9 ఎత్తుల్లోనే గెలిచిన హారిక

41407357672_625x300ట్రోమ్‌సో (నార్వే): చెస్ ఒలింపియాడ్‌లో భారత గ్రాండ్‌మాస్టర్, ఆంధ్రప్రదేశ్ అమ్మాయి ద్రోణవల్లి హారిక తన కెరీర్‌లోనే చిరస్మరణీయ విజయం నమోదు చేసింది. దీంతో ఆస్ట్రియాతో బుధవారం జరిగిన ఐదో రౌండ్‌లో భారత్ 4-0తో విజయం సాధించింది. భారత క్రీడాకారిణులు హారిక, ఇషా కరవాడే, మేరీ ఆన్ గోమ్స్, పద్మిని రౌత్ తమ ప్రత్యర్థులను ఓడించారు. ముఖ్యంగా వెరోనికా ఎక్స్‌లెర్‌తో పోటీపడిన హారిక కేవలం 9 ఎత్తుల్లోనే గెలిచి సంచలనం సృష్టించింది.
 
  తన అంతర్జాతీయ కెరీర్‌లో హారిక అత్యంత తక్కువ ఎత్తుల్లో నెగ్గిన గేమ్ ఇదే కావడం విశేషం. ఇంతకుముందు 2008లో వరల్డ్ మైండ్ స్పోర్ట్స్ గేమ్స్ టోర్నీ రెండో రౌండ్‌లో హారిక 18 ఎత్తుల్లో ఇరీనా ఖరిస్మా సుకందర్ (ఇండోనేసియా)పై నెగ్గింది. పురుషుల విభాగంలో భారత జట్టు 3.5-0.5తో మాంటెనిగ్రోను ఓడించింది. పరిమార్జన్ నేగి, సేతురామన్, శశికిరణ్ తమ ప్రత్యర్థులపై నెగ్గగా… అధిబన్ తన గేమ్‌ను ‘డ్రా’ చేసుకున్నాడు.