమైన సంకేతాలివ్వాలని ఆర్థిక సర్వే కోరింది. తయారీ, ఎగుమతి కేంద్రాలుగా ఒకనాడు విలసిల్లిన సెజ్‌లు 2011లో కనీస ప్రత్యామ్నాయ పన్ను (మ్యాట్), డివిడెండ్ పంపణీ పన్నుల (డీడీటీ) విధింపుతో తమ ప్రాభవాన్ని కోల్పోతున్నాయని పేర్కొంది. సెజ్‌లపై మ్యాట్‌ను ఉపసంహరించాలని వాణిజ్య శాఖ ఇప్పటికే ఆర్థిక శాఖను కోరింది. సెజ్‌ల డెవలపర్లు, యూనిట్ల బుక్ ప్రాఫిట్స్‌పై 18.5 శాతం మ్యాట్‌ను 2011లో విధించారు.


 జీఎస్‌టీ, డీటీసీలే కీలకం…
 న్యూఢిల్లీ: ప్రస్తుతం సంక్లిష్టంగా ఉన్న దేశీయ పన్నుల విధానాన్ని పూర్తిగా సంస్కరించాలని, అలాగే అనవసర పన్నులను తొలగించాలని ఎకనామిక్ సర్వే పేర్కొంది. పరోక్ష పన్నుల సంస్కరణల్లో గూడ్స్ అండ్ సర్వీసెస్ ట్యాక్స్ (జీఎస్‌టీ) ఎంతో కీలకమైనదన్న విషయంపై ఇప్పటికే ఏకాభిప్రాయం ఏర్పడిందన్నారు. జీఎస్‌టీ అమల్లోకి వస్తే ద్వంద పన్నుల విధానం తొలిగిపోవడమే కాకుండా, ఎగుమతులు, దిగుమతుల పన్నులు కూడా ఒకే పరిధిలోకి వస్తాయి.

దీంతో కంపెనీలకు పోటీ సామర్థ్యం పెరిగి ఎగుమతులు వృద్ధి చెందుతాయని పేర్కొంది. అలాగే ప్రస్తుతం విధానంలో ఉన్న సర్ చార్జీలు, సుంకాలు, డివిడెండ్ డిస్ట్రిబ్యూషన్ ట్యాక్స్ వంటి  అనవసర పన్నులు (బ్యాడ్ ట్యాక్స్) తొలగించాల్సిన అవసరం ఉందని సర్వే  పేర్కొంది. ఎంతో సంక్లిష్టంగా ఉన్న ఆదాయ పన్నుల చట్టం స్థానంలో డెరైక్ట్ ట్యాక్స్ కోడ్ (డీటీసీ)ని ప్రవేశపెట్టాలని సూచించింది. దీంతో వ్యక్తిగత, వ్యాపార వర్గాల్లో ఆదాయపు పన్నుల సమస్యలు తగ్గి పన్ను వసూళ్లు పెరుగుతాయని పేర్కొంది.

 మొండిబకాయిల సెగ..
 గడచిన రెండేళ్లలో బ్యాంకుల మొండిబకాయిలు(ఎన్‌పీఏలు)  నాలుగు రెట్లు పెరగడం ఆందోళన కలిగిస్తోంది. ప్రత్యేకించి ప్రభుత్వ రంగ బ్యాంకుల విషయంలో పరిస్థితి తీవ్రంగా ఉంది. ఈ సవాలును అధిగమించడానికి చర్యలు తీసుకుంటున్నాం. 2008-09లో ప్రభుత్వ రంగ బ్యాంకుల మొత్తం రుణాల్లో ఎన్‌పీఏల రేటు 2.09% కాగా, ఇది 2014 మార్చి నాటికి 4.4%కి ఎగసింది.

నిధుల రూపంలో చూస్తే 2010 మార్చి నాటికి స్థూలంగా ఈ మొత్తం రూ.59,972 కోట్లుకాగా 2014 మార్చికి రూ.2,04,249 కోట్లకు చేరింది. ఆర్థిక వ్యవస్థ బాగున్నరోజుల్లో భారీ రుణాల మంజూరు.. అనంతర కాలాల్లో  మందగమనం వంటి అంశాలు ఎన్‌పీఏలు ఎగసేందుకు కారణం. ప్రైవేటురంగం సహా అన్ని బ్యాంకుల ఎన్‌పీఏల రేటు 2.36% నుంచి 3.90%కి చేరింది.

 అందరికీ బ్యాంకింగ్ సేవలు..: మారుమూల ప్రాంతాలన్నింటికీ బ్యాంకింగ్ సేవలను అందుబాటులోనికి తీసుకురావడం, తద్వారా వృద్ధికి చేయుతనివ్వడం లక్ష్యంగా తగిన అన్ని ప్రయత్నాలను కేంద్రం తీసుకుంటోంది. ప్రస్తుత భారత్ ఆర్థిక వ్యవస్థ ఎదుర్కొంటున్న సవాళ్లను వచ్చే 30 ఏళ్లలో అధిగమించాల్సి ఉంది

Leave a Comment