సానియా జోడి సంచలనం

81407705565_625x300– ప్రపంచ రెండో ర్యాంక్ జంటపై గెలుపు
– రోజర్స్ కప్ ఫైనల్లోకి ప్రవేశం
మాంట్రియల్ (కెనడా): 
వరుసగా మూడు ఓటముల నుంచి గుణపాఠం నేర్చుకున్నారో ఏమోగానీ… రోజర్స్ కప్ డబ్ల్యూటీఏ ప్రీమియర్ టెన్నిస్ టోర్నమెంట్‌లో సానియా మీర్జా (భారత్)-కారా బ్లాక్ (జింబాబ్వే) ద్వయం సంచలనం సృష్టించింది. భారత కాలమానం ప్రకారం శనివారం అర్ధరాత్రి దాటాక జరిగిన సెమీఫైనల్లో సానియా-కారా బ్లాక్ జోడి 7-6 (7/3), 3-6, 13-11తో ప్రపంచ రెండో ర్యాంక్ జంట సెయి సు వీ (చైనీస్ తైపీ)-పెంగ్ షుయె (చైనా)పై అద్భుత విజయం సాధించి ఫైనల్లోకి దూసుకెళ్లింది. సెయి సు వీ-పెంగ్ షుయెలతో ఈ సీజన్‌లో ఆడిన మూడు మ్యాచ్‌ల్లో సానియా జంటకు ఓటమి ఎదురైంది.

నాలుగోసారి మాత్రం ఈ ఇండో-జింబాబ్వే జోడి బదులు తీర్చుకుంది. గంటా 50 నిమిషాలపాటు జరిగిన సెమీఫైనల్లో సానియా-కారా బ్లాక్ నిర్ణాయక ‘సూపర్ టైబ్రేక్’లో  9-6తో ఆధిక్యంలోకి వెళ్లింది. ఆ తర్వాత తడబడి 10-11తో మ్యాచ్ పాయింట్‌ను కాచుకునే స్థితికి వెళ్లింది. అయితే కీలకదశలో వరుసగా మూడు పాయింట్లు నెగ్గి సానియా-కారా బ్లాక్ ఫైనల్లో స్థానాన్ని ఖాయం చేసుకున్నారు. జంటగా సానియా-కారా బ్లాక్‌కిది 40వ విజయం కావడం విశేషం. ఫైనల్లో టాప్ సీడ్, ప్రపంచ నంబర్‌వన్ రొబెర్టా విన్సీ-సారా ఎరాని (ఇటలీ) జోడితో సానియా-కారా బ్లాక్ జంట ఆడుతుంది.