ట్విట్టర్ ఉద్యోగులను చంపేస్తాం: ఇస్లామిక్ స్టేట్

images (7)వాషింగ్టన్ : మైక్రో బ్లాగింగ్ సైట్ ట్విట్టర్ ఉద్యోగులను చంపేస్తామంటూ ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులు హెచ్చరికలు జారీ చేశారు. ఈ హెచ్చరికలను కూడా వాళ్లు ట్విట్టర్లోనే పెట్టడం గమనార్హం. అమెరికా, యూరప్ దేశాల్లో ఉన్న తమ ‘లోన్ వూల్వ్స్’ను ట్విట్టర్ ఉద్యోగులపై ఓ కన్నేసి ఉంచాలని, దాడులు చేయాలని పిలుపునిచ్చారు. ”ట్విట్టర్ యాజమాన్యంపై నేరుగా దాడులకు పాల్పడాలి, వాళ్ల ఉద్యోగులను హతమార్చాలి!! ఈ పని చేయాల్సింది స్లీపర్ సెల్స్” అని ఇస్లామిక్ స్టేట్ తన ట్వీట్లో పేర్కొంది.

అలాగే, శాన్ఫ్రాన్సిస్కోలో ఉన్న ప్రతి ఒక్క ట్విట్టర్ ఉద్యోగి మీద దాడి చేయాలని, వాళ్లంతా జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. వాళ్ల గుమ్మం ఎదుటే ఒక లోన్ వుల్ఫ్ హంతకుడు సిద్ధంగా ఉన్నాడన్న సంగతిని గుర్తుంచుకోవాలన్నారు. ఇలాంటి హెచ్చరికలు పంపిన రెండు అకౌంట్లను ట్విట్టర్ సస్పెండ్ చేసింది. జెరూసలెంకు చెందిన అల్ నస్రా అల్ మక్దీషియా అనే బృందం కూడా ఇస్లామిక్ స్టేట్ ఉగ్రవాదులకు సహాయం చేస్తోందని సమాచారం.

Leave a Comment