మనోళ్లు మెరుస్తారా

images (5)డేవిస్ కప్ అంటే లియాండర్ పేస్, ఇతర భారత ఆటగాళ్ల హోరాహోరీ పోరాటాలు గుర్తుకొస్తాయి. ఇప్పుడు మళ్లీ అలాంటి మరో పోరాటానికే భారత జట్టు సిద్ధమవుతోంది. ఈసారి ప్రత్యర్థి.. డేవిస్‌కప్‌లో అత్యంత బలమైన జట్త్టెన సెర్బియా. ఇదే సెర్బియా.. 2010 డేవిస్‌కప్ ఎలైట్ గ్రూపు(తుది 16)లో ప్రవేశించిన భారత్‌ను తొలి రౌండ్‌లోనే ఓడించింది. అయితే ప్రస్తుతం ఆ జట్టులో ప్రపంచ నెంబర్ వన్ నొవాక్ జకోవిచ్ లేడు. మరో స్టార్ క్రీడాకారుడు తిప్సెరెవిచ్ కూడా లేడు. మరి లియాండర్ పేస్, సోమ్‌దేవ్, యుకి బాంబ్రి, రోహన్ బోపన్నలతో కూడిన భారత్ జట్టు శుక్రవారం ఆరంభమయ్యే డేవిస్‌కప్ ప్లే-ఆఫ్ పోరులో సెర్బియాను ఓడిస్తుందా?
బెంగళూరు :డేవిస్ కప్‌లో భారత్ ఆటగాళ్లు అంచనాలకు మించి రాణిస్తారు. సెర్బియాతో పోరులోనూ అలా రాణిస్తేనే భారత్ గట్టెక్కుతుంది. ఎందుకంటే భారత అగ్రశ్రేణి సింగిల్స్ ఆటగాడు సోమ్‌దేవ్ దేవ్‌వర్మన్ ఫామ్ ఈ సీజన్లో అంత గొప్పగా లేదు. ఏటీపీ టూర్లలో ఒకటి, రెండు రౌండ్లకే పరిమితమయ్యాడు. ఐతే షాంఘై ఓపెన్ సింగిల్స్, డబుల్స్ విభాగాల్లో ఫైనల్‌కు చేరడం అతడి ఆత్మవిశ్వాసాన్ని పెంచుతుందనడంలో సందేహం లేదు. పైగా డేవిస్‌కప్‌లో ఎప్పుడూ సోమ్‌దేవ్ తన అత్యుత్తమ ఆటతీరును కనబరుస్తాడు. శుక్రవారం జరిగే రెండో సింగిల్స్‌లో సెర్బియా క్రీడాకారుడు ఫిలిప్ క్రాజ్నోవిచ్‌పైనా సోమ్‌దేవ్ అదే ఆటతీరు ప్రదర్శిస్తే.. భారత్‌కు అవకాశాలుంటాయి. సెర్బియా లైనప్‌లో బలహీన ఆటగాడు ఫిలిప్ క్రాజ్నోవిచే. అతడిని ఓడిస్తే వాళ్ల అగ్రశ్రేణి ఆటగాడు దుసాన్ లాజోవిచ్(ప్రపంచ ర్యాంక్ 61)పై ఒత్తిడి పెరుగుతుంది. డ్రా ప్రకారం తొలి సింగిల్స్‌లో యుకి బాంబ్రి.. లాజోవిచ్‌తో, రెండో సింగిల్స్‌లో సోమ్‌దేవ్… క్రాజ్నోవిచ్‌తో తలపడనున్నారు. యుకి బాంబ్రి ఏమేరకు రాణిస్తాడో చెప్పలేం. చెన్నై ఛాలెంజ్ నెగ్గి ఈ సీజన్‌ను ఆశావహంగా ఆరంభించిన యుకి.. తర్వాత గాయంతో చాలా టోర్నీలకు దూరమయ్యాడు. శుక్రవారం జరిగే రెండు సింగిల్స్ మ్యాచ్‌ల్లో భారత్ ఒక్కటి గెలిచినా డబుల్స్ కీలకమవుతుంది. భారత్‌కు లియాండర్ పేస్, రోహన్ బోపన్నల రూపంలో అనుభవజ్ఞులైన డబుల్స్ ఆటగాళ్లున్నారు. మనకు పేస్‌లానే సెర్బియాకూ జిమోంజిచ్ రూపంలో అనుభవజ్ఞుడైన డబుల్స్ ఆటగాడున్నాడు. బోజాలచ్‌తో కలిసి 2013లో జిమోంజిచ్ బ్రయాన్ సోదరులను ఓడించాడు. అయితే పేస్ బోపన్నలను తేలిగ్గా తీసుకోమంటున్నాడు జిమోంజిచ్. ”రోహన్, లియాండర్ పేస్‌లతో ఇంతకుముందు ఆడాను. ఇద్దరూ గొప్ప ఆటగాళ్లు. కచ్చితంగా వారితో పోరు హోరాహోరీగానే ఉంటుంది” అని జిమోంజిచ్ చెప్పాడు.

Leave a Comment