‘భారతీయ ముస్లింలు దేశభక్తులు..’

images (3)భారతదేశంలో ముస్లింలను తమవైపుకు తిప్పుకునే దిశగా అల్‌ఖైదా వంటి తీవ్రవాద సంస్థలు భారతదేశంలో కార్యకలాపాల్ని ఉధృతం చేయడానికి ప్రయత్నిస్తుండడాన్ని ప్రధాని నరేంద్ర మోడీ ఖండించారు. ‘వారి ప్రయత్నాలు వృధా.. భారతదేశంలోని ముస్లింలకు దేశభక్తి ఎక్కువ.. దేశం కోసం ప్రాణాలర్పించడానికైనా భారతీయ ముస్లింలు సిద్ధపడ్తారు.. వారు కేవలం ముస్లింలు మాత్రమే కాదు, వారు భారతీయులు కూడా.. మతాల వారీగా ఎవర్నీ భారతదేశంలో విడదీయలేం.. అందరం భారతీయులం..’ అని నరేంద్ర మోడీ ఓ అంతర్జాతీయ న్యూస్‌ ఛానల్‌కి ఇచ్చిన ఇంటర్వ్యూలో వ్యాఖ్యానించడం ప్రపంచ వ్యాప్తంగా చర్చనీయాంశమయ్యింది. ప్రపంచానికి ఉగ్రవాదం పెను సవాల్‌ విసురుతోన్న విషయం విదితమే. అమెరికా లాంటి అగ్ర రాజ్యమే ఉగ్రవాద దాడులతో ఉలిక్కిపడాల్సి వచ్చింది. ఉగ్రవాదానికి మతం లేదు.. దేశం లేదు.. ఇంకేమీ లేదు.. వారిది రాక్షసత్వం.. అని ప్రపంచ దేశాలన్నీ గొంతెత్తి నినదిస్తున్నాయి. అలా నినదిస్తున్న వాటిల్లో బాధిత దేశాల ఆవేదన అంతా ఇంతా కాదు. భారతదేశమూ ఉగ్రవాద పీడిత దేశమే. పొరుగున్న పాకిస్తాన్‌ నుంచీ, ఆఫ్గనిస్తాన్‌ నుంచీ, బంగ్లాదేశ్‌ నుంచీ భారతదేశంలోకి ఉగ్రవాదులు చొచ్చుకు వస్తుండడం.. దేశంలో విధ్వంసం సృష్టిస్తుండడం తెల్సిన విషయాలే. ఉగ్రవాదానికి మతం ముసుగు తొడగడం, అలా ఉగ్రవాదంపై అధికారంలో వున్నవారు ఏమన్నా వ్యాఖ్యలు చేస్తే ఓ మతానికి వాటిని అంటగట్టడం జరుగుతూ వస్తోంది. ఈ నేపథ్యంలో ప్రధాని ఉగ్రవాదంపై చేసిన వ్యాఖ్యలు అత్యంత బాధ్యతాయుతంగా వున్నాయనే చెప్పాలి. నరేంద్ర మోడీ భారతీయ ముస్లింల గురించీ, భారతీయత గురించీ, ముస్లింలలో దేశభక్తి గురించీ అత్యంత బాధ్యతాయుతంగా వ్యవహరించారనే ప్రశంసలు సర్వత్రా విన్పిస్తున్నాయి.

Leave a Comment