మెట్రోను దెబ్బ తీయాల్సిన అవసరం ఎవరికి?

downloadమెట్రోపై వచ్చిన కథనాలను ముఖ్యమంత్రి కెసిఆర్ తన స్టయిల్ లో తోసి పుచ్చితే సరిపోతుందా? మెట్రోను దెబ్బ తీయాడానికే ఇదంతా అని ఆయన అంటే అయిపోతుందా? ఆ రెండు పత్రికలు మాత్రమే ఈ కథనాలు వండి వార్చాయి అంటే సమాధానం ఇచ్చినట్లేనా? అసలు మెట్రో విషయంలో ఎన్నికలకు ముందు, తరువాత కూడా తెరాస, కేసిఆర్ వైఖరి కాస్త వ్యతిరేకంగానే వుంటూ వస్తోందన్నది వాస్తవం. బడేచౌడీ తదితర ప్రాంతాల్లో చిన్న వ్యాపారులను మెట్రో కారణంగా దెబ్బతీయద్దని తెరాస ఎన్నికలకు ముందే డిమాండ్ చేస్తూ వచ్చింది. ఆ తరువాత ఎన్నికల అనంతరం అధికారంలోకి వచ్చిన తరువాత మెట్రో విషయంలో రకరకాల వార్తలు వచ్చాయి. ఇందులో కేంద్రం వాటా కూడా వున్నందున కెసిఆర్ ప్రభుత్వానికి కేంద్ర ప్రభుత్వం గట్టి ఆదేశాలు ఇచ్చిందని కూడా వార్తలు వినవచ్చాయి. ఆ తరువాత ఈ విషయం కాస్త సద్దు మణిగింది. కానీ ఇంకా కెసిఆర్ ప్రభుత్వం అదే విధమైన సహాయ నిరాకరణ వైఖరి అవలంబించడం, భూగర్భ లైన్ అంటూ కొత్త పల్లవి అందుకోవడం వంటివి ఎల్ అండ్ టి సంస్థకు చికాకు తెప్పించాయి. పైగా కెసిఆర్ కు సన్నిహితుడైన ఓ మెగా బిల్డర్ కు గతంలో మెట్రో తో వివాదం ఏర్పడినట్లు వినికిడి. మెట్రో పెద్దల స్థలాలు పోకుండా తన చిత్తానికి లైన్ అలైన్ మెంట్ లు మార్చిన దాఖలాలు వున్నాయని ఆరోపణ వుంది. సికిందరబాద్ పెరేడ్ గ్రౌండ్ ప్రాంతంలో వున్న ఫ్లయ్ ఓవర్ పక్కగా లైన్ వేయాల్సి వచ్చింది. అక్కడ దాని వల్ల ఇరుకుగా వున్నా అలాగే ఊరుకున్నారు తప్ప, అక్కడ వున్న జివికె సంస్థ స్థలం సేకరించే ప్రయత్నం చేయలేదని ఆరోపణలు వున్నాయి. ఇలాగే కొన్నింటిపై కోర్టు కేసులు కూడా వున్నాయి. దానా దీనా కెసిఆర్ మెట్రో అంటే కాస్త అంటీ ముట్టనట్లే వున్నారు.  ఇలాంటి సమయంలో ఇక తప్పని సరై ఎల్ అండ్ టి సంస్థ లేఖ రాసింది. ఇప్పుడు ఆ లేఖ బజారున పడింది. ఎలా సాధ్యం. అయితే ఎల్ అండ్ టీ లేదా, టీ ప్రభుత్వం, కాదంటే హైదరాబాద్ మెట్రో, ఈ మూడింటి లో ఒక దాని నుంచే లీక్ కావాలి. టీ ప్రభుత్వం ఈ పని చేయదు. ఇక మిగిలింది హైదరాబాద్ మెట్రో, ఎల్ అండ్ టి. లేఖ వాస్తవమైనపుడు, దాంట్లో విషయాలు వాస్తవమైనపుడు, వార్త కథనాలను తప్పు పట్టడం, మెట్రోను దెబ్బ తీసే యత్నం అని ఆరోపించడం ఏ మేరకు సబబు. అలాంటి ఉద్దేశం అసలు ముందు ప్రభుత్వానికి లేదని చెప్పాలి. పాయింట్ టు పాయింట్ సమాధానం ఇవ్వాలి. అవి మానేసి ఇలా అనడం అంటే ప్రభుత్వం పరోక్షంగా తన సమస్యను అంగీకరించినట్లే అనుకోవాలి.  మెట్రో అన్నది ఇప్పుడు హైదరాబాదీల కల. అది ఏ మాత్రం చెదిరినా వారు సహించరు. జరిగే కార్పొరేషన్ ఎన్నికల్లో అది చాలా దెబ్బ. ఆ సంగతి కెసిఆర్ కు తెలియంది కాదు. అందుకే స్లో ప్రాసెస్ ను ఎంచుకున్నారు. కెసిఆర్ కు ధైర్యం సరిపోయి, ఎన్నికలు జరిపిన తరువాత కానీ స్పీడ్ అందుకోకుండా చూడాలన్నది ఆలోచనగా కనిపిస్తోంది. కానీ ఇలాంటి వ్యవహారం కార్పొరేట్ కంపెనీలకు చాలా కష్టం. వారి భవిష్యత్ ప్రాజెక్టులపై ప్రభావం చూపిస్తుంది. అందుకే ఎల్ అండ్ టి తెలివిగా లేఖ రాసి, ప్రభుత్వాన్ని కార్నర్ లోకి నెట్టింది. ఇప్పటికైనా ప్రాజెక్టు స్పీడు అందుకోవాలి. లేకుంటే మళ్లీ ఇదే తీరు కొనసాగుతుంది. అప్పుడైనా కెసిఆర్ సరైన సమాధానం చెప్పాల్సి వస్తుంది,. మరోసారి కుట్ర అంటే జనం అంగీకరించరు కదా.

Leave a Comment