సొంతూరు

images (7)మోదీకి జిన్‌పింగ్ ఆహ్వానం

బీజింగ్: ప్రధాని నరేంద్ర మోదీ స్వరాష్ట్రం గుజరాత్ నుంచి భారత పర్యటనను ప్రారంభించిన చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ అందుకు ప్రతిగా మోదీని సైతం తన సొంత పట్టణం జియాన్‌ను సందర్శించాల్సిందిగా ఆహ్వానించారు. మోదీతో బుధవారం జరిగిన సమావేశంలో జిన్‌పింగ్ ఈ ఆహ్వా నం చేసినట్లు చైనా అధికార మీడియా పేర్కొంది.

కోట్నీస్ కుటుంబానికి పరామర్శ

తమ దేశం కోసం ప్రాణాలర్పించిన భారత వైద్యుడు ద్వారకానాథ్ కోట్నీస్ కుటుంబ సభ్యులను భారత పర్యటనలో భాగంగా కలిసే చైనా నేతల ఆనవాయితీని జిన్‌పింగ్  కొనసాగించారు. వయోభారం కారణంగా చక్రాల కుర్చీకే పరిమితమైన డాక్టర్ కోట్నీస్ సోదరి మనోరమ (93)ను జిన్‌పింగ్ శుక్రవారం ఢిల్లీలో పరామర్శించా రు. జిన్‌పింగ్ ఆమెను కలిసేందుకు వీలుగా ముంబైలోని చైనా కాన్సులేట్ జనరల్ ఆమెను ప్రత్యేకంగా విమానంలో ఢిల్లీ తీసుకొచ్చారు. రెండో చైనా-జపాన్ యుద్ధంలో గాయపడ్డ చైనా సైనికులకు చికిత్స అందించేందుకు 1937లో వచ్చిన భారత వైద్య బృందంలో ఒకరైన డాక్టర్ కోట్నీస్ 1942 వరకూ వైద్యం అందిస్తూ అనారోగ్యానికి గురై కన్నుమూశారు.

జిన్‌పింగ్‌ను కలిసిన సోనియా, మన్మోహన్‌సింగ్

కాంగ్రెస్ పార్టీ అధ్యక్షురాలు సోనియా గాంధీ, మాజీ ప్రధాని మన్మోహన్‌సింగ్‌లు శుక్రవారం ఢిల్లీలో చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్‌ను ఆయన బస చేసిన ఓ హోటల్‌లో కలిశారు. వారి వెంట కాంగ్రెస్ పార్టీ ఉపాధ్యక్షుడు రాహుల్ గాంధీ కూడా ఉన్నారు.

యోగా నేర్చుకుంటున్న జిన్‌పింగ్ భార్య

చైనా అధ్యక్షుడు జిన్‌పింగ్ భార్య పెంగ్ లియువాన్ యోగా నేర్చుకుంటున్నారట. తమ దేశంలో యోగా ఎంతో ప్రజాదరణ పొందుతోందని…తన భార్య యోగా నేర్చుకుంటోందంటూ లోక్‌సభ స్పీకర్ సుమిత్రా మహాజన్‌తో జిన్‌పింగ్ తెలిపారు.

చుమర్‌లో మళ్లీ చైనా చొరబాట్లు

ఈశాన్య లడఖ్‌లోని చుమర్ ప్రాంతంలోని భారత భూభాగం నుంచి వెనక్కు వెళ్లి కొన్ని గంటలైనా గడవకముందే.. చైనా సైనికులు మరోసారి అదేప్రాంతంలో భారతభూభాగంలోకి చొచ్చుకువచ్చారు. 35 మంది పీపుల్స్ లిబరేషన్ ఆర్మీ సైనికులు వాస్తవాధీన రేఖ(ఎల్‌ఏసీ)ను దాటి.. దగ్గర్లోని ఒక పర్వతంపైకి చేరారని శుక్రవారం అధికార వర్గాలు వెల్లడించాయి. మరో 300 మంది సైనికులు చైనా వైపు, ఎల్‌ఏసీకి దగ్గరలో కనిపిస్తున్నారని తెలిపాయి.

Leave a Comment