‘పట్టు’ సడలింది

71406750961_625x300పసిడి నెగ్గలేకపోయిన భారత రెజ్లర్లు
– ఫైనల్స్‌కు చేరిన అన్ని విభాగాల్లోనూ ఓటమి
– నాలుగు రజతాలు, కాంస్యంతో సరి

  1. రెజ్లింగ్ తొలి రోజు భారత్ ఖాతాలో మూడు స్వర్ణాలు… రెండో రోజు నాలుగు విభాగాల్లో ఫైనల్‌కు… ఇక స్వర్ణాలు లెక్కబెట్టుకోవడమే అనుకున్నారంతా! కానీ సగటు భారత క్రీడాభిమాని ఆశ ఆవిరైపోయింది. రెండో రోజు ఫైనల్‌కు చేరిన నాలుగు విభాగాల్లోనూ ఓటములతో భారత రెజ్లర్లు రజతాలతో సరిపెట్టుకున్నారు. అయితే నాలుగు రజతాలతో పాటు ఓ కాంస్యం కూడా సాధించి మొత్తం ఐదు పతకాలతో భారత్ పతకాల సంఖ్యను రెజ్లర్లు పెంచారు.


గ్లాస్గో: పసిడి పంట పండిస్తారనుకున్న వేదికపై భారత రెజ్లర్లు ‘పట్టు’ సడలించారు. ప్రత్యర్థి పట్టు పట్టాల్సిన చోట తాము పట్టు కోల్పోయారు. నమ్మశక్యంకాని పద్ధతిలో తడబాటుకు లోనై పరాజయాల మూట గట్టుకున్నారు. ఫైనల్లో పురుష రెజ్లర్లకు కెనడా కుస్తీ వీరులు ‘షాక్’ ఇవ్వగా… మహిళల రెజ్లర్లకు నైజీరియా అమ్మాయిలు ‘చెక్’ పెట్టారు. కామన్వెల్త్ గేమ్స్ ప్రమాణాలతో పోలిస్తే ఎంతో పటిష్టమైన ప్రత్యర్థులు ఉండే ప్రపంచ చాంపియన్‌షిప్‌లో గతేడాది కాంస్యం నెగ్గిన బజరంగ్ (61 కేజీల)… ఈ ఏడాది ఆసియా చాంపియన్‌షిప్‌లో కాంస్యం సాధించిన సత్యవర్త్ (97 కేజీలు) ‘గ్లాస్గో’లో మాత్రం పసిడి మెట్టుపై బోల్తా పడ్డారు.
 
తేరుకునేలోపే…
డేవిడ్ ట్రెమ్‌బ్లే (కెనడా)తో జరిగి 61 కేజీల ఫైనల్లో భారీ అంచనాలతో బరిలోకి దిగిన బజరంగ్‌కు ఆరంభంలోనే ఎదురుదెబ్బ తగిలింది. పటిష్ట శరీర నిర్మాణంతో ఉన్న ట్రెమ్‌బ్లే తన శక్తినంతా కూడదీసుకొని బజరంగ్‌పై మొదట్లోనే నియంత్రణ సంపాదించాడు. బజరంగ్‌ను ఒక్కసారి మ్యాట్‌పై కిందపడేశాక ట్రెమ్‌బ్లే పూర్తిగా పట్టుబిగించాడు. బజరంగ్ కాళ్లను కదలనీయకుండా తానే ఆధిపత్యం చలాయిస్తూ వెంటవెంటనే పాయింట్లు గెల్చుకున్నాడు. 3 నిమిషాల వ్యవధిగల తొలి అర్ధభాగంలో 84 సెకన్లు ముగిసే సమయానికి ట్రెమ్‌బ్లే 12-1తో ఆధిక్యంలోకి వెళ్లాడు. దాంతో నిబంధనల ప్రకారం ప్రత్యర్థిపై ఎవరైనా కనీసం 10 పాయింట్లు ఆధిక్యం సంపాదిస్తే బౌట్‌ను నిలిపివేయాలి. ఫలితంగా ట్రెమ్‌బ్లే విజేతగా అవతరించాడు.
 
