చరిత్ర సృష్టించిన షట్లర్లు

images (6)భారత మహిళా షట్లర్లు చరిత్ర సృష్టించారు. ఆసియా క్రీడల బ్యాడ్మింటన్‌లో పతకం కోసం 28 ఏళ్లుగా కొనసాగుతున్న నిరీక్షణకు తెరదించారు. మహిళల టీమ్ విభాగంలో సెమీఫైనల్ చేరిన భారత్.. కనీసం కాంస్యం చేసుకుంది. శనివారం క్వార్టర్‌ఫైనల్లో భారత్ 3-2తో పటిష్ట థాయిలాండ్ జట్టును ఓడించి సెమీస్‌లోకి దూసుకెళ్లింది. మొదట సింగిల్స్ పోరాటాల్లో సైనా నెహ్వాల్, పి.వి.సింధు అద్భుత విజయాలు సాధించగా.. ఆపై నిర్ణయాత్మక పోరులో సింధు, అశ్విని పొన్నప్ప డబుల్స్ పోరులో నెగ్గి భారత్‌కు చరిత్రాత్మక విజయాన్నందించారు.
గంటా 7 నిమిషాల పాటు హోరాహోరీగా సాగిన తొలి సింగిల్స్ పోరులో ప్రపంచ నెం.7 సైనా.. 2013 ప్రపంచ ఛాంపియన్ రచనోక్‌ను ఓడించి భారత్‌కు శుభారంభాన్నందించింది. సైనా 21-15, 17-21, 21-18తో రచనోక్‌పై విజయం సాధించింది. తొలి గేమ్‌లో 8-11తో వెనుకబడిన స్థితి నుంచి 13-11తో ఆధిక్యంలోకి వచ్చిన సైనా.. చివరిదాకా ఆధిక్యాన్ని కొనసాగించి గేమ్ గెలిచింది. రెండో గేమ్‌లో పుంజుకుని స్కోరు సమం చేసిన రచనోక్.. నిర్ణయాత్మక మూడో గేమ్‌లో ఓ దశలో 10-6 ఆధిక్యంలో నిలిచింది. సైనా కాస్త పుంజుకున్నా మళ్లీ 11-16తో వెనుకబడింది. ఇక మ్యాచ్ పోయినట్లే అనుకుంటున్న దశలో సైనా అద్భుతంగా పుంజుకుని 17-17తో స్కోరు సమం చేసింది. చివరి నిమిషాల్లో ప్రత్యర్థిని మరింత ఒత్తిడిలోకి నెట్టి మ్యాచ్ ఎగరేసుకుపోయింది. సైనా అందించిన ఉత్సాహాన్ని రెట్టింపు చేస్తూ రెండో సింగిల్స్‌లో సింధు 21-15, 21-13తో పోర్న్‌టిప్‌పై సునాయాసంగా నెగ్గి భారత్‌కు 2-0 ఆధిక్యాన్నందించింది. దీంతో భారత్ సెమీస్ చేరడమిక లాంఛనమే అనిపించింది. కానీ మూడో సింగిల్స్‌లో తులసి 12-21, 14-21తో బుసానన్ చేతిలో.. తొలి డబుల్స్‌లో సిక్కిరెడ్డి-ప్రద్న్య గాద్రె జోడీ 17-21, 21-18, 16-21తో పోర్న్‌టిప్-కుంచల జంట చేతిలో ఓడటంతో మ్యాచ్ స్కోరు 2-2తో సమమైంది. ఈ స్థితిలో చివరి డబుల్స్‌లో సింధు-అశ్విని జోడీ అద్భుతంగా ఆడి భారత్‌ను విజేతగా నిలిపింది. ఈ జోడీ 21-16, 21-17తో సప్సిరి-సరలీ జంటను ఓడించింది. అంతకుముందు భారత్ 3-0తో మకావును చిత్తు చేసి క్వార్టర్స్ చేరింది. సింగిల్స్‌లో సైనా, సింధు.. డబుల్స్‌లో సిక్కి-ప్రద్న్య ప్రత్యర్థుల్ని వరుస సెట్లలో అలవోకగా ఓడించారు.

Leave a Comment