గిన్నిస్ రికార్డుల్లోకి జెన్నీఫర్ లారెన్స్

images (4)సుప్రసిద్ధ హాలీవుడ్ నటి జెన్నీఫర్ లారెన్స్ కీర్తి కిరీటంలో ఇప్పుడు మరో తురాయి వచ్చి చేరింది. అత్యంత విజయవంజమైన సినీ హీరోయిన్‌గా ఆమె తాజాగా గిన్నీస్ వరల్డ్ రికార్డుల్లోకి ఎక్కారు. విశేష ప్రాచుర్యం పొందిన హంగర్ గేమ్స్ సిరీస్ చిత్రాల్లో కట్నిస్ ఎవర్డీన్ పాత్ర పోషించడం ద్వారా జెన్నీఫర్ లారెన్స్‌ను ఈ అదృష్టం వరించింది. ‘ది హంగర్ గేమ్స్’, దానికి సీక్వెల్ అయిన ‘క్యాచింగ్ ఫైర్’ చిత్రాలు ప్రపంచవ్యాప్తంగా 90 కోట్ల పౌండ్లకు పైగా వసూళ్ళు సాధించడంతో ఈ రికార్డు సాధ్యమైందని ‘టెలిగ్రాఫ్’ పత్రిక పేర్కొంది.

2010 నాటి ‘వింటర్స్ బోన్’ చిత్రం ద్వారా సినీ రంగ ప్రవేశం చేసిన ఈ అందాల భామ ‘ఎక్స్ మెన్ – ఫస్ట్ క్లాస్’, దాని సీక్వెల్ అయిన ‘ఎక్స్ మెన్ – డేస్ ఆఫ్ ఫ్యూచర్ పాస్ట్’, ‘అమెరికన్ హజిల్’ లాంటి విజయవంతమైన చిత్రాల్లో ప్రధాన భూమిక పోషించారు. డేవిడ్ ఓ రస్సెల్ రూపొందించిన ‘సిల్వర్ లైనింగ్స్ ప్లేబుక్’లో నటనకు గాను 2013 ఆస్కార్ అవార్డుల్లో ఉత్తమ నటిగా ఎంపికైన ఘనత ఈ హాలీవుడ్ నటిది. ఆమెతో పాటు, ఇంటర్నెట్‌లో అత్యధికులు అన్వేషించిన పాప్‌స్టార్‌గా సింగర్ మిలీ సైరస్ కూడా తాజాగా గిన్నిస్ రికార్డుల్లోకి ఎక్కారు.

Leave a Comment