అతి జాగ్రత్తకు మూల్యం.
వరుసగా మూడు బౌట్‌లలో నెగ్గి 97 కేజీల విభాగంలో ఫైనల్ చేరుకున్న 20 ఏళ్ల సత్యవర్త్ కడియాన్ టైటిల్ పోరులో అతి జాగ్రత్తకు వెళ్లి మూల్యం చెల్లించుకున్నాడు. అర్జున్ గిల్ (కెనడా)తో జరిగిన ఫైనల్లో సత్యవర్త్ తొలి అర్ధభాగం ముగిసేసరికి 2-0తో ఆధిక్యంలో ఉన్నాడు. అయితే రెండో అర్ధభాగంలో ఈ ఆధిక్యాన్ని కాపాడుకునే క్రమంలో జోరు తగ్గించి రక్షణాత్మకంగా వ్యవహరించాడు. ఇదే అదునుతో అర్జున్ గిల్ జోరు పెంచి 2-2తో స్కోరును సమం చేశాడు. రిఫరీ హెచ్చరించినా దూకుడు పెంచని సత్యవర్త్‌కు 30 సెకన్ల ‘కాషన్’ ఇచ్చారు. ఈ సమయంలో అతను పాయింట్ సంపాదించకపోవడంతో అర్జున్‌కు అదనంగా పాయింట్ వచ్చింది. ఆ తర్వాత తేరుకున్న సత్యవర్త్ పాయింట్ సాధించి 4-3తో ఆధిక్యంలోకి వెళ్లాడు. అయితే పట్టువదలని అర్జున్ గిల్ తన బలాన్నంతా కూడదీసుకొని చివరి సెకన్లలో సత్యవర్త్‌ను ఎరీనా బయటకు పంపించి నిర్ణీత సమయానికి స్కోరును 4-4తో సమం చేశాడు. దాంతో బౌట్ సందర్భంగా సత్యవర్త్ ‘కాషన్’ పొందడం… చివరగా అర్జున్ గిల్ పాయింట్ సంపాదించడంతో నిబంధనల ప్రకారం అర్జున్ గిల్‌ను విజేతగా ప్రకటించారు.
 
చేతులెత్తేశారు…
మహిళల 53 కేజీల ఫైనల్లో ఒడునాయో అడెకురోయి (నైజీరియా) కేవలం 31 సెకన్లలో లలిత (భారత్)ను చిత్తు చేసింది. ఆరంభంలోనే లలితను ఒడిసిపట్టుకున్న ఒడునాయో ఆమెను మ్యాట్‌పై పడేసింది. అదే జోరులో లలిత భుజాన్ని ఈ నైజీరియా రెజ్లర్ కొన్ని సెకన్లపాటు మ్యాట్‌కు ఆనించడంతో రిఫరీ ‘బై ఫాల్’ పద్ధతిలో ఒడునాయోను విజేతగా ప్రకటించారు. 58 కేజీల విభాగంలో అమినాత్ అడెనియి 2 నిమిషాల 43 సెకన్లలో సాక్షి మలిక్ (భారత్) ఆట కట్టించింది. బౌట్ మొదలైన క్షణం నుంచే దూకుడుగా వ్యవహరించి మంచి టెక్నిక్‌తో అడెనియి వరుసగా పాయింట్లు సంపాదించింది. ఈ క్రమంలో అడెనియ 10-0తో స్పష్టమైన ఆధిక్యంలోకి వెళ్లడంతో రిఫరీ బౌట్‌ను ముగించారు. ఇక 69 కేజీల కాంస్య పతక పోరులో నవజ్యోత్ కౌర్ 13-0తో సారా జోన్స్ (స్కాట్లాండ్)ను ఓడించింది.

Leave a Comment