ఆంధ్రప్రదేశ్‌లో గృహాల కొరత

download (4)ఆంధ్రప్రదేశ్‌లో పట్టణ పేదలకు 12.70 లక్షల గృహాల కొరత ఉందని కేంద్ర పట్టణాభివృద్ధి శాఖ ప్రకటించింది. దేశవ్యాప్తంగా 1.8 కోట్ల గృహాల కొరత ఉండగా… అందులో దాదాపు 7 శాతం కొరత ఇక్కడే ఉన్నట్లు వెల్లడించింది. ఆంధ్రప్రదేశ్‌లో మురికివాడలూ పెద్దసంఖ్యలో ఉన్నాయి. మురికివాడల అభివృద్ధికి, మౌలిక సదుపాయాల కల్పనకు కేంద్ర ప్రభుత్వం సర్దార్ వల్లభాయ్ పటేల్ ఆవాస యోజన కార్యక్రమాన్ని చేపట్టనుంది. తద్వారా 2022 నాటికి దేశంలో అందరికీ గృహవసతి కల్పించాలని లక్ష్యం ఏర్పరుచుకుంది. ఈ మేరకు మురికివాడలను అభివృద్ధి చేసి, పట్టణ పేదలకు గృహ నిర్మాణ వసతి కల్పిచేందుకు ప్రత్యామ్నాయాలను సిద్ధం చేసింది. పేదలకు తాత్కాలిక వసతితో పాటు, అద్దె గృహాల ప్రతిపాదననూ తెరపైకి తెచ్చింది. ఉపాధి, విద్య కోసం పట్టణాలకు వచ్చే వారి సంఖ్య ఎక్కువవుతుండడంతో పట్టణాల్లో జనాభా వేగంగా పెరుగుతోంది. ఆయా నగరాల్లో గృహాలు కొనుగోలు చేయడం కష్టమవుతోంది. దీంతో వలస వస్తున్న పేదలు రోడ్ల పక్కన, చెరువులు, మురుగు కాలువలున్న చోట, ప్రభుత్వ స్థలాల్లో గుడిసెలు, తాత్కాలిక గృహాలు ఏర్పాటు చేసుకుంటున్నారు. ఇలా ఏర్పడిన మురికివాడలను అన్ని మౌలిక సదుపాయాలతో కూడిన కాలనీలుగా మార్చాలని ప్రభుత్వం భావిస్తోంది.
మురికవాడల విషయంలో దేశంలో ఆరో స్థానం..: ఆంధ్రప్రదేశ్‌లో మురికివాడల్లో నివసించే జనాభా 50.67 లక్షలుగా ఉంది. దేశంలోని మిగతా రాష్ట్రాలతో పోలిస్తే ఆంధ్రప్రదేశ్ ఆరో స్థానంలో ఉంది. దేశవ్యాప్త మురికివాడల్లోని జనాభాలో 9 శాతం ఇక్కడే ఉంది. ఇక తెలంగాణ రాష్ట్రంలో మురికివాడల్లో నివసించే ప్రజల సంఖ్య 45.20 లక్షలుగా ఉంది. మొత్తం మురికివాడల్లో నివసించే జనాభాలో 7 శాతం తెలంగాణలో ఉండగా.. ఈ విషయంలో ఆ రాష్ట్రంలో దేశంలో ఏడో స్థానంలో ఉంది.

ఇవీ ప్రతిపాదనలు…
చి కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వ స్థలాల్లోని మురికివాడల్లో పేదలకు అక్కడే గృహాలను నిర్మించాలి. ప్రైవేటు బిల్డర్లు పేదలకు ఉచితంగా ఇళ్లు కట్టివ్వాలి. కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలు ఈ తరహా అభివృద్ధికి 60-75 శాతం ఆర్థిక సహాయం చేస్తాయి. ప్రైవేటు స్థలాల్లోని మురికివాడలను ఎలా అభివృద్ధి చేయాలన్న విషయమై ప్రభుత్వం ప్రణాళిక రూపొందిస్తోంది.

చి కుంటలు, చెరువులు, మురుగునీటి కాలువలున్న చోట.. హైటెన్షన్ తీగలున్న ప్రాంతాల్లో అక్కడికక్కడే మెరుగైన సౌకర్యాలు కల్పించడం కష్టం కాబట్టి వాటిని ఇతర ప్రాంతాలకు తరలించి అక్కడ అభివృద్ధి చేయాలన్న ఆలోచనతో ఉంది.

చి అనధికార కాలనీల్లో మౌలిక సదుపాయాల కొరత అధికంగాఉంది. ఆయాకాలనీల్లో రోడ్లు, తాగునీరు, మురుగునీటి పారుదల వ్యవస్థ కల్పించాలి.

చి భవిష్యత్తు వలసలను దృష్టిలో పెట్టుకుని ముందస్తు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేయాలి. పీపీపీ పద్ధతిలో చౌకధరల్లో గృహాలు నిర్మించాలి. ప్రాజెక్టులకు ఏక గవాక్ష అనుమతులు ఉండాలి.

చి వలస వచ్చేవారి కోసం తక్కువ ధరలకే ఇళ్లు అందుబాటులోకి తీసుకురావాలి. అవసరమైతే తాత్కాలిక అద్దె ప్రాతిపదికన గృహాలు కేటాయించాలి. అద్దె గృహాల ప్రాజెక్టుకు కేంద్రం 60-75 శాతం ఆర్థిక సహాయం చేస్తుంది

Leave a Comment