అప్పుడే బై చెప్తా

images (3)నాయికగా ఉన్నత స్థాయిలో ఉండగానే నటనకు స్వస్తి పలుకుతానంటోంది నటి సమంత. ఇది నిజంగా ఆమె అభిమానులు జీర్ణించుకోలేని విషయమే. ప్రస్తుతం టాలీవుడ్‌లో ఈ అమ్మడి హవా యమాగా నడుస్తోంది. యువ హీరోల నుంచి సీనియర్ల వరకు సమంతతో జతకట్టడానికే ఆసక్తి చూపుతున్నారు. అక్కడ ఈ బ్యూటీ చిత్రాలు వరస విజయాలు సాధించడం కూడా ఇందుకు కారణం కావచ్చు. అయితే పాపం ఎందుకనో ఈ చెన్నై చంద్రానికి కోలీవుడ్‌లో విజయాలు ముఖం చాటేస్తున్నాయి. ఇటీవల నటించిన అంజాన్ చిత్రంలో అందాలు విచ్చలవిడిగా ఆరబోసినా లాభం లేకపోయింది. విధంచెడ్డా ఫలితం దక్కాలంటారు.

ఈ విషయంలో కూడా సమంత పరిస్థితి రివర్స్ అయ్యింది. ప్రస్తుతం విజయ్ సరసన నటిస్తున్న కత్తి, విక్రమ్‌కు జంటగా నటిస్తున్న చిత్రంపైన ఆశలు పెట్టుకున్న సమంత తొలి రోజుల్లో చాలా సమస్యల్ని ఎదుర్కొందట. చిత్ర పరిశ్రమకు నూతన నాయికల రాక నానాటికి అధికం అవుతూనే ఉంది. వారిలో కొందరు ఒకటి రెండు చిత్రాలతోనే కనుమరుగై పోతున్నారు. కొందరు నిలదొక్కుకున్నప్పటికీ రకరకాల సమస్యలు నెదుర్కొంటున్నారు. అలాంటి వారికి ధైర్యం చాలా అవసరం.

ప్రేమ వ్యవహారంలో చిక్కుకుని  కొందరు ఆత్మహత్యలకు కూడా పాల్పడుతున్నారు. ఇలాంటి పరిస్థితి గురించి సమంత స్పందిస్తూ చిత్ర పరిశ్రమలో చాలా అననుకూల పరిస్థితులను ఎదుర్కోవలసి ఉంటుందని చెప్పింది. కొన్ని క్లిష్ట పరిస్థితులు ఎదురయ్యినప్పుడు తాను కూడా సినిమాకు దూరం అవ్వాలనే నిర్ణయానికొచ్చానని చెప్పింది. అయితే తన శ్రేయస్సు కోరిన కొందరు ఆ ఆలోచనను మానుకునేలా చేసి ధైర్యాన్ని కూడగట్టారని తెలిపింది. అదేవిధంగా మార్కెట్ పోయిన తరువాత నటనకు స్వస్తి చెప్పడం తనకిష్టం లేదని పేర్కొంది. నాయికగా మంచి స్థాయిలో ఉన్నప్పుడే సినిమాకు గుడ్ బై చెబుతానని సమంత వెల్లడించింది.

Leave a Comment