సంతోషంగా ఉన్నాను

images (5)తమిళసినిమా : తమిళం, తెలుగు చిత్రాలతో నేను చాలా సంతృప్తిగా, సంతోషంగా ఉన్నానంటున్నారు అందాల తార హన్సిక. ఇప్పటికే తమిళంలో యమ బిజీగా ఉన్న ఈ ముద్దుగుమ్మ తాజాగా టాలీవుడ్ పైనా ప్రత్యేక దృష్టి సారిస్తున్నారు. వచ్చే నెల నుంచి ఈ అమ్మడు నటించిన తమిళ చిత్రాలు డిసెంబర్ వరకు వరుసగా తెరపైకి రావడానికి సిద్ధం అవుతున్నాయి. వాటిలో హన్సిక తొలిసారిగా హారర్ పాత్ర పోషించిన అరణ్మణై చిత్రం విడుదలకు ముస్తాబవుతోంది. కాగా చక్క నమ్మ చిక్కినా అందమే అన్నట్లు బాగా బరువు తగ్గి నాజూగ్గా తయారయ్యారు. అయితే కావాలని, కష్టపడి, నోరు కుట్టుకుని శారీరక వ్యాయమం చేసి బరువు తగ్గలేదన్నారు. తాను చాలా చిన్న వయసులోనే నటిగా రంగ ప్రవేశం చేశానన్నారు. 17, 18 ఏళ్ల ప్రాయంలో ఏ అమ్మాయి అయినా పుష్టిగా ఉంటారన్నారు. మళ్లీ 21 ఏళ్ల వయసు వచ్చే సరికి సన్నబడుతుంటారని చెప్పారు. ఇప్పుడు తన పరిస్థితి అలాంటిదేనన్నారు. అంతేకానీ బరువు తగ్గాలనే నిర్ణయాన్ని తానెప్పుడు తీసుకోలేదన్నారు. ఇక బాలీవుడ్ రంగ ప్రవేశం ఎప్పుడన్న ప్రశ్నకు హన్సిక బదులిస్తూ తాను తమిళం, తెలుగు చిత్రాలతో చాలా కంఫర్టబుల్‌గా ఉన్నానని అందువల్ల, బాలీవుడ్ రంగ ప్రవేశం గురించిన ఆలోచనే లేదని బదులిచ్చారు. హీరోయిన్‌గా తన కెరీర్‌ను దక్షిణాదిలోనే ప్రారంభించానన్నారు. ఇక్కడా అవకాశాలతో చాలా సంతోషంగా ఉన్నానన్నారు. ఇక బాలీవుడ్ స్టార్ అనిపించుకోవాలనే ఆశ తనకు లేదని హిందీ చిత్రాల్లో నటించడం తనకు ఇంపార్టెంట్ కాదని స్పష్టం చేశారు. హిందీలో చాలా అవకాశాలు వస్తున్నాయని అయితే వాటిలో ఏ ఒక్క అవకాశాన్ని అంగీకరించలేదని హన్సిక తెలిపారు.

Leave a Comment