జమ్మూలో భారీ ఎత్తున నీటి శుద్ధీకరణ

images (2)న్యూఢిల్లీ: వరదల తాకిడికి గురైన జమ్మూ కాశ్మీర్‌లో 14వరోజు సహాయక చర్యలు కొనసాగాయి. పలు ప్రాంతాల్లో నిలిచిపోయిన నీటిని భారీ యంత్రాలతో తొలగిస్తున్నారు. రాజ్‌భాగ్, జవహర్‌నగర్, గోగ్జిభాగ్, ఇక్రాజ్‌పుర తదితర ప్రాంతాల్లో వీటిని ఏర్పాటు చేసి వరద నీటిని తోడేస్తున్నారు. వీటిలో ఒక భారీ పంప్‌ను ఓఎన్జీసీ ఏర్పాటు చేసింది. మరికొన్నింటిని మంగళవారం ఏర్పాటు చేయనున్నారు. వరదల కారణంగా కలుషితమైన నీటిని భారీ ఎత్తున శుద్ధి చేస్తున్నారు. ఇప్పటివరకు 13 టన్నుల నీటి శుద్ధి మాత్రలను శ్రీనగర్ తరలించారు. దాదాపు 33 వేల దుప్పట్లను కేంద్ర జౌళి శాఖ, రెడ్ క్రాస్ సంస్థ, జార్ఖండ్, పంజాబ్ ప్రభుత్వాలు జార్ఖండ్‌కు తరలించాయి. ఇప్పటివరకు 2.4 లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. శ్రీనగర్-బారాముల్లా మార్గాల్లో రైళ్ల రాకపోకలను పాక్షికంగా పునరుద్ధరించారు. వరదల కారణంగా కలుషితమైన నీటిని తాగలేక ఇబ్బంది పడుతున్న కాశ్మీర్ ప్రజల దాహార్తిని హైదరాబాద్‌కు చెందిన స్మార్ట్ ఇండియా ప్రైవేటు లిమిటెడ్ కంపెనీ తీరుస్తోంది. నీటి శుద్ధి యంత్రాలను ఏర్పాటు చేసి సురక్షిత నీటిని అందజేస్తుంది. రోజుకు 4 లక్షల లీటర్ల నీటిని శుద్ధి చేసే సామర్థ్యం గల 20 యంత్రాలను తరలించి నీటిని పంపిణి చేస్తున్నారు. ఈ యంత్రాలపై ఉన్న తెలుగు అక్షరాలు బాధిత ప్రజలకు అర్థం కాకున్నా.. దాహార్తిని తీరుస్తున్న ఆ యంత్రాలపై వారు తమ అనుబంధాన్ని పెంచుకున్నారు. ఢిల్లీ నుంచి తీసుకొచ్చిన మరికొన్ని శుద్ధి యంత్రాలను శ్రీనగర్‌లో ఏర్పాటు చేశారు. వరదల కారణంగా పలు రహదార్లు దెబ్బతినడంతో నిత్యవసరాలు, కూరగాయల సరఫరా లేకపోవడంతో ధరలు మిన్నంటుతున్నాయి. కొన్ని చోట్ల ప్రజలు గ్యాస్ కొరతతో ఇబ్బందులు పడుతున్నారు. బాధితులకు సాయం అందించేందుకు దేశవ్యాప్తంగా వస్తున్న సహాయక సామగ్రిని అందించేందుకు కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాలకు సహకరించేందుకు ఢిల్లీ భాజపా విభాగం సహాయక కేంద్రాన్ని ఏర్పాటు చేసేందుకు సోమవారం నిర్ణయం తీసుకుంది.
వరద ప్రాంతాల్లో చిక్కుకున్న బాధితులను ఇప్పటివరకు 2.4లక్షల మందిని సురక్షిత ప్రాంతాలకు తరలించారు. సాయుధ బలగాలు, జాతీయ విపత్తు స్పందనా దళం ఇప్పటివరకు 2.4 లక్షల మందిని కాపాడినట్లు రక్షణ శాఖ వర్గాలు తెలిపాయి. 80 సరకు రవాణా విమానాలు, హెలికాప్టర్లు సహాయక చర్యల్లో పాల్గొన్నట్లు పేర్కొన్నాయి. జమ్మూ, శ్రీనగర్‌లలో సాయుధ బలగాలు 19 పునరావాస కేంద్రాలను నెలకొల్పాయి.

శ్రీనగర్ ఒక్కటే కాదు.. మిగిలిన జిల్లాలనూ పట్టించుకోండి: సుప్రీం
జమ్మూకాశ్మీరులో వరదబాధితులను రక్షించి పునరావాసం కల్పించే విషయంలో కేవలం శ్రీనగర్‌పైనే దృష్టిని పరిమితం చేయకుండా ఇతర జిల్లాలపైనా దృష్టిసారించాలని సుప్రీంకోర్టు సోమవారం.. కేంద్రప్రభుత్వానికి, జమ్మూకాశ్మీరు ప్రభుత్వానికి సూచించింది.

 

Leave a Comment