సెబీకి మరిన్ని అధికారాలు

download (1)న్యూఢిల్లీ: మోసపూరిత నిధుల సమీకరణ స్కీమ్‌లు, ఫ్రాడ్‌లకు చెక్ చెప్పే దిశగా మార్కెట్ల నియంత్రణ సంస్థ సెబీకి మరిన్ని అధికారాలు కట్టబెట్టే చట్టాన్ని ప్రభుత్వం గురువారం నోటిఫై చేసింది. దీంతో డిఫాల్టర్లను అరెస్ట్ చేసేందుకు, కాల్ డేటా రికార్డులను పరిశీలించేందుకు, అవసరమైతే ఆస్తుల అటాచ్‌మెంట్ చేసేందుకు సెబీకి అధికారాలు లభిస్తాయి.ప్రత్యేక కోర్టు అనుమతితో సోదాలు నిర్వహించడం కూడా సాధ్యపడుతుంది.

పోంజీ స్కీమ్ తరహా స్కీముల మూలంగా లక్షల మంది చిన్న ఇన్వెస్టర్లు మోసపోతున్న ఉదంతాల నేపథ్యంలో ఈ చట్టాన్ని ఆగస్టు 6న లోక్‌సభ, ఆగస్టు 12న రాజ్యసభ ఆమోదించిన సంగతి తెలిసిందే. ప్రాసిక్యూషన్ మరింత వేగవంతం చేసేందుకు, మోసపోయిన ఇన్వెస్టర్లకు సొమ్మును సత్వరం రీఫండ్ చేసేందుకు కొత్తగా సంక్రమించిన అధికారాలు ఉపయోగపడతాయని సెబీ చైర్మన్ యూకే సిన్హా పేర్కొన్నారు.  తాజా చట్టం కారణంగా.. నేరం చేసిన వారు ఇకపై తమ ఆదేశాలను బేఖాతరు చేస్తే కఠిన చర్యలు తప్పవన్నారు.