‘నిర్భయ’ను తలపించిన ఫ్యాషన్ షూట్!

61407302623_625x300ముంబై : ఫ్యాషన్ వెర్రి తలలు వేస్తోంది. ఏది ఫ్యాషనో, ఏది కాదో గుర్తించలేక చేస్తున్న పనులు చివరకు అసభ్యంగా మారుతూ తీవ్ర ఆందోళన కలిగిస్తున్నాయి. ముంబైలో ఓ ఫ్యాషన్ ఫొటోగ్రాఫర్ ఇలాగే చేశాడు. అచ్చం నిర్భయ ఘటనను గుర్తుకుతెచ్చేలా ఓ లేడీ మోడల్‌ను, ఇద్దరు పురుషులను పెట్టి ఓ బస్సులో అతడు తీసిన ఫొటోలు సోషల్ మీడియాలో తీవ్ర వివాదానికి కారణమయ్యాయి.

‘ద రాంగ్ టర్న్’ పేరుతో రాజ్ షెట్టి తీసిన ఫొటోలలో ఓ మహిళ బస్సులో ఇద్దరు పురుషులతో పోరాడుతున్నట్లు ఉంటుంది. వాళ్లలో ఒకరు ఆమె కాళ్లమీదుగా పడిపోతున్నట్లు కనిపిస్తుండగా రెండో వ్యక్తి మరింత అసభ్యంగా వ్యవహరిస్తుంటాడు. ఈ ఫొటోల లింక్ ట్విట్టర్, ఫేస్‌బుక్‌లలో విపరీతంగా ప్రచారం అయ్యింది. వాటిపై తీవ్రమైన ప్రతిస్సందనలు రావడంతో ఆ పేజీలను డిలిట్ చేసేశారు. ఒకవేళ ఎవరైనా వాటిని క్లిక్ చేసినా, ఎర్రర్ పేజి మాత్రమే చూపిస్తుంది.

అయితే, నిర్భయ ఘటన ఆధారంగానే తన ఫొటో షూట్ సాగిందన్న మాట సరికాదని షెట్టి చెబుతున్నాడు. సమాజంలో ఒక భాగంగా, ఫొటోగ్రాఫర్‌గా ఉన్న తనకు అనేక ఆలోచనలు వస్తుంటాయని, బయటకు వెళ్లినప్పుడు ఎవరికైనా ఇలా జరగచ్చన్న ఉద్దేశంతోనే ఇలా చేశానని అంటున్నాడు. అయితే, కొంచెం కూడా సెన్స్ అన్నది లేకుండా ప్రవర్తించాడంటూ ఈ ఫొటోగ్రాఫర్‌పై ట్విట్టర్లో విమర్శలు వెల్లువెత్తాయి. కొంతమంది అయితే ఉచ్ఛనీచాలు తెలియని పంది అని కూడా తిట్టారు.