ఆరు నెలల్లో ఐదు సినిమాలు వదులుకున్నా!

41406224657_625x300‘‘ఐదారు ఫ్లాప్ సినిమాల్లో నటించడంకన్నా ఒక్క హిట్ సినిమాలో నటించడం మిన్న’’ అంటున్నారు కరీనా కపూర్. ఈ బ్యూటీ ఇలా అనడానికి కారణం ఉంది. ఈ మధ్యకాలంలో కొంతమంది ప్రముఖుల చిత్రాలను కాదనేశారామె. దీని గురించి కరీనా కపూర్ చెబుతూ -‘‘ఆరు నెలల్లో ఐదు సినిమాలు వదులుకున్నా. వాటిల్లో కథలు నచ్చక తిరస్కరించినవే ఎక్కువ. ఎంతో గొప్పగా ఉంటే తప్ప ఒప్పుకోకూడదని నిర్ణయించుకున్నా. ఒకవేళ చేతిలో సినిమాలు లేవనుకోండి, హాయిగా ఇంట్లో కూర్చుని మంచి పుస్తకం చదువుతాను.
 
  లేకపోతే వేరే ఏదైనా చేస్తాను. అంతేకానీ, మనసుకు పూర్తిగా సంతృప్తినివ్వని చిత్రం ఎందుకు చేయాలి? నటిగా నాది పదిహేనేళ్ల కెరీర్. ఇన్నేళ్లల్లో మొహమాటానికి కొన్ని సినిమాలు చేశాను. ఇప్పుడా అవసరం లేదు. నేను తలదించుకోవాల్సిన పరిస్థితి కల్పించే సినిమాలు చేయాల్సిన అవసరం నాకేంటి? సైఫ్‌తో జీవితం బ్రహ్మాండంగా ఉంది. ఆ జీవి తాన్ని ఆస్వాదిస్తూ హాయిగా గడిపేస్తా’’ అన్నారు.
 
  మీరు వదులుకున్నవాటిల్లో దర్శకురాలు జోయా అక్తర్ సినిమా కూడా ఉంది కదా? అనే ప్రశ్న కరీనా ముందుంచితే -‘‘అవును. కొన్ని కారణాల వల్ల ఆ సినిమా ఒప్పుకోలేదు. కానీ, నేనేం బాధపడటంలేదు. ఎందుకంటే, జోయాకి ఇది చివరి సినిమా కాదు. నేను కూడా నటనకు ఫుల్‌స్టాప్ పెట్టలేదు కదా. భవిష్యత్తులో ఆమె ఏదైనా గొప్ప కథ వినిపిస్తే, కచ్చితంగా చేస్తా’’ అని చెప్పారు.

Leave a Comment