ఫేస్‌బుక్ వేధింపులపై నాన్ బెయిలబుల్ కేసులు

images (1)హైదరాబాద్: మహిళలకు భద్రత, భరోసా కల్పించేందుకు తీసుకోవాల్సిన చర్యలపై ప్రభుత్వం ఏర్పాటు చేసిన ప్రత్యేక బృందం (టాస్క్‌ఫోర్స్) పోలీసు అధికారులతో సమావేశమైంది. సోమవారం జూబ్లీహిల్స్‌లోని మర్రి చెన్నారెడ్డి మానవ వనరుల అభివృద్ధి సంస్థలో ఏర్పాటు చేసిన సమావేశంలో జంట నగరాల్లోని వివిధ పోలీస్‌స్టేషన్లలో పని చేస్తున్న అధికారులు పాల్గొన్నారు. టాస్క్‌ఫోర్స్ దృష్టికి వచ్చిన పలు సమస్యలు, సూచనలను ఛైర్‌పర్సన్ పూనం మాలకొండయ్య విలేకరులకు వివరించారు. పోలీస్‌స్టేషన్‌లకు అత్యధికంగా మోసం, యువతులను పెళ్లి పేరుతో వంచించే కేసులే వస్తున్నాయన్నారు. ప్రేమ, పెళ్లి పేరుతో జరిగే మోసాలను అరికట్టడానికి ‘రిజిస్ట్రేషన్ ఆఫ్ మ్యారేజ్’ను తప్పనిసరి చేయాలని సమావేశం దృష్టికి వచ్చినట్లు తెలిపారు. హైదరాబాద్‌లో ఫేస్‌బుక్ వేధింపు కేసులు ఎక్కువగా నమోదవుతున్నాయని వీటిపై నాన్ బెయిలబుల్ కేసులు పెట్టాలనే సూచనలు వచ్చినట్లు పేర్కొన్నారు. మహిళా పోలీసులకు ప్రత్యేక ప్రాధాన్యం ఇవ్వాలని, చిన్నారుల సహాయక కేంద్రాలను ఏర్పాటు చేయాలన్న సూచనలు వచ్చాయని వివరించారు. పోలీసుశాఖలో మహిళలకు 33 శాతం రిజర్వేషన్లు కల్పించాలన్నారు. ఎన్ఆర్ఐల మోసాలపై నమోదవుతున్న కేసుల సంఖ్య ఎక్కువగానే ఉందని చెప్పారు. కమ్యూనిటీ పోలీసింగ్‌ను విస్తృత పరచాలని టాస్క్‌ఫోర్స్ దృష్టికి వచ్చినట్లు తెలిపారు. ఈ నెల 20న ప్రభుత్వానికి ప్రాథమిక నివేదికను అందిస్తామని పూనం మాలకొండయ్య పేర్కొన్నారు. బృందం సభ్యులు సౌమ్య మిశ్రా, చారుసిన్హా, స్వాతి లక్రా, శైలజా రామయ్యర్ తదితరులు పాల్గొన్నారు.

Leave a Comment